Sachin Tendulkar: సచిన్ అంటే బ్యాటింగ్ ఒక్కటే కాదు! 25 ఏళ్ల క్రితం జరిగిన అద్భుతం!

సచిన్‌ టెండూల్కర్‌ గురించి చెప్పమంటే.. చాలా మంది గొప్ప బ్యాట్స్‌మెన్‌ అని, 100 సెంచరీలు కొట్టిన వీరుడని చెప్తారు. కానీ, ఈ తరం వారికి సచిన్‌ గురించి తెలియని విషయాలు చాలా ఉన్నాయి. అందులో ఒకటి బాల్‌తో చేసిన మ్యాజిక్‌. దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

సచిన్‌ టెండూల్కర్‌ గురించి చెప్పమంటే.. చాలా మంది గొప్ప బ్యాట్స్‌మెన్‌ అని, 100 సెంచరీలు కొట్టిన వీరుడని చెప్తారు. కానీ, ఈ తరం వారికి సచిన్‌ గురించి తెలియని విషయాలు చాలా ఉన్నాయి. అందులో ఒకటి బాల్‌తో చేసిన మ్యాజిక్‌. దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

క్రికెట్‌ గాడ్‌ సచిన్‌ టెండూల్కర్‌ అంటే ఈ తరం వారికి గొప్ప బ్యాటర్‌గా మాత్రమే తెలుసు. కానీ, సచిన్‌ అంటే కేవలం బ్యాటింగ్‌ మాత్రమే కాదు.. అత్యుత్తమ బౌలర్‌ కూడా. ఒక బ్యాటర్‌గా సచిన్‌ మ్యాచ్‌ గెలిపించడం పెద్ద విషయం కాదు కానీ, తన బౌలింగ్‌తో కూడా టీమిండియాను ఒంటిచేత్తో గెలిపించిన సందర్భాలు ఉన్నాయి. 1998 ఏప్రిల్‌ 1న కొచ్చి వేదికగా ఇండియా-ఆస్ట్రేలియా మధ్య జరిగిన వన్డే మ్యాచ్‌ అందుకు చక్కటి ఉదాహరణ. ఆ మ్యాచ్‌లో టీమిండియా తొలుత బ్యాటింగ్‌ చేసి 309 పరుగుల భారీ స్కోర్‌ చేసింది. అప్పటి కెప్టెన్‌ మహమ్మద్‌ అజహరుద్దీన్‌ 82, అజయ్‌ జడేజా 105 పరుగులతో చెలరేగడంతో టీమిండియాకు భారీ స్కోర్‌ దక్కింది. కానీ, ప్రత్యర్థి ఆస్ట్రేలియా కావడంతో 300 పైచిలుకు లక్ష్యం కూడా గెలుపు అందించడం కష్టమే ఆ రోజుల్లో. అప్పటికే ఆస్ట్రేయలియా అద్భుతమైన జట్టుగా ఉంది.

310 పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగిన ఆస్ట్రేలియాకు ఓపెనర్లు మార్క్‌ వా, ఆడమ్‌ గిల్‌క్రిస్ట్‌ అద్భుతమైన స్టార్‌ అందించారు. తొలి వికెట్‌కు 102 పరుగులు జోడించారు. గిల్‌క్రిస్ట్‌ 61, మైఖెల్‌ బెవాన్‌ 65 పరుగులతో అదరగొట్టడంతో ఆస్ట్రేలియా టార్గెట్‌ దిశగా దూసుకెళ్లింది. 31.3 ఓవర్లలో 203 పరుగులు చేసి కేవలం 4 వికెట్లు మాత్రమే కోల్పోయింది. విజయానికి మరో 106 పరుగులకే కావాలి. చేతిలో 6 వికెట్లు 18 ఓవర్లు ఉన్నాయి. ఇలాంటి సమయంలో ఆస్ట్రేలియా విజయాన్ని ఆపడం ఎవరి తరం కాదని అందరికి అర్థమై ఉంటుంది. కానీ, అప్పుడే ఒకడు బంతికి తీసుకుని బరిలోకి దిగాడు. అతని రాకతో ఆస్ట్రేలియా బ్యాటింగ్‌ లైనప్‌ పేకమెడలా కుప్పకూలింది. 203 పరుగులకు 4 వికెట్లు కోల్పోయి పటిష్టస్థితిలో ఉన్న ఆస్ట్రేలియా 268 పరుగులకే ఆలౌట్‌ అయిపోయింది.

