ఎవరీ హీత్ స్ట్రీక్? జింబాబ్వేకి దొరికిన ఓ కపిల్ దేవ్ కథ ఇది!

జింబాబ్వే మాజీ క్రికెటర్‌ హీత్‌ స్ట్రీక్‌ ఈ రోజు(బుధవారం) ఉదయం కేన్సర్‌కు చికిత్స పొందుతూ మృతి చెందినట్లు వార్తలు వచ్చాయి. దీంతో క్రికెట్‌ లోకం మొత్తం శోకసంద్రంలో మునిగిపోయింది. కానీ కొన్ని గంటల తర్వాత.. స్ట్రీక్‌ మరణించలేదని, బతికే ఉన్నారని, చికిత్స కొనసాగుతుందంటూ జింబాబ్వే మాజీ క్రికెటర్‌ హెన్రీ ఒలొంగా క్లారిటీ ఇచ్చాడు. ఇలా ఉదయం నుంచి స్ట్రీక్‌ మరణించారని, లేదు బతికే ఉన్నారని వార్తలు రావడంతో ఒక్కసారిగా స్ట్రీక్‌ పేరు మారుమోగిపోయింది. అయితే.. ఈ దిగ్గజ మాజీ క్రికెటర్‌ గురించి ఈ తరం క్రికెట్‌ అభిమానులకు తెలియకపోయినా.. పాతతరం వారికి అతనో హీరో. ఇలాంటి ప్లేయర్‌ మన జట్టులో ఎందుకు లేడా అని అప్పట్లో ఇండియన్‌ క్రికెట్‌ ఫ్యాన్స్‌ బాధపడేవారంటే అతిశయోక్తి కాదు. మరి నిజంగానే అతను అంత గొప్ప ఆటగాడా? జింబాబ్వే క్రికెట్‌కు అతనేం చేశాడు? సాధించిన గొప్ప విజయాలు ఏంటి? అనే విషయాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం..

మార్చి 16, 1974లో జింబాబ్వేలో జన్మించాడు హీత్‌ స్ట్రీక్‌. అతని పూర్తి పేరు హీత్‌ హిల్టన్‌ స్ట్రీక్‌. 1993లో సౌతాఫ్రికాతో జరిగిన వన్డే మ్యాచ్‌తో జింబాబ్వే తరఫున అంతర్జాతీయ క్రికెట్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. అనతకాలంలోనే మంచి ఆల్‌రౌండర్‌గా గుర్తింపు తెచ్చుకుని, జింబాబ్వే టీమ్‌లో కీ ప్లేయర్‌గా మారిపోయాడు. 2001లో జింబాబ్వేకు కెప్టెన్‌ కూడా అయ్యాడు.. ప్రపంచ క్రికెట్‌పై ఆస్ట్రేలియా ఏకఛత్రాదిపత్యం ప్రదర్శిస్తున్న కాలంలో.. జింబాబ్వే లాంటి ఓ జట్టును సింహంలా మార్చాడు. పేరుకే పసికూన.. బరిలోకి దిగితే.. ఎంత పెద్ద జట్టునైనా మట్టికరిపించగల టీమ్‌గా మలిచాడు. ఆండీ ప్లవర్‌, డౌగీ మారిల్లియర్, అలిస్టర్ కాంప్‌బెల్, గ్రాంట్ ఫ్లవర్, హెన్రీ ఒలోంగా.. లాంటి స్టార్లతో జింబాబ్వే జట్టు కళకళలాడుతున్న టైమ్‌లో జింబాబ్వేను మరింత పటిష్టంగా నడిపించాడు.

