వన్డే వరల్డ్ కప్‌కు ముందు టీమిండియా ప్లేయర్లు ఒక్కొక్కరుగా అందరూ ఫామ్‌లోకి వస్తున్నారు. ఆసియా కప్‌లోనే చాలా మంది భారత ఆటగాళ్లు గాడిలో పడగా.. ఆస్ట్రేలియాతో జరుగుతున్న వన్డే సిరీస్‌లో మిగిలిన వాళ్లు కూడా సత్తా చాటుతున్నారు. టాపార్డర్ నుంచి మిడిలార్డర్ వరకు భారత్‌కు ఉన్న సమస్యలు ఒక్కొక్కటిగా అన్నీ పరిష్కారమవుతున్నాయి. ఇదే చివరి ఛాన్స్, ఇప్పుడు ఆడకపోతే ప్రపంచ కప్ టీమ్‌లో చోటు కష్టమే అనే కామెంట్స్ మధ్య శ్రేయాస్ అయ్యర్ చెలరేగిపోయాడు. ఆందోళనలు, అనుమానాలు, భయాలను పోగొడుతూ ఆస్ట్రేలియాతో జరిగిన రెండో వన్డేలో శతక్కొట్టాడు. ఫామ్‌ను, ఫిట్నెస్ను నిరూపించుకున్నాడు.
ఆస్ట్రేలియాతో రెండో వన్డేలో శ్రేయాస్ అయ్యర్ (105)తో పాటు సూపర్ ఫామ్‌లో ఉన్న యువ ఓపెనర్ శుబ్‌మన్ గిల్ (104) అదరగొట్టాడు. తన మీద ఉన్న అంచనాలను, జట్టు ధీమాను పెంచుతూ అలవోకగా మరో సెంచరీ బాదేశాడు. కెప్టెన్ కేఎల్ రాహుల్ (52)తో పాటు సూర్యకుమార్ యాదవ్ (72 నాటౌట్) కూడా తమ ఫామ్‌ను చాటుకున్నారు. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌కు దిగిన భారత్ 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 399 పరుగులు భారీ స్కోరు చేసింది. వాన కారణంగా ఆసీస్ లక్ష్యాన్ని 33 ఓవర్లలో 317 రన్స్‌కు సవరించారు. అయితే అశ్విన్ (3/41), జడేజా (3/42), ప్రసిద్ధ్ కృష్ణ (2/56) ధాటికి ఆ టీమ్ 28.2 ఓవర్లలో 217 రన్స్‌కే ఆలౌటైంది.
ఆసీస్ జట్టులో అబాట్ (54) టాప్ స్కోరర్. ఓపెనర్ డేవిడ్ వార్నర్ (53) కూడా రాణించాడు. ఈ విక్టరీతో టీమిండియా సిరీస్‌లో 2-0 ఆధిక్యం సంపాదించింది. ఇరు జట్ల మధ్య మూడో వన్డే బుధవారం జరుగుతుంది. ఇక, రెండో వన్డేలో భారత జట్టు చరిత్ర సృష్టించింది. ఈ మ్యాచ్‌లో టీమిండియా క్రికెటర్లు రికార్డు స్థాయిలో 18 సిక్సర్లు బాదారు. దీంతో వన్డే క్రికెట్లో 3,000 సిక్సర్ల మార్క్‌ను తాకిన ఫస్ట్ టీమ్‌గా భారత్ (3,007) వరల్డ్ రికార్డ్ నెలకొల్పింది. వన్డేల్లో ఇప్పటిదాకా ఏ జట్టు కూడా 3 వేల సిక్సర్లు కొట్టలేదు. భారత్ తర్వాతి ప్లేసులో వెస్టిండీస్ (2,953), పాకిస్థాన్ (2,566), ఆస్ట్రేలియా (2,476). న్యూజిలాండ్ (2,387), ఇంగ్లండ్ (2,032) ఉన్నాయి.
ఇదీ చదవండి: అయ్యర్ మెరుపు సెంచరీ.. అసలైన కమ్‌బ్యాక్ ఇది!