Venkateswarlu
Saindhav Movie Review & Rating in Telugu: సైంధవ్ సినిమా జనవరి 13వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళం, హిందీ బాషల్లో విడుదల అయింది.
Saindhav Movie Review & Rating in Telugu: సైంధవ్ సినిమా జనవరి 13వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళం, హిందీ బాషల్లో విడుదల అయింది.
Venkateswarlu
సైంధవ్.. విక్టరీ వెంకటేశ్ కెరీర్ లో ప్రతిష్టాత్మక 75వ సినిమాగా తెరకెక్కిన చిత్రం. “హిట్” సీరీస్ చిత్రాలతో దర్శకుడిగా ప్రత్యేక గుర్తింపు దక్కించుకున్న శైలేష్ కొలను ఈ మూవీకి దర్శకత్వం వహించాడు. యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ మూవీ ఎన్నో అంచనాల మధ్య ఈరోజు ప్రేక్షకుల ముందుకి వచ్చింది. మరి..సైంధవ్ సక్సెస్ ట్రాక్ ఎక్కిందా? లేదా? వెంకీ తన ప్రతిష్టాత్మక 75వ సినిమాతో ఎలాంటి ఫలితాన్ని అందుకున్నాడు వంటి విషయాలను ఈ రివ్యూ ద్వారా తెలుసుకుందాం.
ఇండియాలోని చంద్రప్రస్థ అనే సిటీ. అక్కడ సైంధవ్ ( వెంకటేశ్) తన కూతురు గాయత్రి( సారా)తో కలిసి జీవిస్తూ ఉంటాడు. సైంధవ్ ని ఇష్టపడుతూ వారికి తోడుగా మనోగ్య (శ్రద్ధా శ్రీనాథ్) ఇంటి పక్కనే ఉంటుంది. సైంధవ్ తన కూతురే ప్రాణంగా జీవిస్తూ ఉండగా.. గాయత్రి ఓ రోజు స్కూల్ లో కళ్ళు తిరిగి పడిపోతుంది. ఇది జెనెటిక్ సమస్యగా తేల్చి.. డాక్టర్స్ రూ.17 కోట్ల ఖర్చు అయ్యే ఓ ఇంజెక్షన్ ఇవ్వాల్సి ఉంటుందని చెప్తారు. పోర్ట్ లో క్రేన్ ఆపరేటర్ గా పని చేసే సైంధవ్ ఆ ఇంజెక్షన్ కోసం ఓ డీల్ కి ఒప్పుకుంటాడు. అయితే.. సాధారణ క్రేన్ ఆపరేటర్ అయిన సైంధవ్ కి అంత పెద్ద డీల్ ఎందుకు ఇచ్చినట్టు? అసలు గతంలో సైంధవ్ ఏమి చేసేవాడు? చంద్రప్రస్థలోని కార్టెల్ గ్రూప్ అంతా సైంధవ్ ని చూస్టునే ఎందుకు భయపడుతుంది? చివరికి సైంధవ్ తన పాపని కాపాడుకున్నాడా? లేదా? అన్నదే ఈ చిత్ర కథ.
యాక్షన్ థ్రిల్లర్స్ లో హీరోకి ఓ టార్గెట్ ఉండాలి. ఇది బుక్ రూల్ లాంటిది. దాన్ని రీచ్ అవ్వడానికి హీరో ఎన్ని అడ్వెంచర్స్ చేసినా, ఎన్ని ఫైట్స్ చేసినా, ఆఖరికి ఎంత మందిని చంపినా.. ప్రేక్షకులు పాజిటివ్ గానే రిసీవ్ చేసుకుంటారు. సో.. ఇక్కడ కీ పాయింట్ హీరో కాదు, ఆ పర్పస్! కానీ.. హీరో సినిమా ఆసాంతం ఆ టార్గెట్ కోసం ఎన్నో పోరాటాలు చేసి, చివరికి దాన్ని తప్ప మిగతా అన్నీ సాధిస్తే? అదొక అర్థం లేని పోరాటం అవుతుంది. ఇలానే సైంధవ్ లో ఎమోషనల్ టచ్ కోసం దర్శకుడు తీసుకున్న ఓ నిర్ణయం.. హీరో క్యారెక్టర్ కి జస్టిఫికేషన్ లేకుండా చేసేసింది. దీంతో రెండున్నర గంటపాటు సాగిన సినిమా ఇందుకోసం అన్న ప్రశ్న ఉత్పన్నం అవుతుంది.
