జడేజా అరుదైన ఘనత.. ఏ భారత స్పిన్నర్ చేయలేని విధంగా..!

  • Author singhj Published - 02:40 PM, Mon - 13 November 23

నెదర్లాండ్స్​తో జరిగిన ఆఖరి లీగ్ మ్యాచ్​లో భారత ఆల్​రౌండర్ రవీంద్ర జడేజా ఓ అరుదైన రికార్డును బ్రేక్ చేశాడు. లెజెండరీ క్రికెటర్స్ అనిల్ కుంబ్లే, యువరాజ్ సింగ్​ను జడ్డూ అధిగమించాడు.

నెదర్లాండ్స్​తో జరిగిన ఆఖరి లీగ్ మ్యాచ్​లో భారత ఆల్​రౌండర్ రవీంద్ర జడేజా ఓ అరుదైన రికార్డును బ్రేక్ చేశాడు. లెజెండరీ క్రికెటర్స్ అనిల్ కుంబ్లే, యువరాజ్ సింగ్​ను జడ్డూ అధిగమించాడు.

  • Author singhj Published - 02:40 PM, Mon - 13 November 23

వన్డే వరల్డ్ కప్-2023లో భారత జట్టు జోరుకు ఎదురే లేకుండా పోతోంది. లీగ్ స్టేజ్​లో ఆడిన ఎనిమిదికి ఎనిమిది మ్యాచుల్లోనూ నెగ్గిన టీమిండియా.. ఆఖరి పోరులో నెదర్లాండ్స్​నూ చిత్తు చేసింది. లీగ్ స్టేజ్​లో భాగంగా తన చివరి మ్యాచ్​లో డచ్​ టీమ్​తో తలపడింది రోహిత్ సేన. బెంగళూరులోని చిన్నస్వామి స్డేడియం ఆతిథ్యం ఇచ్చిన ఈ మ్యాచ్​లో ఏకంగా 160 రన్స్ తేడాతో భారీ విజయం సాధించింది. ఈ మ్యాచ్​లో ఫస్ట్ బ్యాటింగ్​ చేసిన భారత్ అన్ని ఓవర్లాడి 4 వికెట్లకు ఏకంగా 410 పరుగుల భారీ స్కోరు చేసింది. శ్రేయస్ అయ్యర్ (128 నాటౌట్), కేఎల్ రాహుల్ (102) సెంచరీలతో అదరగొట్టారు. వీళ్లతో పాటు రోహిత్ శర్మ (61), శుబ్​మన్ గిల్ (51), విరాట్ కోహ్లీ (51) కూడా రాణించారు.

డచ్ బౌలర్లలో బాస్ డీ లీడ్ 2 వికెట్లు తీశాడు. వాండర్ మెర్వ్, పాల్ వాన్ మీక్రెన్​కు చెరో వికెట్ దక్కింది. కొండంత లక్ష్యాన్ని ఛేజ్ చేసేందుకు దిగిన నెదర్లాండ్స్​కు ఆరంభంలోనే షాక్ తగిలింది. ఆ టీమ్ ఓపెనర్ వెస్లీ బారెసీ 4 రన్స్​ చేసి సిరాజ్​ బౌలింగ్​లో వెనుదిరిగాడు. ఆ తర్వాత మాక్స్ ఓడౌడ్ (30), కొలిన్ అకెర్మన్ (35) కలసి టీమ్​ను ఆదుకున్నారు. అయితే ఆ తర్వాత వీళ్లిద్దరూ తక్కువ టైమ్​లోనే ఔటయ్యారు. సైబ్రండ్ ఎంగెల్​బ్రెచ్ట్ (45), తేజ నిడమనూరు (54) రాణించినప్పటికీ ఛేదించాల్సిన స్కోరు భారీగా ఉండటంతో ఏమీ చేయలేకపోయారు. భారత బౌలర్లలో బుమ్రా, సిరాజ్, జడేజా తలో రెండు వికెట్లు తీశారు. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మకు ఒక్కో వికెట్ దక్కడం గమనార్హం.

నెదర్లాండ్స్​తో మ్యాచ్​లో భారత్ తరఫున 9 మంది బౌలర్లు బౌలింగ్​కు దిగడం విశేషం. ఒక వరల్డ్ కప్ మ్యాచ్​లో ఇలా తొమ్మిది మంది ప్లేయర్లతో బౌలింగ్ వేయించడం 31 ఏళ్ల తర్వాత ఇదే తొలిసారి అని చెప్పాలి. 1992 వరల్డ్ కప్​లో కివీస్ టీమ్ 9 మంది బౌలర్లను వినియోగించింది. అంతకుముందు 1987 ప్రపంచ కప్​లో ఇంగ్లండ్ కూడా తొమ్మిది మంది క్రికెటర్లతో బౌలింగ్ వేయించింది. సెమీస్​లో మెయిన్ బౌలర్లలో ఎవరైనా విఫలమైనా, ఒకవేళ వికెట్లు పడకపోతే బ్రేక్ త్రూ కావాలన్నా పార్ట్ టైమర్ అవసరమని టీమిండియా మేనేజ్​మెంట్ గ్రహించింది. అందుకే డచ్ టీమ్​తో మ్యాచ్​లో ఏకంగా 9 మంది ప్లేయర్లను బౌలింగ్​కు దింపింది. భారత్ బౌలింగ్ ప్రయోగం కొంతమేరకు సక్సెస్ అయిందనే చెప్పాలి. విరాట్ కోహ్లీతో పాటు కెప్టెన్ రోహిత్ శర్మ కూడా బౌలింగ్​ వేసి ఒక్కో వికెట్ తీశారు.

ఇక, ఈ మ్యాచ్​లో స్పిన్ ఆల్​రౌండర్ రవీంద్ర జడేజా ఎప్పటిలాగే అద్భుతంగా బౌలింగ్ వేశాడు. చక్కటి లైన్ అండ్ లెంగ్త్​తో బౌలింగ్ చేస్తూ డచ్ బ్యాటర్లను ముప్పుతిప్పలు పెట్టాడు. ఈ మ్యాచ్​లో 2 వికెట్లు తీసిన జడ్డూ.. వరల్డ్ కప్ ఎడిషన్​లో అత్యధిక వికెట్లు తీసుకున్న భారత బౌలర్​గా నిలిచాడు. 1996 వరల్డ్ కప్​లో 15 వికెట్లు తీసిన అనిల్ కుంబ్లే, 2011 ప్రపంచ కప్​లో 15 వికెట్లు తీసుకున్న యువరాజ్ సింగ్​ను జడేజా (16 వికెట్లు) అధిగమించాడు. కుంబ్లే, యువీ రికార్డును బ్రేక్ చేసిన జడ్డూ సెమీస్ మ్యాచ్​ కూడా ఆడాల్సి ఉంది. దీంతో టోర్నీ అయిపోయేసరికి అతడు 20 వికెట్ల మైలురాయికి చేరుకున్నా ఆశ్చర్యపోవాల్సిందేమీ లేదు. మరి.. కుంబ్లే, యువీ రికార్డును జడ్డూ బ్రేక్ చేయడంపై మీరేం అనుకుంటున్నారో కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: VIDEO: వికెట్ తీసిన విరాట్ కోహ్లీ.. వైరల్​గా మారిన అనుష్క శర్మ రియాక్షన్!

Show comments