Dharani
Saripodhaa Sanivaaram Movie Review, Rating in Telugu: ఫ్యామిలీ చిత్రాలకు కేరాఫ్ అడ్రెస్‌గా నిలిచే నాని.. ఈ సారి మాత్రం అందుకు భిన్నంగా సరిపోదా శనివారం అంటూ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌తో వచ్చాడు. మరి ఈ సినిమా ఎలా ఉందంటే..
Saripodhaa Sanivaaram Movie Review, Rating in Telugu: ఫ్యామిలీ చిత్రాలకు కేరాఫ్ అడ్రెస్‌గా నిలిచే నాని.. ఈ సారి మాత్రం అందుకు భిన్నంగా సరిపోదా శనివారం అంటూ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌తో వచ్చాడు. మరి ఈ సినిమా ఎలా ఉందంటే..
Dharani
న్యాచురల్ స్టార్ నాని హీరోగా, వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో ఈ గురువారం ప్రేక్షకుల ముందుకి వచ్చిన చిత్రం “సరిపోదా శనివారం”. వీరిద్దరి కాంబోలో ఆల్రెడీ ‘అంటే సుందరానికి..’ అనే సినిమా రాగా.. అది కంప్లీట్ ఫ్యామిలీ మూవీ. కానీ ఈ సారి వచ్చిన ‘సరిపోదా శనివారం’ మాత్రం అందుకు భిన్నంగా ఫుల్ లెంత్ మాస్, యాక్షన్ ఎంటర్‌టైనర్. మరి ఇప్పుడు “సరిపోదా శనివారం”తో ఈ కాంబో ఎలాంటి ఫలితాన్ని అందుకుందో ఈ రివ్యూ ద్వారా తెలుసుకుందాం.
సూర్య(నాని)కి చిన్ననాటి నుంచి కోపం ఎక్కువ. తనకి తప్పు అనిపించి, కోపం వస్తే ఎవరినైనా కొడుతూ ఉంటాడు. సూర్య తల్లి చనిపోతూ.. కోపానికి ఓ రోజు ఉండాలి అని కొడుకు నుండి ఒట్టు తీసుకుంటుంది. అలా.. సూర్య శనివారం మాత్రమే తన కోపాన్ని చూపిస్తూ.. మిగతా 6 రోజులు మామూలు జీవితం సాగిస్తూ ఉంటాడు. ఇక సోకులపాలెం ప్రజలను సీఐ దయ(ఎస్.జె.సూర్య) నానా కష్టాలు పెడుతూ ఉంటాడు. తన కోపాన్ని ఇక్కడి అమాయకపు ప్రజల మీద చూపిస్తూ ఉంటాడు. అన్యాయం జరిగితే ఆగలేని సూర్య, అన్యాయం తప్ప ఇంకేమి చేయని దయ మధ్యలోకి చారులత(ప్రియాంక మోహన్) ఎలా వచ్చింది? అమ్మకి ఇచ్చిన మాటని నిలుపుకుంటూనే.. సోకులపాలెం ప్రజల కష్టాలు తీర్చడానికి సూర్య ఎలాంటి పోరాటం చేయాల్సి వచ్చింది? అన్నదే మిగిలిన సినిమా.
మంచి దమ్ బిర్యానీ తినాలని అందరికీ ఉంటుంది. కానీ.., దాన్ని బాగా చేయడం అందరి వల్లా కాదు! సినీ ఇండస్ట్రీలో మాస్ సినిమా లెక్క కూడా ఇలాంటిదే. మాస్ సినిమా తీయాలని ప్రతి డైరెక్టర్‌కి ఉంటుంది. కాకపోతే.. అది అందరి వల్లా కాదు. దర్శకుడు వివేక్ ఆత్రేయ.. మాస్ సినిమాని హ్యాండిల్ చేయడంలో ఇలానే కాస్త తడబడ్డాడు. అద్భుతమైన క్యారెక్టరైజేషన్, సూపర్ స్టార్ కాస్ట్, కిక్ ఎక్కించే కాంఫ్లిక్ట్ పాయింట్, సూపర్బ్ అనిపించే టెక్నికల్ టీమ్.. సినిమాలో ఇన్ని ఎలిమెంట్స్ ఉన్నా.. వివేక్ ఆత్రేయ చివరికి వచ్చే సరికి తడబడిపోయాడు. తన బలమైన స్క్రీన్ ప్లే చట్రంలో ఇరుక్కుని.. కథని అక్కడక్కడే తిప్పుతూ, మాస్ సినిమాకి కావాల్సిన ఎమోషన్స్ మిస్ చేసుకుని, అతి కష్టం మీద “సరిపోదా శనివారం”కి కొంతమేర న్యాయం చేయగలిగాడు.
