ఆస్ట్రేలియాతో రెండో వన్డే.. భారత అభిమానులకు బ్యాడ్ న్యూస్!

  • Author singhj Published - 07:36 PM, Sat - 23 September 23
  • Author singhj Published - 07:36 PM, Sat - 23 September 23
ఆస్ట్రేలియాతో రెండో వన్డే.. భారత అభిమానులకు బ్యాడ్ న్యూస్!

వరల్డ్ కప్​కు ముందు భారత్​కు అన్నీ శుభశకునములే కనిపిస్తున్నాయి. ఎలా ఆడతారో అనే అనుమానాల మధ్య ఆసియా కప్​కు బయల్దేరిన టీమిండియాకు ఆ టోర్నీలో ఎదురే లేకుండా పోయింది. సూపర్​-4లో పాకిస్థాన్, శ్రీలంకను మట్టికరిపించిన భారత్.. ఫైనల్లో లంకను చిత్తుచిత్తుగా ఓడించి కప్​ను కైవసం చేసుకుంది. ఆసియా కప్ అనంతరం ఆస్ట్రేలియా జట్టుతో శుక్రవారం జరిగిన తొలి వన్డేలోనూ గెలిచింది. ఈ విజయం ద్వారా వన్డేల్లో భారత్ ఆగ్రస్థానానికి చేరుకుంది. ఒక్క 50 ఓవర్ల ఫార్మాట్​లోనే కాదు.. టీ20, టెస్టుల్లోనూ నెంబర్ వన్​ టీమ్​గా టీమిండియా అవతరించింది.

భారత జట్టుతో పాటు ప్లేయర్లు కూడా ఐసీసీ ర్యాంకింగ్స్​లో అదరగొడుతున్నారు. ఇటీవలే స్టార్ పేసర్ మహ్మద్ సిరాజ్ వన్డేల్లో ప్రపంచ నెంబర్ వన్ బౌలర్ అయ్యాడు. టీ20ల్లో బ్యాటర్ల ర్యాంకింగ్స్​లో సూర్యకుమార్ యాదవ్ చాన్నాళ్లుగా ఫస్ట్ ప్లేసులోనే ఉన్నాడు. టెస్టుల్లో సీనియర్ ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ మొదటి స్థానంలో ఉన్నాడు. ఇలా అన్ని ఫార్మాట్లలోనూ టీమిండియాతో పాటు టీమ్​లోని ప్లేయర్లు తమ ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తున్నారు. వరల్డ్ కప్​కు ముందు ఆసియా కప్, ఆసీస్​పై తొలి మ్యాచ్​లో గెలుపుతో భారత్ ప్రత్యర్థులకు డేంజర్ సిగ్నల్స్ పంపిస్తోంది.

ఇటీవల కాలంలో భారత బ్యాటర్లు రోహిత్ శర్మ, శుబ్​మన్ గిల్, ఇషాన్ కిషన్, విరాట్ కోహ్లీ, హార్దిక్ పాండ్యా మంచి ఫామ్​లో ఉన్నారు. కమ్​బ్యాక్ ఇచ్చిన కేఎల్ రాహుల్​తో పాటు సూర్యకుమార్ యాదవ్ తమ సత్తా ఏంటో చూపించారు. బౌలర్లలో మహ్మద్ సిరాజ్, మహ్మద్ షమి, జస్​ప్రీత్ బుమ్రా, కుల్దీప్ యాదవ్ జోరు మీదున్నారు. ఒక్క శ్రేయాస్ అయ్యర్ తన ఫామ్​ను చాటుకోవాల్సి ఉంది. అలాగే బౌలింగ్​లో అదరగొడుతున్న జడ్డూ.. బ్యాటింగ్​లోనూ సత్తా చాటాల్సి ఉంది. ఇప్పటికైతే టీమ్​ మంచి ఊపు మీద ఉంది. వరుస విజయాలు కూడా దక్కుతున్నాయి. దీంతో వరల్డ్ కప్ ప్రయాణాన్ని భారత్ మరింత ఆత్మవిశ్వాసంతో ప్రారంభించేందుకు సిద్ధమవుతోంది.

ఇక, ఆసీస్​తో తొలి మ్యాచ్​లో అదరగొట్టిన టీమిండియా సెప్టెంబర్ 24న ఇండోర్​లో జరిగే రెండో వన్డేకు రెడీ అవుతోంది. ఇందులో గెలిచి సిరీస్​ను 2-0తో సొంతం చేసుకోవాలని భావిస్తోంది. అయితే భారత జట్టు ఆశలపై వరుణుడు నీళ్లు జల్లే ఛాన్స్ ఉంది. ఈ మ్యాచ్​ జరిగే టైమ్​లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడే అవకాశం ఉందని అక్కడి వాతావరణ శాఖ వెల్లడించింది. ఆదివారం నాడు ఆకాశం మేఘావృతమై ఉంటుందని పలు నివేదికలు చెబుతున్నాయి. దీంతో క్రికెట్ ఫ్యాన్స్ ఈ మ్యాచ్ జరుగుతుందో లేదో అని టెన్షన్ పడుతున్నారు.

ఇదీ చదవండి: రోహిత్ అంటే భయం.. కోహ్లీ మాటలు లీక్ చేసిన అశ్విన్!

Show comments