ఆస్ట్రేలియాను ఇంతలా దెబ్బ కొట్టింది.. గొప్ప పేరున్న బౌలర్‌ కాదు. బ్యాటింగ్‌ టెక్ట్స్‌బుక్‌, క్రికెట్‌ గాడ్‌ సచిన్‌ టెండూల్కర్‌. ఒకటి కాదు రెండు ఏకంగా 5 వికెట్లతో చెలరేగాడు. పైగా సచిన్‌ పడగొట్టిన వికెట్లు కూడా అల్లాటప్పా వికెట్లు కాదు.. ఆస్ట్రేలియా కెప్టెన్‌ స్టీవా, టామ్‌ మూడీ, మైఖెల్‌ బెవాన్‌లను సచిన్‌ బోల్తా కొట్టించాడు. ఆ రోజు సచిన్‌ బౌలింగ్‌ చేస్తుంటే.. అందరికి షేన్‌ వార్న్‌ గుర్తొచ్చాడు. అనిల్‌ కుంబ్లే లాంటి దిగ్గజ బౌలర్‌ 10 ఓవర్లు వేసి 51 పరుగులిచ్చి ఒక వికెట్‌ పడగొడితే.. సచిన్‌ 10 ఓవర్ల కోటా పూర్తి చేసి కేవలం 32 పరుగులిచ్చి 5 వికెట్ల హాల్‌ సాధించాడు. మరో విశేషం ఏంటంటే.. దిగ్గజ బ్యాటర్‌ అయిన సచిన్‌కు బౌలింగ్‌ ప్రదర్శనతో ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డు దక్కింది.

ఇలా టీమ్‌లో బ్యాట్‌ కాంట్రిబ్యూట్‌ చేసినా చేయకపోయినా.. ఒక పార్ట్‌టైమ్‌ బౌలర్‌గా సచిన్‌ టీమిండియాకు ఎంతో బలం చేకూర్చాడు. ఈ తరం క్రికెట్‌ అభిమానులు ఆశ్చర్యపోయే మరో విశేషం ఏంటంటే.. సచిన్‌కు 100 సెంచరీలతో పాటు వన్డేల్లో 154 వికెట్లు కూడా ఉన్నాయి. ఒక లెజెండరీ బ్యాటర్‌కు బౌలింగ్‌లో ఇంత గొప్ప గణాంకాలు ఉండటం.. ఈ తరం యువ క్రికెటర్లకు స్ఫూర్తిదాయకం. కానీ నేటి తరం క్రికెటర్లు తాము బ్యాటర్లయితే.. బౌలింగ్‌తో తమ సంబంధం లేదని, బౌలర్లు అయితే బ్యాటింగ్‌ తమ పని కాదని భావిస్తున్నారు. ఈ మైండ్‌ సెట్‌తో కొన్ని సార్లు టీమిండియా భారీగా నష్టపోతుంది. ఏడుగురు బ్యాటర్లు కేవలం బ్యాటింగ్‌, ఐదుగురు బౌలర్లు కేవలం బౌలింగ్‌ చేయాల్సి రావడంతో.. ఆ ఐదుగురు బౌలర్లలో ఒకరు ఎక్కువగా పరుగులు ఇస్తున్న సమయంలో ఒక పార్ట్‌టైమ్‌ బౌలర్‌తో కొన్ని ఓవర్లు వేయిస్తే.. నష్టం కాస్త తగ్గే అవకాశం ఉంటుంది.

కానీ, ప్రస్తుతం అలాంటి పరిస్థితి లేదు. ఓ బౌలర్‌ దారుణంగా పరుగులు ఇస్తున్నా.. వేరే దారిలేక అతనితోనే అన్ని ఓవర్లు పూర్తి చేయించాల్సి వస్తుంది. ఇటీవల ముగిసిన వరల్డ్‌ కప్‌ ఫైనల్‌లో కూడా టీమిండియా ఇలాంటి సమస్యతో ఇబ్బంది పడింది. ఆస్ట్రేలియా టీమ్‌లో ఏడుగురు బౌలింగ్‌ ఆప్షన్‌గా ఉన్నారు. కానీ, టీమిండియాలో బ్యాటర్లు కేవలం బ్యాటింగ్‌కే పరిమితం కావడంతో ఐదుగురు బౌలర్లపైనే పూర్తి భారం పడింది. కొన్ని సార్లు ఐదుగురిలో ఓ బౌలర్‌ టైమ్‌ బాగాలేక, రిథమ్‌ మిస్‌ అయి భారీగా పరుగులు ఇస్తుంటే.. లేదా ప్రత్యర్థి బ్యాటర్లు టార్గెట్‌ చేసి కొడుతున్న సమయంలో సచిన్‌ లాంటి పార్ట్‌టైమ్‌ బౌలర్‌ ఉంటే.. ఆ దాడిని అడ్డుకోవచ్చు. సచిన్‌ను స్ఫూర్తిగా తీసుకుని బ్యాటర్ల కూడా బౌలింగ్‌పై దృష్టిపెడితే.. టీమ్‌కు మంచి జరుగుతుంది. మరి సచిన్‌ అంటే కేవలం బ్యాటింగ్‌ మాత్రమే కాదు.. బౌలింగ్‌ మ్యాజిక్‌ అనే విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Show comments