KS Bharat: ఇంగ్లండ్‌తో రెండో టెస్ట్‌.. KS భరత్‌కు సన్మానం!

టీమిండియా యువ క్రికెటర్‌ కేఎస్‌ భరత్‌ ఇంగ్లండ్‌తో రెండో టెస్టులో బరిలోకి దిగనున్నాడు. అయితే.. ఈ టెస్టు మ్యాచ్‌కి ముందుకు అతన్ని ఘనంగా సన్మానించనున్నారు. ఎందుకో ఇప్పుడు తెలుసుకుందాం..

టీమిండియా యువ క్రికెటర్‌ కేఎస్‌ భరత్‌ ఇంగ్లండ్‌తో రెండో టెస్టులో బరిలోకి దిగనున్నాడు. అయితే.. ఈ టెస్టు మ్యాచ్‌కి ముందుకు అతన్ని ఘనంగా సన్మానించనున్నారు. ఎందుకో ఇప్పుడు తెలుసుకుందాం..

ఇంగ్లండ్‌తో రెండో టెస్టు మ్యాచ్‌కు టీమిండియా రెడీ అయింది. విశాఖపట్నంలోని డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి క్రికెట్‌ స్టేడియంలో భారత్‌-ఇంగ్లండ్‌ మధ్య శుక్రవారం నుంచి రెండో టెస్టు మ్యాచ్‌ జరగనుంది. ఈ మ్యాచ్‌ కోసం తెలుగు క్రికెట్‌ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అలాగే ఈ మ్యాచ్‌లో విజయం సాధించాలని ఇరు జట్లు గట్టి పట్టుదలతో బరిలోకి దిగుతున్నాయి. ఇప్పటికే హైదరాబాద్‌లోని రాజీవ్‌ గాంధీ ఇంటర్నేషనల్‌ క్రికెట్‌ స్టేడియం వేదికగా జరిగిన తొలి మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ విజయం సాధించి.. 1-0 లీడ్‌లోకి వచ్చిన విషయం తెలిసిందే. దీంతో.. వైజాగ్‌లో జరిగే రెండో టెస్టులో ఎలాగైన విజయం సాధించి.. 1-1తో లెక్కసరి చేసి.. పరువు నిలుపుకోవాలని చూస్తోంది టీమిండియా.

కాగా.. ఈ మ్యాచ్‌లో టీమి​ండియా పలు మార్పులతో బరిలోకి దిగే అవకాశం ఉంది. తొలి టెస్ట్‌ ఆడిన రవీంద్ర జడేజా, కేఎల్‌ రాహుల్‌ గాయాలతో రెండో టెస్టుకు దూరమైన విషయం తెలిసిందే. అలాగే ఫామ్‌లో లేని శుబ్‌మన్‌ గిల్‌, శ్రేయస్‌ అయ్యర్‌లలో ఒకర్ని పక్కనపెట్టినా.. మొత్తం మూడు మార్పులతో బరిలోకి దిగనుంది భారత జట్టు. అయితే.. వికెట్‌ కీపర్‌ కమ్‌ బ్యాటర్‌, మన తెలుగు క్రికెటర్‌ కేఎస్‌ భరత్‌ తొలి టెస్టులో మంచి ప్రదర్శన కనబర్చాడు. దీంతో అతను రెండో టెస్టు ఆడటం ఖాయం. కాగా, రెండో టెస్టుకు ముందు కేఎస్‌ భరత్‌ను ఆంధ్రా క్రికెట్‌ అసోసియేషన్‌ సన్మానించనుంది. ఇదే గ్రౌండ్‌లో 2005లో బాల్‌ బాయ్‌గా కెరీర్‌ మొదలుపెట్టి.. ఇప్పుడు ఇదే గ్రౌండ్‌లో టీమిండియా క్రికెటర్‌గా మ్యాచ్‌ ఆడబోతుండటంతో ఏసీఏ ఈ నిర్ణయం తీసుకుంది.

డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి ఏసీఏ-వీడీసీఏ స్టేడియంతోనే కేఎల్‌ భరత్‌ జర్నీ ప్రారంభం అయింది. పైగా.. సొంత గడ్డపై టీమిండియా తరఫున మ్యాచ్‌ ఆడబోతున్న రెండో ఆంధ్రుడిగా కూడా కేఎస్‌ భరత్‌ చరిత్ర సృష్టించనున్నాడు. భరత్‌ కంటే ముందు.. భారత దిగ్గజ మాజీ ఆటగాడు సీకే నాయుడు.. టీమిండియా తరఫున ఆంధ్రాలో క్రికెట్‌ ఆడిన తొలి క్రికెటర్‌గా నిలిచారు. అయితే.. భరత్‌ కంటే ముందుకు ఎంఎస్‌కే ప్రసాద్‌, హనుమ విహారి టీమిండియా తరఫున టెస్టు మ్యాచ్‌లు ఆడినా.. వాళ్లిద్దరికి ఆంధ్రాలో టెస్ట్‌ మ్యాచ్‌ ఆడే అవకాశం రాలేదు. దీంతో సీకే నాయుడి తర్వాత ఆంధ్రాలో టెస్ట్‌ మ్యాచ్‌ ఆడుతున్న ఆంధ్రుడిగా భరత్‌ నిలవనున్నాడు. దీంతో.. అతన్ని గురువారం ఏసీఏ ఘనంగా సన్మానించాలని నిర్ణయించింది. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Show comments