జింబాబ్వే జట్టులో ఉండటంతోనే స్ట్రీక్‌ లాంటి ఆటగాళ్లు ఓ స్థాయిలో ఉండిపోయారు కానీ, అదే ఇండియానో, ఆస్ట్రేలియా లాంటి జట్టులోనో ఉండి ఉంటే.. ఇప్పుడు ప్రపంచ క్రికెట్‌లో కపిల్‌ దేవ్‌, సచిన్‌లకు ఉన్నంత గుర్తింపు ఉండేది. అయినప్పటికీ.. జింబాబ్వే జట్టు అంటే అప్పట్లో అగ్రశ్రేణి జట్లన్ని భయపడేవి. అందుకు స్ట్రీక్‌ కూడా ఒక కారణం. అతని బౌలింగ్‌, అతని బ్యాటింగ్‌ చూసి.. ప్రత్యర్థి జట్లు అసూయపడేవి. అంతర్జాతీయ క్రికెట్‌ నుంచి రిటైర్‌ అయి 18 ఏళ్లు గడుస్తున్నా.. ఇప్పటికీ జింబాబ్వే టాప్‌ టెస్ట్‌ బౌలర్‌ అతనే. 216 టెస్టు వికెట్లతో జింబాబ్వే తరఫున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచాడు. ఇప్పటికీ అతని నెంబర్‌ వన్‌ స్థానం చెక్కుచెదరకుండా ఉంది. అలాగే వన్డేల్లో కూడా స్ట్రీక్‌ ఖాతాలో 239 వికెట్లు ఉన్నాయి. మిగతా దిగ్గజ క్రికెటర్లతో పోలిస్తే ఈ వికెట్ల సంఖ్య చిన్నదిగా అనిపించినా.. పసికూన జింబాబ్వే లాంటి జట్టులో ఉండి, ఇలాంటి రికార్డులంటే అంత సాధారణమైన విషయం కాదు.

జింబాబ్వే తరఫున టెస్టుల్లో 100 వికెట్లు పూర్తి చేసుకున్న తొలి, ఏకైక బౌలర్‌ అతనే. అలాగే టెస్ట్ క్రికెట్‌లో 1000 పరుగులతో పాటు 100పైగా వికెట్లు, వన్డేల్లో 2000 పరుగులతో పాటు 200పైగా వికెట్లు కలిగి ఉన్న ఏకైక జింబాబ్వే ఆటగాడు అతనే. జింబాబ్వే తరఫున టెస్టుల్లో అత్యధిక సార్లు ఐదు వికెట్ల హాల్‌ సాధించిన బౌలర్‌ కూడా స్ట్రీకే. మొత్తంగా 7 స్లారు ఐదు, అంతేకంటే ఎక్కువ వికెట్లు సాధించాడు. వన్డేల్లో 7 సార్లు నాలుగు వికెట్ల హాల్‌, ఒకసారి ఐదు వికట్లె హాల్ సాధించాడు. మొత్తంగా 1997 నుంచి 2003 మధ్య జింబాబ్వే క్రికెట్‌కు స్వర్ణయుగంగా భావిస్తే.. అందులో హీత్‌ స్ట్రీక్‌ ఓ రారాజులా వెలుగొందాడు. జింబాబ్వేను సంచలన శక్తిగా తీర్చిదిద్దడంలో తన వంతు పాత్ర పోషించాడు.

వన్డే క్రికెట్‌లో అతి తక్కువ మ్యాచ్‌ల్లో 200 వికెట్లు సాధించిన ఆటగాళ్ల జాబితాలో స్ట్రీక్‌ ఎంతో మంది దిగ్గజ బౌలర్ల కంటే ముందున్నాడంటే మీరు నమ్మడం కష్టమే. ఈ తరం వారికి తెలిసిన గొప్ప బౌలర్లు.. కపిల్‌ దేవ్‌, చమిందా వాస్‌, డానియల్‌ వెట్టోరి, హర్భజన్‌ సింగ్‌, అబ్దుల్‌ రజాక్‌ లాంటి వారి కంటే కూడా స్ట్రీక్‌ వేగంగా 200 వికెట్ల మార్క్‌ అందుకున్నాడు. స్ట్రీక్‌ 162 మ్యాచ్‌ల్లో 200 వన్డే వికెట్ల సాధిస్తే.. కపిల్‌ దేవ్‌ 166, వాస్‌ 163, భజ్జీ 180, రజాక్‌ 181, వెట్టోరి 198 వన్డేలు ఆడి 200 వికెట్ల మార్క్‌ అందుకున్నారు. కానీ ఆ తర్వాత 239 వికెట్ల వద్దే ఆగిపోయాడు స్ట్రీక్‌. జింబాబ్వే జట్టులో నెలకొన్న అంతర్గత విభేదాలు, జాత్యాహంకార గొడవలు, రాజకీయ జోక్యంతో జింబాబ్వే క్రికెట్‌తో పాటు స్ట్రీక్‌ కెరీర్‌పై కూడా దెబ్బపడింది.

