World Cup: న్యూజిలాండ్‌పై టీమిండియా విజయానికి 5 ప్రధాన కారణాలు!

పెద్ద గండాన్ని టీమిండియా దాటేసింది. చాలా కాలంగా వరల్డ్‌ కప్స్‌లో మనకు కొరకరాని కొయ్యగా మారిన న్యూజిలాండ్‌ను మట్టికరిపిస్తూ.. వరుసగా ఐదో విజయం సాధించింది. మరి ఈ విజయంలో ప్రధానంగా నిలిచిన ఓ ఐదు కారణాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

పెద్ద గండాన్ని టీమిండియా దాటేసింది. చాలా కాలంగా వరల్డ్‌ కప్స్‌లో మనకు కొరకరాని కొయ్యగా మారిన న్యూజిలాండ్‌ను మట్టికరిపిస్తూ.. వరుసగా ఐదో విజయం సాధించింది. మరి ఈ విజయంలో ప్రధానంగా నిలిచిన ఓ ఐదు కారణాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

దాదాపు 20 ఏళ్ల తర్వాత టీమిండియా న్యూజిలాండ్‌ను వరల్డ్‌ కప్‌ టోర్నీల్లో ఓడించింది. వన్డే వరల్డ్‌ కప్‌ 2023లో భాగంగా ఆదివారం హిమాచల్‌ప్రదేశ్‌లోని ధర్మశాల వేదికగా భారత్‌-న్యూజిలాండ్‌ మధ్య మ్యాచ్‌ జరిగింది. ఇప్పటి వరకు ఈ టోర్నీలో నాలుగేసి మ్యాచ్‌లు ఆడి.. ఓటమి ఎరుగని జట్లుగా ఉన్న ఈ రెండు టీమ్స్‌ మధ్య పోటీ హోరాహోరీగా సాగింది. అయితే.. అంతిమంగా టీమిండియా విజయకేతనం ఎగురవేసింది. దీంతో.. వరుసగా ఐదో విజయాన్ని ఖాతాలో వేసుకుంది. కాగా, వరల్డ్‌ కప్స్‌ అంటే న్యూజిలాండ్‌ మనపై ఆధిపత్యం చెలాయించేది. 2019 వరల్డ్‌ కప్‌లో కూడా సెమీస్‌లో మనల్ని ఓడించింది న్యూజిలాండ్‌. ఆ ఓటమికి రోహిత్‌ సేన ఈ మ్యచ్‌తో ప్రతీకారం తీర్చుకుంది. అయితే.. ఈ విజయానికి ఐదు ప్రధాన కారణాలు ఏంటో ఇప్పుడు చూద్దాం..

1. బౌలింగ్‌
ఈ మ్యాచ్‌లోనే కాదు.. ఈ టోర్నీ ఆసాంతం టీమిండియా బౌలింగ్‌ను మెచ్చకోవాల్సిందే. ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యా గాయంతో దూరమైనా, మరో ఆల్‌రౌండర్‌ శార్దుల్‌ ఠాకూర్‌ను పక్కనపెట్టి.. కేవలం ఐదుగురు నిఖార్సయిన బౌలర్లతో బరిలోకి దిగి.. న్యూజిలాండ్‌ లాంటి పటిష్టమైన జట్టును మంచి బ్యాటింగ్‌ పిచ్‌పై కేవలం 273 పరుగులకే పరిమితం చేయడం మామూలు విషయం కాదు. ఆరంభంలో బుమ్రా-సిరాజ్‌ కట్టుదిట్టమైన బౌలింగ్‌తో కివీస్‌కు మంచి స్టార్ట్‌ దక్కకుండా చేశారు. పవర్‌ప్లే తర్వాత.. డారిల్‌ మిచెల్‌-రచిన్‌ రవీంద్ర టీమిండియా బౌలింగ్‌ ఎటాక్‌పై ఆధిపత్యం చెలాయిస్తూ.. అద్భుత భాగస్వామ్యం నమోదు చేసినా.. చివర్లో మళ్లీ షమీ చెలరేగి న్యూజిలాండ్‌ భారీ స్కోర్‌ చేయకుండా అడ్డుకున్నాడు. ఈ టోర్నీలో తొలి మ్యాచ్‌ ఆడుతూ.. షమీ 5 వికెట్లు సాధించాడంటే.. మన బెంచ్‌ ఎంత బలంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.

2. ఓపెనింగ్‌ జోడీ
దాదాపు ప్రతి మ్యాచ్‌లానే ఈ మ్యాచ్‌లో కూడా టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ అద్భుతంగా ఆడి టీమిండియాకు మంచి స్టార్ట్‌ అందించాడు. అగ్రెసివ్‌ ఇంటెంట్‌తో ఆరంభంలో జట్టుపై ఏ మాత్రం ఒత్తిడి లేకుండా చేస్తున్నాడు హిట్‌మ్యాన్‌. ఇది ప్రత్యర్థి టీమ్‌పై ఎంతో ఇంప్యాక్ట్‌ చూపిస్తుంది. రోహిత్‌ శర్మ చేసింది కేవలం 46 పరుగులకే అయినా.. దాని ఇంప్యాక్ట్‌ చాలా పెద్దది. 40 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్సులతో 46 రన్స్‌ చేసి.. టీమిండియాకు శుభారంభం అందించడమే కాదు.. అగ్రెసివ్‌ ఇంటెంట్‌తో కివీస్‌ను మొదట్లోనే నీరుగార్చేశాడు. అలాగే గిల్‌ సైతం రోహిత్‌కు సహకారం అందిస్తూ..26 పరుగులు చేసి తొలి వికెట్‌కు వీరిద్దరు కలిసి 71 పరుగులు జోడించారు.

