IND vs ENG: సెమీస్‌లో ఇంగ్లండ్‌పై టీమిండియా విజయానికి 5 ప్రధాన కారణాలు ఇవే!

IND vs ENG, Semi Final, Rohit Sharma, T20 World Cup 2024: సెమీ ఫైనల్లో పటిష్టమైన ఇంగ్లండ్‌పై టీమిండియా విజయం సాధించి.. ఫైనల్‌కు చేరింది. మరి ఈ మ్యాచ్‌లో భారత జట్టు విజయానికి దోహదం చేసిన ఐదు ప్రధాన కారణాలేంటో ఇప్పుడు చూద్దాం..

IND vs ENG, Semi Final, Rohit Sharma, T20 World Cup 2024: సెమీ ఫైనల్లో పటిష్టమైన ఇంగ్లండ్‌పై టీమిండియా విజయం సాధించి.. ఫైనల్‌కు చేరింది. మరి ఈ మ్యాచ్‌లో భారత జట్టు విజయానికి దోహదం చేసిన ఐదు ప్రధాన కారణాలేంటో ఇప్పుడు చూద్దాం..

ఇంగ్లండ్‌ను చిత్తు చేసి.. టీమిండియా ఫైనల్‌కు దూసుకెళ్లింది. టీ20 వరల్డ్‌ కప్‌ 2024లో భాగంగా గురువారం జరిగిన మ్యాచ్‌లో టీమిండియా 68 పరుగుల తేడాతో అద్భుత విజయం సాధించింది. గయానా వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో రోహిత్‌ శర్మ కెప్టెన్సీ ఇన్నింగ్స్‌.. సూర్యకుమార్‌ యాదవ్‌ బాధ్యతాయుతమైన బ్యాటింగ్‌కి తోడు టీమిండియా స్పిన్నర్లు అక్షర్‌ పటేల్‌, కుల్దీప్‌ యాదవ్‌ స్పిన్‌ మాయాజాలం ముందు ఇంగ్లండ్‌ తలొంచింది. గత టీ20 వరల్డ్‌ కప్‌ 2022 సెమీ ఫైనల్‌లో ఇంగ్లండ్‌ చేతిలో ఎదురైన ఘోర ఓటమికి బదులు తీర్చకుంటూ.. సగర్వంగా ఫైనల్‌కు చేరుకుంది. అయితే.. మరి సెమీస్‌లో టీమిండియా విజయానికి దోహదం చేసిన 5 ప్రధాన కారణాలేంటో ఇప్పుడు చూద్దాం..

1. రోహిత్‌ శర్మ
ఈ మ్యాచ్‌లో టీమిండియా 171 పరుగుల మంచి స్కోర్‌ చేసిందంటే అందుకు ప్రధాన కారణం రోహిత్‌ శర్మ ఆడిన ఇన్నింగ్స్‌ అనే చెప్పాలి. 39 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సులతో 56 పరుగులు చేసి.. కెప్టెన్‌ ఇన్నింగ్స్‌ ఆడి టీమిండియాను ముందుకు నడిపించాడు. మరో స్టార్‌ ప్లేయర్‌ విరాట్‌ కోహ్లీ 9 పరుగులు మాత్రమే చేసి అవుటైనా.. తన ఆత్మవిశ్వాసం కోల్పోకుండా.. అద్భుతమైన ఇన్నింగ్స్‌ ఆడాడు. ఇన్నింగ్స్‌ ఆరంభంలో రెండు లైఫులు దొరికినా.. వాటిని సద్వినియోగపర్చుకుని ముందుకు సాగాడు.