భారత్‌-జింబాబ్వే జట్లు తలపడిన సమయంలో.. ఐదు, ఆరు వికెట్లు పడిపోతే.. టీమిండియా బ్యాటింగ్‌ ఆర్డర్‌ పని అయిపోయిట్టే. కానీ, జింబాబ్వేకు అలా కాదు. ఎందుకంటే వాళ్ల టీమ్‌లో స్ట్రీక్‌ అనే ఓ ఆల్‌రౌండర్‌ ఉండేవాడు. అతని ఆట చూసిన అప్పటి భారత క్రికెట్‌ అభిమానులు మన జట్టులో ఇలాంటి ప్లేయర్‌ ఎందుకు లేడా అని బాధపడేవారు. 2003లో జింబాబ్వే జట్టు వన్డే వరల్డ్‌ కప్‌ సూపర్‌ 8 వరకు వచ్చి సంచలనం నమోదు చేసింది. అది కూడా స్ట్రీక్‌ కెప్టెన్సీలోనే. అప్పటి జింబాబ్వే జట్టును చూస్తే ఒక అప్రకటిత ఛాంపియన్‌ టీమ్‌ను చూసినట్లు ఉండేది. ఎందుకంటే ఆ జట్టు ఎప్పుడు ఏ టీమ్‌ను ఓడిస్తుందో తెలియని పరిస్థితి.

1996-97 సింగర్-అకాయ్ కప్‌లో భాగంగా పాకిస్థాన్, శ్రీలంక, జింబాబ్వే మధ్య ట్రైసిరీస్‌ జరిగింది. షార్జా క్రికెట్ స్టేడియంలో జింబాబ్వే, పాకిస్థాన్ జట్లు ఆరో మ్యాచ్‌లో తలపడ్డాయి. శ్రీలంక ఇప్పటికే ఫైనల్‌కి చేరడంతో ఇరు జట్లకు ఇది డూ-ఆర్ డై మ్యాచ్‌. ఆ మ్యాచ్‌లో బౌలింగ్‌లో చెలరేగిన స్ట్రీక్‌.. తన 10 ఓవర్ల కోటాలో మహ్మద్ వసీమ్, మొయిన్ ఖాన్, షాహిద్ అఫ్రిది, సక్లైన్ ముస్తాక్‌లను అవుట్ చేసి పాక్‌ను చావుదెబ్బతీశాడు. ఆ మ్యాచ్‌లో జింబాబ్వే ఓడినప్పటికీ 10 ఓవర్లలో కేవలం 18 పరుగులు మాత్రమే ఇచ్చి 4 వికెట్ల తీసిన స్ట్రీక్‌ ప్రదర్శన మ్యాచ్‌కే హైలెట్‌గా నిలిచింది.

2001లో ఆస్ట్రేలియా, వెస్టిండీస్‌తో కలిసి వన్డే ట్రై-సిరీస్‌లో పాల్గొనేందుకు ఆస్ట్రేలియాలో పర్యటించింది జింబాబ్వే. వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో సంచలనం నమోదు చేసింది. జింబాబ్వే ఆ మ్యాచ్‌ గెలిచిందని చెప్పడం కంటే.. స్ట్రీక్‌ ఒంటిచేత్తో తన ఆల్‌రౌండర్‌ ప్రరద్శనతో గెలిపించాడనే చెప్పాలి. బ్యాటింగ్‌ బౌలింగ్‌లో అన్ని తానై ఆ మ్యాచ్‌లో వన్‌ మ్యాన్‌ షో చేశాడు. తొలుత బ్యాటింగ్‌ చేసిన జింబాబ్వే.. 66 పరుగులకే 6 వికెట్లు కోల్పోయిన దశలో బ్యాటింగ్‌కు వచ్చిన స్ట్రీక్‌.. అప్పటి భయంకరమైన వెస్టిండీస్‌ బౌలింగ్‌ను చీల్చి చెండాడి.. 45 పరుగులతో రాణించాడు. దాంతో జింబాబ్వే 138 పరుగులు చేయగలిగింది. ఇక బౌలింగ్‌లో 4 వికెట్లతో చెలరేగి.. పటిష్టమైన కరేబియన్‌ టీమ్‌ను 91 పరుగులకే ఆలౌట్‌ చేసి.. జింబాబ్వేను గెలిపించాడు స్ట్రీక్‌. ఈ ఒక్క మ్యాచ్‌ చాలు స్ట్రీక్‌ ఎంత గొప్ప ఆల్‌రౌండరో చెప్పడానికి.

