ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్ మరింత రసవత్తరకంగా సాగుతోంది. తొలి రెండు టెస్టుల్లో గెలిచి కాలర్ ఎగరేసిన ఆస్ట్రేలియాకు మూడో టెస్టు నుంచి చుక్కలు చూపిస్తోంది ఇంగ్లండ్. బజ్‌బాల్ స్ట్రాటజీని వదలని ఇంగ్లీష్ టీమ్.. నాలుగు టెస్టులోనూ తమ జోరును కొనసాగిస్తోంది. దీంతో ఈ మ్యాచ్‌పై ఆసీస్ ఆశలు వదులుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. కమిన్స్ సేన ఓటమి నుంచి తప్పించుకోవాలంటే ఇక అద్భుతమే జరగాలి. బెయిర్ స్టో (99 నాటౌట్), బ్రూక్ (61), కెప్టెన్ స్టోక్స్ (51) హాఫ్ సెంచరీలతో రాణించడంతో ఫస్ట్ ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ 275 రన్స్ ఆధిక్యం సాధించింది. ఓవర్‌నైట్ స్కోరు 384/4తో బ్యాటింగ్‌ను కొనసాగించిన స్టోక్స్ సేన.. 592 రన్స్‌కు ఆలౌటైంది.
కంగారూ బౌలర్లలో జోష్ హేజల్‌వుడ్ (2/126) విజృంభించాడు. అతడికి స్టార్క్, గ్రీన్ చెరో రెండు వికెట్లు తీసి చక్కటి సహకారం అందించారు. ఆ తర్వాత రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టిన ఆస్ట్రేలియా.. మూడో రోజు ఆట ముగిసేసరికి 113/4తో ఉంది. ఆ టీమ్ ఇంకా ఇంగ్లండ్ స్కోరుకు 162 రన్స్ వెనుకబడి ఉంది. గేమ్‌లో ఇప్పుడు ఇంగ్లీష్ టీమ్‌దే పైచేయి. కానీ నాలుగో రోజు, ఐదో రోజు ఆటలో వరుణుడు అంతరాయం కలిగించే ఛాన్స్ ఉంది. ఈ నేపథ్యంలో నాలుగో టెస్టు ఎలాంటి మలుపులు తిరుగుతుందో చూడాలి. ఇదిలా ఉంటే.. ఈ టెస్టులో వర్షం పడాలని ఒక ఆసీస్ ప్లేయర్ కోరుకుంటున్నాడు. తమ జట్టు కష్టాల్లో ఉండటం, గెలుపు సంగతి పక్కనబెడితే.. ఓటమిని కూడా తప్పించుకోలేని పరిస్థితుల్లో ఉండటంతో వరుణుడు తమను కరుణించాలని కోరుకుంటున్నాడు. అతడు మరెవరో కాదు స్పీడ్‌స్టర్ హేజల్‌వుడ్.
ఇంగ్లండ్‌ను ఫస్ట్ ఇన్నింగ్స్‌లో కట్టడి చేయడంలో ఈ పేసర్ బాగానే సక్సెస్ అయ్యాడు. 5 వికెట్లతో హేజల్‌వుడ్ సత్తా చాటాడు. కానీ మిగతా బౌలర్లను టార్గెట్ చేసుకొని ఇంగ్లీష్ బ్యాట్స్‌మెన్ విజృంభించారు. దొరికిన బాల్‌ను దొరికినట్లు బౌండరీకి తరలించారు. దీంతో ఆ టీమ్ ఫస్ట్ ఇన్నింగ్స్‌లో భారీ ఆధిక్యం సంపాదించింది. ఈ సమయంలో బ్యాటింగ్ ఆరంభించిన ఆసీస్‌ను ఇంగ్లండ్ పేసర్ మార్క్‌వుడ్ (3/17) చావుదెబ్బ తీశాడు. షార్ట్ పిచ్ బంతులతో స్వల్ప వ్యవధిలో స్టీవ్ స్మిత్, హెడ్ (1)ను వెనక్కి పంపాడు. దీంతో ఆసీస్‌ను గట్టెక్కించాల్సిన బాధ్యత మార్ష్ (1 బ్యాటింగ్), లబుషేన్ (44 బ్యాటింగ్)పై పడింది. ఈ నేపథ్యంలో వరుణడే తమను కాపాడాలని పేసర్ హేజల్‌వుడ్ అంటున్నాడు. మ్యాచ్ జరుగుతున్న ఓల్డ్ ట్రాఫోర్డ్ స్టేడియంలో వాన కురిస్తే తాను చాలా సంతోషిస్తానని అతడు తెలిపాడు. అయితే ఓటమి భయంతోనే హేజల్‌వుడ్ వర్షం పడాలని కోరుకుంటున్నాడని ఇంగ్లండ్ ఫ్యాన్స్ అతడ్ని ట్రోల్ చేస్తున్నారు.
Josh Hazlewood said, “I’d be very pleased if rain arrives at the Old Trafford”. pic.twitter.com/MMmuPgeoVw
— Mufaddal Vohra (@mufaddal_vohra) July 22, 2023