2. రోహిత్‌ – సూర్య భాగస్వామ్యం
టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన టీమిండియాకు ఆరంభంలోనే భారీ ఎదురుదెబ్బ తగిలింది. నాకౌట్‌ మ్యాచ్‌ల్లో ఎప్పుడూ విఫలం కానీ, కోహ్లీని టోప్లీ ఈ మ్యాచ్‌లో త్వరగా అవుట్‌ చేశాడు. ఆ తర్వాత రిషభ్‌ పంత్‌ కూడా వెంటనే అవుట్‌ అయ్యాడు. దీంతో.. టీమిండియా 40 పరుగులకే 2 కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఇలాంటి సమయంలో రోహిత్‌ శర్మ, సూర్యకుమార్‌ యాదవ్‌ కీలక భాగస్వామ్యం నెలకొల్పారు. వారిద్దరి మధ్య పార్ట్నర్‌షిప్‌ మ్యాచ్‌లో టీమిండియాను నిలబెట్టింది. మూడో వికెట్లు వీరిద్దరు కలిసి 73 పరుగులు జోడించారు. మ్యాచ్‌కు ఇదే టర్నింగ్‌ పాయింట్‌.

3. స్పిన్‌ బౌలింగ్‌
ఇక ఇంగ్లండ్‌కు ఎప్పటి నుంచో ఉన్న వీక్‌నెస్‌ స్పిన్‌ బౌలింగ్‌. ఇప్పుడు కూడా అదే అస్త్రానికి తలొంచింది ఇంగ్లండ్‌. టీమిండియా స్టార్‌ స్పిన్నర్లు అక్షర్‌ పటేల్‌, కుల్దీప్‌ యాదవ్‌ ఇంగ్లండ్‌ బ్యాటింగ్‌ లైనప్‌ను కుప్పకూల్చారు. ఇద్దరు చెరో మూడేసి వికెట్లతో అదరగొట్టారు. వీరితో పాటు పేసర్‌ బుమ్రా తన అనుభవాన్ని ఉపయోగించి.. రెండు వికెట్లు తీసుకున్నాడు. ఎంతైనా ఈ మ్యాచ్‌ను టీమిండియా ఇంత ఈజీగా గెలిచిందంటే.. అది స్పిన్నర్ల వల్లే.

4. పిచ్‌ కండీషన్‌
ఈ మ్యాచ్‌లో టీమిండియా విజయానికి పిచ్‌ కండీషన్‌ కూడా హెల్ప్‌ చేసింది. గయానా పిచ్‌ స్లో పిచ్‌ అనే విషయం అందరికి తెలిసిందే. ఈ పిచ్‌పై టీమిండియా అద్భుతంగా బ్యాటింగ్‌ చేసింది. అలాగే పిచ్‌ కండీషన్స్‌ను అద్భుతంగా ఉపయోగించకుంటూ.. సూపర్‌ బౌలింగ్‌తో ఇంగ్లండ్‌ను చిత్తు చేసింది.

5. టాస్‌ ఓడిపోవడం
ఇక ఈ మ్యాచ్‌లో టీమిండియా కష్టానికి అదృష్టం కూడా తోడైందనే చెప్పాలి. ఈ మ్యాచ్‌లో టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ టాస్‌ ఓడిపోయాడు. టాస్‌ గెలిచి ఇంగ్లండ్‌ కెప్టెన్‌ జోష్‌ బట్లర్‌ తొలుత బౌలింగ్‌ చేసే నిర్ణయం తీసుకున్నాడు. ఈ పిచ్‌పై 140కి పైగా పరుగులు చేస్తే గెలుపు ఖాయం అనే పరిస్థితుల్లో ఇంగ్లండ్‌ ఛేజింగ్‌ ఎంచుకోవడం కూడా వారి ఓటమికి కారణంగా చెప్పుకోవచ్చు. ఒక వేళ టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ టాస్‌ గెలిచినా.. వర్షం అంతరాయం కలిగిస్తే డక్‌ వర్త్‌ లూయిస్‌ ప్రకారం ఎంత స్కోర్‌ కావాలో చూసి ఆడొచ్చని ముందుగా బౌలింగ్‌ ఎంచుకునేవాడు. అతను కూడా ఛేజింగే కోరుకునేవాడు. కానీ, మ్యాచ్‌ పూర్తిగా సాగడంతో తొలుత బ్యాటింగ్‌ చేయడం టీమిండియా కలిసివచ్చింది. మరి భారత జట్టు ఫైనల్‌ చేరేందుకు దోహదం చేసిన ఈ ఐదు కారణాలపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Show comments