ఆసియా కప్‌ కోసం ఆఫ్ఘాన్‌ జట్టు ప్రకటన! కోహ్లీ శత్రువుకి దక్కని చోటు

ఆసియా కప్‌ 2023 మరో రెండు రోజుల్లో ప్రారంభం కానుంది. ఈ నెల 30 నుంచి సెప్టెంబర్‌ వరకు ఈ మినీ వరల్డ్‌ కప్‌ జరగనుంది. పాకిస్థాన్‌-శ్రీలంక వేదికగా జరగనున్న ఈ టోర్నీలో మొత్తం ఆరు జట్లు పాల్గొననున్నాయి. భారత్‌, పాకిస్థాన్‌, శ్రీలంక, బంగ్లాదేశ్‌, ఆఫ్ఘనిస్థాన్‌, నేపాల్‌ జట్లు టైటిల్‌ కోసం తలపడనున్నాయి. ఇప్పటికే అన్ని జట్లు.. ఈ మినీ మెగా టోర్నీ కోసం సంసిద్ధంగా ఉన్నాయి. తమ తమ ప్రణాళికలు, వ్యూహాలతో రెడీ అవుతున్నాయి. ఇప్పటికే ఆసియా కప్‌లో ఆడే జట్లను దాదాపు అన్ని క్రికెట్‌ బోర్డులు ప్రకటించాయి. తాజాగా ఆఫ్ఘనిస్థాన్‌ క్రికెట్‌ బోర్డు సైతం తమ ఆసియా కప్‌ జట్టును ప్రకటించింది.

రషీద్‌ ఖాన్‌, మొహమ్మద్‌ నబీ, ముజీబ్‌, జద్రాన్‌, గుర్బాజ్‌లతో ఆఫ్ఘాన్‌ టీమ్‌ పటిష్టంగానే కనిపిస్తోంది. పెద్ద టీమ్స్‌కు షాకిచ్చినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు. ఆ టీమ్‌ ప్రధాన బలం స్పిన్‌. ప్రపంచ అత్యుత్తమ బౌలర్లలో ఒకడైన రషీద్‌ ఖాన్‌తో పాటు నబీ, ముజీబ్‌ స్పిన్‌తో ప్రత్యర్థిని చుట్టేయగలరు. ఇక ఆసియా కప్‌ టీమ్‌కు స్టార్‌ ప్లేయర్‌ హష్మతుల్లా షాహిదీను కెప్టెన్‌గా ఎంపిక చేసింది ఆఫ్ఘాన్‌ క్రికెట్‌ బోర్డు. ఇకపోతే ఈ టీమ్‌లో స్టార్‌ బౌలర్‌ నవీన్‌ ఉల్‌ హక్‌కు ఆసియా కప్‌ టీమ్‌లో చోటు దక్కలేదు. నవీన్‌ ఉల్‌ హక్‌ పేరు వినగానే చాలా మందికి విరాట్‌ కోహ్లీ గుర్తుకువస్తాడు.

ఎందుకంటే.. కోహ్లీ-నవీన్‌ ఉల్‌ హక్‌ మధ్య ఐపీఎల్‌ 2023లో జరిగిన పెద్ద గొడవే కారణం. కోహ్లీతో గొడవకు దిగాడని.. నవీన్‌పై ఏ రేంజ్‌లో ట్రోలింగ్‌ జరిగిందో అందరికీ తెలిసిందే. భారత క్రికెట్‌ అభిమానులు అతనిపై సోషల్‌ మీడియా వేదికగా దారుణంగా విరుచుకుపడ్డారు. నవీన్‌తో గొడవ కాస్తా.. కోహ్లీ-గంభీర్‌ గొడవకు సైతం దారితీసింది. ఆర్సీబీ-లక్నో మధ్య జరిగిన మ్యాచ్‌తో ఈ గొడవ చోటు చేసుకుంది. అయితే.. ఆ తర్వాత ఆసియా కప్‌ ఆరంభం అవుతుందనుకున్న సమయంలో మరోసారి వీరిద్దరు ఎలా రియాక్ట్‌ అవుతారో అని క్రికెట్‌ అభిమానులు ఆసక్తి చూపించారు. నవీన్‌ బౌలింగ్‌ను టార్గెట్‌ చేసిన కోహ్లీ తన సత్తా ఏంటో చూపిస్తాడని, నవీన్‌ సిద్ధంగా ఉండాలని ఇండియన్‌ క్రికెట్‌ ఫ్యాన్స్‌ సోషల్‌ మీడియాలో హెచ్చరికలు సైతం పంపారు. కానీ, అనూహ్యంగా ఆఫ్ఘనిస్థాన్‌ క్రికెట్‌ బోర్డు నవీన్‌ను అసలు ఆసియా కప్‌కే ఎంపిక చేయకపోవడంతో క్రికెట్‌ అభిమానులు నిరాశ చెందుతున్నారు. మరి ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఆసియా కప్‌లో ఆడే ఆఫ్ఘనిస్థాన్‌ టీమ్‌ ఇదే..
హష్మతుల్లా షాహిదీ(కెప్టెన్‌), రహ్మానుల్లా గుర్బాజ్‌, ఇబ్రహీం జద్రాన్‌, రహ్మత్‌ షా, నజీబ్‌ ఉల్లా జద్రాన్‌, నబీ, రియాజ్‌ హసన్‌, ఇక్రమ్‌ అలీ ఖిల్‌, గుల్బాదిన్‌ నయాబ్‌, కరీమ్‌ జనత్‌, అబ్దుల్‌ రెహమాన్‌, రషీద్‌ ఖాన్‌, షరపుద్దీన్‌ ఉర్‌ రహ్‌ అష్రఫ్‌, సులిమాన్‌ సఫీ, ఫజల్హాక్‌ ఫరూఖీ, నూర్‌ అహ్మద్‌.

ఇదీ చదవండి: ధోనిని టార్గెట్‌ చేసిన సెహ్వాగ్‌, యువరాజ్‌! సంచలన వ్యాఖ్యలు

Show comments