వీడియో: అద్భుతమైన క్యాచ్ తో ఆకట్టుకున్న తిలక్ వర్మ!

టీమిండియా టూర్ ఆఫ్ వెస్టిండీస్ 2023లో భారత్ ఆధిపత్యం కొనసాగుతోంది. టెస్టు సిరీస్, వన్డే సిరీస్ లను కైవసం చేసుకున్న టీమిండియా ఇప్పుడు టీ20 సిరీస్ మీద కన్నేసింది. ఈ సిరీస్ ని కూడా కైవసం చేసుకునే సంకేతాలు అయితే కనిపిస్తున్నాయి. టరోబా వేదికగా జరుగుతున్న తొలి టీ20 మ్యాచ్ లో మొదటి నుంచే టీమిండియా ఆధిపత్యం కొనసాగిస్తోంది. టీ20 మ్యాచ్ లో కూడా వెస్టిండీస్ తడబడుతూనే ఉంది. కేవలం 100 పరుగులకే 4 వికెట్లు కోల్పోయింది.

టాస్ గెలిచినా వెస్టిండీస్ కు మాత్రం కష్టాలు తప్పలేదు. బ్యాటింగ్ ఎంచుకుని బరిలోకి దిగిన వెస్టిండీస్ బ్యాటర్లు కాసేపటికే పెవిలియన్ వైపు పరుగులు పెడుతున్నారు. తొలుత నాలుగు ఓవర్లు కాస్త నిలకడ ప్రదర్శించారు. అప్పుడప్పుడే పార్టనర్షిప్ బిల్డ్ అవుతుంది అనుకున్న సమయంలో చాహల్ వెస్టిండీస్ ని కట్టడి చేశాడు. ఒకే ఓవర్లో రెండు వికెట్లు తీశాడు. ఐదో ఓవర్ బౌలింగ్ వేసేందుకు వచ్చిన చాహల్ తొలి బంతికే కైల్ మేయర్స్ ని ఎల్బీడబల్యూగా పెవిలియన్ కు పంపాడు. ఆ తర్వాత ఐదో ఓవర్లో 3వ బంతికి బ్రాండన్ కింగ్ ని కూడా ఎల్బీడబ్ల్యూ చేశాడు. 4 ఫోర్లు, ఒక సిక్సర్ సాయంతో 28 పరుగులు చేసి ఫామ్ లో ఉన్న బ్రాండన్ కింగ్ కు బ్రేకులు వేశాడు. ఆ తర్వాత కుల్దీప్ అటాక్ లోకి వచ్చాడు. జేసన్ ఛార్లెస్ ని క్యాచ్ అవుట్ గా పెవిలియన్ చేర్చాడు.

అయితే ఇప్పుడు ఈ క్యాచ్ నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఆ సూపర్ క్యాచ్ పట్టింది మరెవరో కాదు.. తెలుగు కుర్రాడు తిలక్ వర్మ. బౌండిరీ దగ్గర ఉన్న తిలక్ వర్మ దాదాపు 10 మీటర్లు దూరం పరిగెత్తుకుంటూ వెళ్లి డైవ్ చేసి క్యాచ్ అందుకున్నాడు. ఆ తర్వాత కిందపడి పల్టీలు కొట్టుకుంటే పైకి లేచాడు. ఆ క్యాచ్ చూసిన ప్రేక్షకులు మాత్రమే కాదు.. కామెంటేటర్లు కూడా ఆశ్చర్యపోయారు. ఆ తర్వాత నాలుగో వికెట్ కూడా క్యాచ్ అవుటే అయింది. ఆ క్యాచ్ కూడా తిలక్ వర్మానే పట్టాడు. అప్పటి వరకు మెరుపులు మెరిపించిన నికోలస్ పూరన్.. అర్ధ శతకానికి చేరువలో ఉన్న సమయంలో సూపర్ క్యాచ్ పట్టి తిలక్ వర్మ పెలియన్ చేర్చాడు. 18 ఓవర్లు ముగిశాక వెస్టిండీస్ 5 వికెట్ల నష్టానికి 134 పరుగులు చేసింది. టీమిండియా బౌలర్లలో చాహల్ 2, అర్షదీప్, హార్దిక్, కుల్దీప్ యాదవ్ లకు తలో వికెట్ పడింది.

Show comments