వరుసగా 3 టీ20 సెంచరీలు..! టీమిండియాకి ఓ పోలార్డ్ దొరికాడా?

ప్రస్తుతం దేశవాళీ క్రికెట్‌లో స్వస్తిక్‌ చికారా అనే పేరు మారుమోగిపోతుంది. ఉత్తరప్రదేశ్‌కు చెందిన యువ క్రికెటర్‌ భవిష్యత్తులో టీమిండియాను ఏలే ఆటగాడు అవుతాడంటూ క్రికెట్‌ వర్గాలు చర్చించుకుంటున్నాయి. నిజంగా ఇతనికి అంత టాలెంట్‌ ఉన్నట్లే కనిపిస్తోంది. చికారా తొలిసారి 2019లో లోకల్‌గా జరిగిన ఓ టోర్నీలో 167 బంతుల్లో ఏకంగా 585 పరుగులు చేసి.. దేశవాళీ క్రికెట్‌ దృష్టిని ఆకర్షించాడు. ఆ ఇన్నింగ్స్‌తో అతనికి ఉత్తరప్రదేశ్‌ తరఫున సీకే నాయుడు టోర్నీలో ఆడే అవకాశం దక్కింది.

ప్రస్తుతం చికారా వయసు 18 ఏళ్లు. ఉత్తరప్రదేశ్‌ అండర్‌ 25 టీమ్‌లో ఆడుతున్నాడు. అయితే.. ఉత్తరప్రదేశ్‌లో జరుగుతున్న యూపీ టీ20 లీగ్‌లో చికారా తన సత్తా చాటాడు. వరుసగా మూడు టీ20ల్లో మూడు సెంచరీలో చేసి.. సంచలనం సృష్టించాడు. యూపీ టీ20 లీగ్‌లో మీరట్‌ మావెరిక్స్‌ తరఫున ఆడుతున్న చికారా.. సెప్టెంబర్‌ 1న కాన్పూర్‌ సూపర్‌స్టార్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 57 బంతుల్లో 13 ఫోర్లు, 3 సిక్సులతో 100 పరుగులు చేశాడు. సెప్టెంబర్‌ 3న గోరఖ్‌పూర్ లయన్స్‌తో జరిగిన తర్వాత మ్యాచ్‌లో 49 బంతుల్లో 7 ఫోర్లు, 8 సిక్సులతో 101 పరుగులు చేశాడు. ఆ వెంటనే సెప్టెంబర్‌ 5న నోయిడా సూపర్‌కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 56 బంతుల్లో 10 ఫోర్లు, 6 సిక్సులతో 108 పరుగులు చేశాడు.

ఇలా వరుసగా మూడు మ్యాచ్‌ల్లో 3 సెంచరీలతో చెలరేగాడు. ఇక సెప్టెంబర్‌ 6న లక్నో ఫాల్కాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 39 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్సులతో 56 పరుగులు చేసి రాణించాడు. యూపీ టీ20లో లీగ్స్‌లో చికారా ఆడిన ఇన్నింగ్స్‌లో వచ్చే ఐపీఎల్‌ సీజన్‌ కోసం అతనిపై ఫ్రాంచైజ్‌లు కన్నేసే అవకాశం ఉంది. ఇలాంటి ప్రదర్శనలు మరికొన్ని చేస్తూ.. దేశవాళీ క్రికెట్‌లోనూ రాణిస్తే.. టీమిండియాలోకి కూడా ఎంట్రీ ఇవ్వచ్చు. అతని బ్యాటింగ్‌ స్టైల్‌ చూసిన క్రికెట్‌ అభిమానులు టీమిండియాకు కూడా పొలార్డ్‌ దొరికాడంటూ కామెంట్‌ చేస్తున్నారు. మరి స్వస్తిక్‌ చికారా బ్యాటింగ్‌ గురించి, ఆడిన ఇన్నింగ్స్‌లపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: నేను క్రికెటర్ అయినందుకు సిగ్గుపడుతున్నా.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!

Show comments