World Cup: ఆఫ్ఘాన్‌తో మ్యాచ్‌.. భారత చెత్త బౌలర్ల లిస్ట్‌లో చేరిన సిరాజ్‌

వన్డే వరల్డ్‌ కప్‌లో టీమిండియా రెండు వరుస విజయాలతో మంచి జోరు మీదుంది. ఆఫ్ఘనిస్థాన్‌పై సాధించిన విజయం ఊహించిందే కానీ, ఆస్ట్రేలియాతో జరిగిన తొలి మ్యాచ్‌లో టీమిండియా అద్భుతంగా ఆడింది. ఆ విజయంతోనే భారత జట్టుకు భారీ కాన్ఫిడెన్స్‌ వచ్చింది. పైగా టోర్నీ ఆరంభంలోనే ఆస్ట్రేలియా లాంటి పటిష్టమైన టీమ్‌పై విజయం సాధించడం టీమిండియా గట్టి బూస్ట్‌అప్‌ ఇచ్చిందనే చెప్పాలి. అయితే.. ఆఫ్ఘానిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా బ్యాటింగ్‌లో ఆధిపత్యం చెలాయించింది కానీ, బౌలింగ్‌ మాత్రం అంతగా డామినేట్‌ చేయలేదని చెప్పాలి. ఎంత బ్యాటింగ్‌ పిచ్‌ అయినా.. ఆఫ్ఘాన్‌ లాంటి పసికూన జట్టుకు 272 పరుగులు సమర్పించుకోవడాన్ని భారత క్రికెట్‌ అభిమానులు అంతగా జీర్ణించుకోలేకపోతున్నారు. పైగా ఆ జట్టును ఆలౌట్‌ చేయకుండా 50 ఓవర్ల పాటు ఆడించారు.

అయితే.. టీమిండియా ప్రధాన బౌలర్‌, వన్డేల్లో వరల్డ్‌ కప్‌ నంబర్‌ వన్‌గా ఉన్న మొహమ్మద్‌ సిరాజ్‌.. ఆఫ్ఘనిస్థాన్‌తో మ్యాచ్‌లో విఫలం అవ్వడం కూడా ఆఫ్ఘాన్‌ భారీ స్కోర్‌ చేయడానికి కారణమైంది. ఈ మ్యాచ్‌లో 9 ఓవర్లు వేసిన సిరాజ్‌ ఒక్క వికెట్‌ కూడా తీయకపోగా.. భారీగా పరుగులు సమర్పించుకున్నాడు. 9 ఓవర్లలో 8.4 ఎకానమీతో 76 పరుగులు సమర్పించుకున్నాడు. ఈ ఫేలవ ప్రదర్శనతో సిరాజ్‌ ఓ చెత్త రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. వన్డే వరల్డ్‌ కప్స్‌లో 8కి పైగా ఓవర్లు వేసి అత్యంత చెత్త ప్రదర్శన కనబర్చిన భారత బౌలర్ల జాబితాలో మూడో స్థానంలో నిలిచాడు సిరాజ్‌.

గతంలో 2019 వన్డే వరల్డ్‌ కప్‌ సందర్భంగా ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో యుజ్వేంద్ర చాహల్‌ ఒక్క వికెట్‌ కూడా తీయకుండా 8.8 ఎకానమీతో 88 పరుగులు సమర్పించుకున్నాడు. ఓ వరల్డ్‌ కప్‌లో టీమిండియా తరఫున ఓ బౌలర్‌ కనబర్చిన అత్యంత చెత్త ప్రదర్శన ఇదే. రెండో స్థానంలో భారత దిగ్గజ మాజీ బౌలర్‌ జవగళ్‌ శ్రీనాథ్‌ ఉన్నాడు. ఆస్ట్రేలియాతో జరిగిన 2003 వన్డే వరల్డ్‌ కప్‌ ఫైనల్‌లో శ్రీనాథ్‌ వికెట్‌ తీయకుండా 8.7 ఎకానమీతో 87 రన్స్‌ ఇచ్చాడు. భారత తరఫున ఇది రెండో అత్యంత చెత్త ప్రదర్శన. ఇక ఇప్పుడు మూడో స్థానంలో సిరాజ్‌ నిలిచాడు. ఆఫ్ఘాన్‌పై 8.4 ఎకానీమీతో అత్యంత చెత్త ప్రదర్శన కనబర్చిన మూడో బౌలర్‌, ఓ చెత్త రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. సిరాజ్‌ తర్వాతి స్థానంలో ఉమేష్‌ యాదవ్‌ ఉన్నాడు. 2015 వరల్డ్‌ కప్‌లో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో ఉమేష్‌ 8 ఎకానీమీతో 72 పరుగులు సమర్పించుకున్నాడు. కానీ, 4 వికెట్లు కూడా పడగొట్టడం విశేషం. మరి తాజాగా వరల్డ్‌ నంబర్‌ వన్‌ బౌలర్‌గా ఉంటూ సిరాజ్‌ ఓ చెత్త రికార్డును తన పేరిట లిఖించుకోవడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: కోహ్లీ-నవీన్ ఉల్ హక్ కలిసిపోవడంపై గంభీర్ ఊహించని కామెంట్స్!

Show comments