Nathan Lyon: అందరు ఆసీస్ ను తిడుతున్నా.. ఆ ఒక్కపనితో అభిమానుల మనసు గెలుచుకున్న నాథన్ లియాన్!

  • Author Soma Sekhar Published - 01:14 PM, Mon - 3 July 23
  • Author Soma Sekhar Published - 01:14 PM, Mon - 3 July 23
Nathan Lyon: అందరు ఆసీస్ ను తిడుతున్నా.. ఆ ఒక్కపనితో అభిమానుల మనసు గెలుచుకున్న నాథన్ లియాన్!

ఇంగ్లాండ్-ఆస్ట్రేలియా మధ్య ప్రతిష్టాత్మకమైన యాషెస్ సమరం జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ ఐదు టెస్టుల సమరంలో.. ఆస్ట్రేలియా 2-0తో ఆధిక్యంలో ఉంది. తాజాగా లార్డ్స్ వేదికగా జరిగిన రెండో టెస్ట్ లో కూడా ఆసీస్ విజయం సాధించింది. ఇక ఈ మ్యాచ్ లో సైతం ఆసీస్ తన వంకర బుద్దిని చూపించింది. జానీ బెయిర్ స్టో ని వివాదాస్పద రనౌట్ తో పెవిలియన్ కు చేర్చింది. ఈ అవుట్ క్రీడాస్ఫూర్తికి విరుద్దం అని క్రీడాభిమానులు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఒక్కపనితో క్రికెట్ అభిమానుల మనసు గెలుచుకున్నాడు ఆస్ట్రేలియా స్టార్ స్పిన్నర్ నాథన్ లియాన్.

నాథన్ లియాన్.. సమకాలీన టెస్ట్ క్రికెట్ చరిత్రలో అత్యుత్తమ స్పిన్నర్ గా ఘనత వహించాడు. తాజాగా వరుసగా 100 టెస్ట్ మ్యాచ్ లు ఆడిన స్పిన్నర్ గా రికార్డు సృష్టించాడు లియాన్. అయితే యాషెస్ సిరీస్ లో భాగంగా.. లార్డ్స్ వేదికగా జరిగిన రెండో టెస్ట్ మ్యాచ్ లో తీవ్రంగా గాయపడ్డాడు. రెండో రోజు ఆటలో ఫీల్డింగ్ చేస్తూ.. బౌండరీ లైన్ వద్ద గాయపడ్డాడు లియాన్. కాలి నొప్పి తీవ్రంగా ఉండటంతో.. వెంటనే గ్రౌండ్ ను వీడాడు. ఆ తర్వాత సెషన్ కు కూడా లియాన్ గ్రౌండ్ లోకి అడుగుపెట్టలేదు. అదీకాక లియాన్ రెండు ఊతకర్రల సాయంతో నడుస్తున్న ఫొటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దాంతో అతడు మిగతా టెస్టులకు దూరం అవుతాడని అందరు అనుకున్నారు.

కానీ అనూహ్యంగా ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్ లో బ్యాటింగ్ చేస్తున్న క్రమంలో.. చివరి ఆటగాడిగా బ్యాటింగ్ కు దిగాడు నాథన్ లియాన్. ప్రస్తుతం అతడు బ్యాటింగ్ కు వస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కాలికి గాయం బాధిస్తున్నప్పటికీ.. ఆ నొప్పిని పంటి బిగువన అదిమి పట్టి.. జట్టు కోసం బ్యాటింగ్ కు దిగాడు లియాన్. పరుగులు తీయ్యడంలో.. బ్యాటింగ్ చేయడంలో ఎంత ఇబ్బంది పడ్డాడో ఆ వీడియోని చూస్తేనే అర్ధం అవుతుంది. ఒంటి కాలితో పరుగు తీయ్యడం, బాల్ శరీరానికి తగిలినా కానీ.. బ్యాటింగ్ చేయడం లియాన్ ను హీరోను చేశాయి.

అయితే నాథన్ లియాన్ చేసింది 4 పరుగులే అయినప్పటికీ.. అలాంటి పరిస్థితుల్లో బ్యాటింగ్ కు వచ్చి.. అందరి మనసులు గెలుచుకున్నాడు. ఫ్యాషన్, డెడికేషన్, హర్డ్ వర్క్ కలిస్తే లియాన్ అంటూ సోషల్ మీడియా వేదికగా కామెంట్స్ చేస్తున్నారు. క్రికెట్ పై అలాగే దేశంపై ఎంత ప్రేమ ఉందో.. ఈ ఒక్కపని ద్వారా తెలియజెప్పాడు లియాన్. ఇక అతడు చివరి వికెట్ గా అవుట్ అయ్యి పెవిలియన్ కు వస్తుంటే.. అభిమానులంతా చప్పట్లతో స్టాండింగ్ ఒవేషన్ ఇచ్చారు.

Show comments