3. భాగస్వామ్యాలు
టీమిండియా విజయంలో కీలకంగా చెప్పుకోవాల్సింది పార్ట్నర్‌షిప్స్‌ గురించి. పటిష్టమైన న్యూజిలాండ్‌ బౌలింగ్‌ను ఎదుర్కొని.. 274 పరుగుల టార్గెట్‌ను ఛేదించాలంటే.. ఛాంపియన్‌ టీమ్‌కు ఉండాల్సిన లక్షణం.. భాగస్వామ్యాలు నెలకొల్పడం. ఇదే విజయానికి అసలైన కారణంగా చెప్పుకోవచ్చు. రెండో వికెట్‌ త్వరగానే పడిపోయినా.. ఆ తర్వాత నుంచి 3, 4 వికెట్‌కు ఫిఫ్టీ ప్లస్‌ పరుగుల భాగస్వామ్యాలు నమోదు అయ్యాయి. శ్రేయస్‌ అయ్యర్‌, కేఎల్‌ రాహుల్‌, జడేజాలకు ఈ విషయంలో క్రెడిట్‌ ఇవ్వాలి. ఓ వైపు విరాట్‌ కోహ్లీ ఇన్నింగ్స్‌కు మూల స్తంభంలా నిల్చుంటే.. వీళ్ల సహకారంతో మంచి భాగస్వామ్యాలు నమోదు అయ్యాయి.

4. విరాట్‌ కోహ్లీ
రన్‌ మెషీన్‌, ఛేజ్‌ మాస్టర్‌ ఈ బిరుదులు ఊరికే వస్తాయా? ఈ రెండు పదాలకు పర్యాయపదంలా మారిపోయాడు విరాట్‌ కోహ్లీ. ఈ మ్యాచ్‌ విజయంలో కోహ్లీ గురించి ఎంత చెప్పుకున్న తక్కువే అవుతుంది. మ్యాచ్‌ పరిస్థితులకు తగ్గట్లు ఎలా ఆడాలో కోహ్లీని చూసి నేర్చుకోవచ్చు యువ క్రికెటర్లు. ఓ వైపు వికెట్లు పడుతున్నా.. తను మాత్రం ఎక్కడా సహనం కోల్పోకుండా అద్భుతంగా ఆడాడు. శ్రేయస్‌ అయ్యర్‌, కేఎల్‌ రాహుల్‌, జడేజాలతో సూపర్ భాగస్వామ్యాలు నెలకొల్పి.. టీమిండియాను విజయతీరాలకు చేర్చాడు. కేవలం 5 పరుగుల దూరంలో సెంచరీ మిస్‌ అయినా.. ఇది సెంచరీ కంటే గొప్ప ఇన్నింగ్స్‌. టీమిండియాకు దొరికిన వరం.. విరాట్‌ కోహ్లీ. 104 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్సులతో 95 పరుగుల చేసి.. టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషించాడు.

5. రోహిత్‌ కెప్టెన్సీ
ఇక ఈ మ్యాచ్‌లో టీమిండియా విజయానికి కనిపించని మరో ప్రధాన కారణం రోహిత్‌ శర్మ కెప్టెన్సీ. ఈ వరల్డ్‌ కప్‌లో రోహిత్‌ శర్మ పట్టిందల్లా బంగారమే అవుతుంది. జట్టులో అతను చేస్తున్న మార్పులన్నీ అద్భుతంగా కలిసివస్తున్నాయి. ఇప్పటి వరకు జరగిన 4 మ్యాచ్‌ల్లో షమీని ఆడించలేదు. ఎక్స్‌ట్రా బ్యాటర్‌ కావాలనే ఉద్దేశంతో శార్దుల్‌కు అవకాశం ఇచ్చాడు. కానీ, పటిష్టమైన బౌలింగ్‌ లైనప్‌ ఉన్న కివీస్‌పై శార్దుల్‌ను పక్కన పెట్టి షమీని తీసుకున్నాడు. అది ఎంత గొప్ప ఫలితాన్ని ఇచ్చిందో చూశాం. ఏకంగా 5 వికెట్లతో చెలరేగాడు షమీ. పైగా హార్దిక్‌ పాండ్యా లేకపోయినా.. శార్దుల్‌ను పక్కనపెట్టి మరీ షమీని తీసుకొచ్చాడు. పిచ్‌ పరిస్థితులను అద్బుతంగా అంచనా వేసి షమీని తీసుకున్నాడు. అలాగే మ్యాచ్‌లో రోహత్‌ చేస్తున్న బౌలింగ్‌ మార్పులు కూడా సూపర్‌గా ఉన్నాయి. నిజానికి ఈ మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ 300లకి పైగా పరుగులు చేయాల్సి ఉంది. కానీ, 273కే పరిమితం అయిందంటే.. దాని క్రెడిట్‌ షమీ అండ్‌ రోహిత్‌కి ఇవ్వాలి. మరి ఈ మ్యాచ్‌లో టీమిండియా విజయానికి గల కారణాలపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజే​యండి.

ఇదీ చదవండి: న్యూజిలాండ్​తో మ్యాచ్​లో ఇది గమనించారా? కేన్ మామ స్పెషల్ ప్లాన్!

Show comments