సెల్యూట్ సూర్య.. వన్డేలకు పనికి రాడన్నారు.. గెలిపించి చూపించాడు!

  • Author singhj Published - 10:09 PM, Fri - 22 September 23
  • Author singhj Published - 10:09 PM, Fri - 22 September 23
సెల్యూట్ సూర్య.. వన్డేలకు పనికి రాడన్నారు.. గెలిపించి చూపించాడు!

సూర్యకుమార్ యాదవ్.. ప్రస్తుత భారత జట్టులో అత్యంత ప్రతిభావంతులైన క్రికెటర్లలో ఒకడు. ఇప్పటికే ఎన్నో సంచలన, సునామీ ఇన్నింగ్స్​లతో తన సత్తా చాటుకున్నాడీ ప్లేయర్. సూర్య గ్రౌండ్​లోకి దిగాడంటే చాలు.. బౌండరీలు, సిక్సుల వర్షం కురవాల్సిందే. బౌలర్ ఎవరన్నది చూడడు, బంతి ఎంత వేగంగా వస్తుందో పట్టించుకోడు, ఎక్కడ.. ఏ పరిస్థితుల్లో ఆడుతున్నాడో అవసరం లేదు. వచ్చిన బంతిని వచ్చినట్లు బౌండరీకి తరలించడం సూర్యకు అలవాటు. గ్రౌండ్ నలుమూలలా రన్స్ చేస్తాడు. అందుకే అతడ్ని మిస్టర్ 360 అని పిలుస్తుంటారు. బ్యాట్​ను మంత్రదండంలా తిప్పుతూ బౌలర్లను చీల్చిచెండాడే సూర్యకు టీ20ల్లో అద్భుతమైన రికార్డు ఉంది. పొట్టి ఫార్మాట్​లో రెచ్చిపోయి ఆడే సూర్యకుమార్.. వన్డేల్లో మాత్రం అట్టర్ ఫ్లాప్.

50 ఓవర్ల ఫార్మాట్​లో ఎన్ని అవకాశాలు ఇచ్చినా దాన్ని సూర్య మాత్రం సద్వినియోగం చేసుకోవడం లేదు. అయినా సెలెక్టర్లు, టీమ్ మేనేజ్​మెంట్ మాత్రం అతడిపై నమ్మకం ఉంచారు. ముఖ్యంగా కెప్టెన్ రోహిత్ శర్మ, కోచ్ రాహుల్ ద్రవిడ్ సూర్యను బాగా ప్రోత్సహిస్తున్నారు. వరుసగా ఫెయిల్ అవుతున్న మిస్టర్ 360 ఏకంగా రాబోయే వన్డే వరల్డ్ కప్​లోనూ చోటు దక్కించుకున్నాడు. దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. ఫామ్​లో లేని ప్లేయర్, వన్డేల్లో ఎలా ఆడాలో తెలియని బ్యాటర్​ను ఎందుకు సెలెక్ట్ చేశారనే కామెంట్స్ వినిపించాయి. సూర్య తప్ప ఇంకో ప్లేయరే లేడా? అతడి కోసం మిగతా వారిని బలి చేస్తున్నారనే వ్యాఖ్యలు వినిపించాయి. అన్ని వైపుల నుంచి విమర్శలు వచ్చినా కోచ్ ద్రవిడ్ మాత్రం సూర్యకుమార్​కు సపోర్ట్​గా ఉన్నాడు. అతడికి మరిన్ని అవకాశాలు ఇస్తామని అన్నాడు.

ఎట్టకేలకు టీమ్ మేనేజ్​మెంట్ తనపై ఉంచిన నమ్మకాన్ని సూర్య నిలబెట్టుకున్నాడు. తాజాగా ఆస్ట్రేలియాతో ముగిసిన తొలి వన్డేలో అదిరిపోయే ఇన్నింగ్స్​తో ఆకట్టుకున్నాడు. ఈ మ్యాచ్​లో ఎడాపెడా షాట్లు కొట్టకుండా క్రీజులో నిలదొక్కుకోవడంపై సూర్య (49 బంతుల్లో 50) ఫోకస్ పెట్టాడు. మంచి బంతులను కూడా బౌలర్ల తల మీదుగా బౌండరీలకు తరలించాడు. మ్యాచ్ కష్టమే అనుకున్న తరుణంలో క్రీజులోకి వచ్చిన మిస్టర్ 360.. కెప్టెన్ కేఎల్ రాహుల్ (58 నాటౌట్)కు అండగా నిలిచి గెలుపులో కీలకపాత్ర పోషించాడు. ఈ మ్యాచ్​లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్ ఓవర్లన్నీ ఆడి 276 రన్స్​కు ఆలౌట్ అయింది. అనంతరం భారత్ 48.4 ఓవర్లకు 5 వికెట్లు కోల్పోయి 281 రన్స్ చేసింది.

ఇదీ చదవండి: జాన్ సీనాను ఇమిటేట్ చేసిన అంపైర్.. ఔట్ ఇవ్వకుండా..!

Show comments