సైంధవ్ మొదటి అరగంట చాలా ప్లెయిన్ నేరేషన్ తో సాగుతుంది. ఆ తరువాత అసలు కథ మొదలవడంతో సినిమా వేగం అందుకుంటుంది. ఒకానొక సమయానికి దర్శకుడు శైలేష్ ఓ అద్భుతాన్నే సృష్టించాడా అన్న రీతిలో హీరో జర్నీ సాగుతుంది. ఇంటర్వెల్ సమయానికి హీరో టార్గెట్ సరిగ్గా ఎస్టాబ్లిష్ చేసి, ఓ మంచి యాక్షన్ బ్లాక్ తో క్లోజ్ చేయడం కూడా ఆసక్తికరంగా అనిపిస్తుంది. దీంతో.. అప్పటి వరకు ఓకే ఓకేగా నడిచిన సైంధవ్.. సెకండ్ ఆఫ్ లో నెక్స్ట్ లెవల్ టెంపో అందుకుంటుందన్న ఆశ మొదలవుతుంది. కథలో కూడా ఆ స్కోప్ ఉండటంతో ఫస్ట్ ఆఫ్ కాస్త అశాజనకంగానే ముగిసింది అనే ఫీల్ కలుగుతుంది.
సైంధవ్ సెకండ్ ఆఫ్ అంతా ఫుల్ ఆఫ్ యాక్షన్ తో నింపేసే అవకాశం ఉన్నా.. దర్శకుడు ఎమోషన్స్ కి పెద్ద పీఠ వేశాడు. ఆ క్రమంలోనే సైంధవ్ మూవీ ఎమోషనల్ డ్యామేజ్ అయిపోయింది. ఏ ఎమోషన్ కోసమైతే అప్పటి వరకు కథ నడిచిందో దాన్ని కట్ చేసి.., ఆడిటోరియం మూడ్ పూర్తిగా చెడిపోవడానికి దర్శకుడు కారణం అయ్యాడు. తరువాత ఎమోషనల్ మిస్ అయిన యాక్షన్ సీక్వెన్స్ లతో సినిమాని నింపేసి క్లైమ్యాక్స్ ఇంకాస్త భారంగా మార్చేశాడు. ఇన్ని ఫ్లాస్ మధ్య ఒక్క ఎమోషన్ కూడా సరిగ్గా పండక.. సైంధవ్ ఓ సాధారణ యావరేజ్ సినిమాగా మిగిలిపోయింది.
సైంధవ్ కోసం విక్టరీ వెంకటేశ్ చాలానే కష్టపడ్డారు. ముఖ్యంగా యాక్షన్ సీక్వెన్స్ ల్లో వెంకీ కనిపించిన ఇంటెన్స్ గూస్ బంప్స్ తెప్పిస్తుంది. ఇక ఎమోషనల్ సీన్స్ లో ఈ సీనియర్ హీరో సత్తా ఏమిటో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఇలా వెంకటేశ్ ప్రతి విషయంలో తన పాత్రకి పూర్తి న్యాయం చేశాడు. ఇక వెంకటేశ్ తరువాత ప్రధానంగా చెప్పుకోవాల్సింది. నవాజుద్దీన్ సిద్ధిఖీ గురించి. వికాస్ క్యారెక్టర్ లో ఆయన ఒదిగిపోయిన తీరు చూస్తుంటే ముచ్చట వేయక తప్పదు. వాహ్.. వాట్ ఏ యాక్టర్ హీ ఈజ్! ఇక శ్రద్ధా శ్రీనాథ్ కన్నా ఆండ్రియా బాగా మెరిసింది. రుహాణి శర్మ, ఆర్య వంటి నటులు ఫిల్లర్స్ బాగా యూజ్ అయ్యారు.
టెక్నీకల్ గా సైంధవ్ చిత్రానికి పెద్ద ఎసెట్ సంతోష్ నారాయణన్ బ్యాగ్రౌండ్ స్కోర్. పాటలు జస్ట్ ఓకే అనిపించినా.. బీజీఎమ్ తో మాత్రం సంతోష్ నారాయణన్ మ్యాజిక్ చేసేశాడు. మణికంధన్ సినిమాటోగ్రఫీ జస్ట్ ఓకే అనిపించగా, ఎడిటింగ్ విభాగం పూర్తిగా నిరాశ పరిచింది. ముఖ్యంగా సెకండ్ స్క్రీన్ ప్లేలో అన్ని లొసుగులు ఉన్నప్పుడు ఆ పోర్షన్ ని స్కిప్ చేయడంలో ఎడిటర్ పూర్తిగా విఫలం అయ్యాడు. అయితే.. ఇక్కడ ఎడిటర్ గారికి దర్శకుడి నుండి అందిన స్వేచ్ఛ ఎంత అన్నది కొలమానంలోకి వస్తుంది. చివరగా దర్శకుడు శైలేష్. హిట్ సీరీస్ చిత్రాలు అంతగా ఆకట్టుకోవడానికి కారణం ఆ సినిమాల్లోని డీటైల్డ్ స్క్రీన్ ప్లే. శైలేష్.. సైంధవ్ విషయంలో ఇక్కడే ఫెయిల్ అవ్వడం కాస్త ఆశ్చర్యపరిచే అంశం. ఇక సినిమాకి జరిగిన ఎమోషనల్ డ్యామేజ్ విషయంలో కూడా శైలేష్ దే పూర్తి బాధ్యత. ఈ అంశాలే సైంధవ్ స్థాయిని అమాంతం కిందకి లాగేశాయి.
చివరి మాట: సైంధవ్.. ఆశించిన స్థాయిలో లేదు
రేటింగ్: 2.25/5