ఇక 1997 ఫిబ్రవరిలో సచిన్ టెండూల్కర్ కెప్టెన్సీలో భారత జట్టు రెండు వన్డేల సిరీస్‌ ఆడేందుకు జింబాబ్వే వెళ్లింది. బులవాయోలోని క్వీన్స్ స్పోర్ట్స్ క్లబ్‌లో జరిగిన తొలి వన్డేలో భారత జట్టుకు ఆతిథ్యమిచ్చిన జింబాబ్వే ఎనిమిది వికెట్ల తేడాతో టీమిండియాను చిత్తు చేసింది. అప్పటి జింబాబ్వే జట్టులో అతి పిన్న వయస్కుడైన ఆటగాళ్లలో స్ట్రీక్‌ ఒకడు. విక్రమ్‌ రాథోర్‌, సచిన్‌ టెండూల్కర్‌, సౌరవ్‌ గంగూలీ, అజహరుద్దీన్‌, అజయ్‌ జడేజా, రాబిన్‌ సింగ్‌తో కూడిన బలమైన టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్‌ను వణికిస్తూ బంతితో నిప్పులు చెరిగాడు. 8.5 ఓవర్లలో కేవలం 32 పరుగులు మాత్రమే ఇచ్చి 5 వికెట్లు పడగొట్టాడు. వన్డేల్లో స్ట్రీక్‌ సాధించిన ఏకైక ఐదు వికెట్ల హాల్‌ మన మీదనే. స్ట్రీక్‌ దెబ్బకు ఇండియా కేవలం 168 పరుగులు మాత్రమే చేసి ఆలౌట్‌ అయింది. వర్షం కారణంగా ఈ స్కోర్‌ను 138 పరుగులకు కుదించగా.. జింబాబ్వే కేవలం 2 వికెట్లు కోల్పోయి టార్గెట్‌ను ఛేదించింది.

అద్భుతం కెరీర్‌కు 2005లో ముగింపు పలికిన స్ట్రీక్‌ ఆ తర్వాత కోచ్‌గా మారాడు. జింబాబ్వే, స్కాట్లాండ్, బంగ్లాదేశ్, గుజరాత్ లయన్స్, కోల్‌కతా నైట్ రైడర్స్‌ జట్ల కోసం పలురకాల కోచింగ్ బాధ్యతలు నిర్వర్తించాడు. అయితే.. జింబాబ్వేలో నెలకొన్న రాజకీయ పరిస్థితులు నేపథ్యంలో స్ట్రీక్‌ను 2004లో కెప్టెన్‌గా తొలగించారు. కానీ, అదే ఏడాది అతను ఐసీసీ వన్డే ప్లేయర్‌ ఆఫ్‌ ది ఇయర్‌గా ఎంపికైయ్యాడు. ఓ జింబాబ్వే జట్టు ఆటగాడు అప్పట్లోనే ఐసీసీ వన్డే ప్లేయర్‌గా ఎంపికయ్యాడంటేనే అర్థం చేసుకోవచ్చు.. అతను ఏ రేంజ్‌లో ప్రపంచ క్రికెట్‌ను శాసించాడో. అలాంటి గొప్ప క్రికెటర్‌ ప్రస్తుతం చావు బతుకుల మధ్య ఉండటం సగటు క్రికెట్‌ అభిమానిని, మాజీ క్రికెటర్లను ఎంతగానో బాధిస్తోంది. పైగా ప్రస్తుతం స్ట్రీక్‌ వయసు కేవలం 49 ఏళ్లు మాత్రమే. మరి ఈ జింబాబ్వే దిగ్గజ క్రికెటర్‌ గురించి మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: వరల్డ్ కప్ లో టీమిండియాకు ఆ బలహీనత ప్రధాన సమస్యగా మారబోతుందా?

Show comments