అమ్మ సెంటిమెంట్‌తో మొదలయ్యే “సరిపోదా శనివారం” టేకాఫ్ అద్భుతంగా అనిపిస్తుంది. ఆ సెంటిమెంట్ టచ్ నుండే హీరో క్యారెక్టరైజేషన్ బిల్డ్ అవ్వడం సూపర్బ్ థాట్. దీంతో.. 10 నిమిషాల సీన్స్‌తోనే.. సినిమా మొత్తానికి కావాల్సిన ఎమోషన్ క్యారీ అవ్వడం పక్కా అనిపిస్తుంది. ఇక హీరో క్యారెక్టరైజేషన్ ఎస్టాబ్లిష్ చేయడానికి సాగే సన్నివేశాలు అన్నీ మంచి థ్రిల్‌కి గురి చేస్తాయి. కొన్ని చోట్లా కడుపుబ్బా నవ్విస్తాయి కూడా. హీరో గురించి ఆడియన్స్‌కి ఒక అవగాహన రాగానే.. విలన్ క్యారెక్టర్‌ని పరిచయం చేసిన తీరు, కథలో మెయిన్ కాన్‌ఫ్లిక్ట్ చుట్టూ ఉన్న లేయర్స్ ప్రజెంట్ చేసిన విధానం కూడా బాగుంది. వీటన్నిటికి తోడు.. లవ్ ట్రాక్ బాగా కుదరడం, ఆ ఎమోషన్ నుండే హీరో.. తనది కాని సమస్యని భుజాన వేసుకుని రంగంలోకి దిగడంతో.. ఓ మంచి కమర్షియల్ సినిమాకి కావాల్సిన ప్లాట్ ఫామ్ అంతా పక్కాగా సెట్ అయిపోయింది. దీంతో.. ఫస్ట్ హాఫ్ ముగిసే సమయానికి నానికి హ్యాట్రిక్ దక్కినట్టే అనిపిస్తుంది.
“సరిపోదా శనివారం” సెకండ్ ఆఫ్ దగ్గరికి వచ్చే సరికి సినిమా గ్రాఫ్ అమాంతం పడిపోయింది. హీరోయిన్ ప్లాన్ ప్రకారం.. సూర్య క్యారెక్టర్ డ్రైవ్ అవ్వాల్సి రావడం, ఇదే సమయంలో అసలు హీరోకి సంబంధం లేని విలన్ ట్రాక్‌కి ఎక్కువ స్క్రీన్ స్పేస్ దొరకడం, ఆ గందరగోళం మధ్యనే హీరోకి ఫ్యామిలీ ఎమోషన్స్ అడ్డంకి మారడంతో సరిపోదా శనివారం ట్రాక్ తప్పేసింది. ఈ మొత్తం వ్యవహారంలో.. హీరో వైపు నుండి కథ ముందుకి వెళ్ళకపోవడం, ఇదే సమయంలో హీరో.. విలన్ పక్కనే చేరి, అతన్ని బకరా చేయడం అనే కాన్సెప్ట్ టచ్ కావడంతో సినిమా కాస్త.. మాస్, క్లాస్ అనే ఊగిసలాట మధ్య కిచిడి అయిపోయింది. కథా, కథనం ట్రాక్ తప్పడంతో హీరోకి కూడా ఏదైనా అద్భుతం చేయడం అసాధ్యం అయ్యింది. అయితే.. ఈ మొత్తం సీక్వెన్స్‌లో ఎస్.జె.సూర్య నటన మాత్రం చాలా ఊరట కలిగిస్తుంది.
సరిపోదా శనివారం సినిమా మొత్తం నాని, సూర్యల చుట్టూనే తిరుగుతుంది. ఇద్దరు నువ్వా నేనా అన్నట్లుగా పోటీ పడి నటించారు. కొన్ని సీన్స్‌లో సూర్య డామినేట్ చేశాడు. కానీ.., న్యాచురల్ స్టార్ ఏ మాత్రం తగ్గలేదు. ప్రియాంక కూడా అందంగా కనిపిస్తూనే.. బాగా నటించింది. మురళి శర్మకి చాలా రోజుల తరువాత మంచి పాత్ర దొరికింది. ఇక డైలాగ్ కింగ్ సాయి కుమార్ నటనకి ఫుల్ మార్క్స్ పడతాయి . మిగతా వారు తమ పాత్రల పరిధి మేరకు నటించారు. టెక్నికల్ గా సరిపోదా శనివారం సినిమాకు ప్రధాన బలం బీజీఎం. జేక్స్ బిజాయ్ అదరగొట్టేశాడు. మురళి సినిమాటోగ్రఫీ బాగుంది. ప్రొడక్షన్ వ్యాల్యూస్ రిచ్‌గా ఉన్నాయి. వివేక్ ఆత్రేయ అనూహ్యంగా రచయతగా విఫలం అవ్వడం నిరాశ కలిగించింది. మేకింగ్ విషయంలో మాత్రం మెప్పించాడు.