Hi Nanna Review in Telugu: హాయ్‌ నాన్న సినిమా రివ్యూ!

Hai Nanna Movie Review & Rating in Telugu: నానికి మాస్‌ సినిమాలకంటే ఫ్యామిలీ, రొమాంటిక్‌ సినిమాలతోటే ఎక్కువ పేరు వచ్చింది. ఆయన యూత్‌లో ఎక్కువగా క్రేజ్‌ తెచ్చుకుంది మిడిల్‌ క్లాస్‌ అబ్బాయి పాత్రల్లోనే అని చెప్పొచ్చు.

Hai Nanna Movie Review & Rating in Telugu: నానికి మాస్‌ సినిమాలకంటే ఫ్యామిలీ, రొమాంటిక్‌ సినిమాలతోటే ఎక్కువ పేరు వచ్చింది. ఆయన యూత్‌లో ఎక్కువగా క్రేజ్‌ తెచ్చుకుంది మిడిల్‌ క్లాస్‌ అబ్బాయి పాత్రల్లోనే అని చెప్పొచ్చు.

హాయ్‌ నాన్న

20231207, రొమాంటిక్‌ డ్రామా, 2h 35m యూ
యూ
  • నటినటులు:నాని, మృణాల్‌ ఠాకూర్‌, కియారా ఖన్నా, శృతి హాసన్‌, జయరామ్‌, అంగద్‌ బేడీ, ప్రియదర్శి తదితరులు
  • దర్శకత్వం:శౌర్యవ్‌
  • నిర్మాత:వైరా ఎంటర్‌టైన్‌మెంట్స్‌
  • సంగీతం:హేషమ్‌ అబ్దుల్‌ వాహద్‌
  • సినిమాటోగ్రఫీ:షను వర్గీస్‌

Rating

3

న్యాచురల్‌ స్టార్‌ అన్న పేరుకు తగ్గట్టే నాని నటన చాలా సహజంగా ఉంటుంది. మిడిల్‌ క్లాస్‌ అబ్బాయి పాత్రల్లో ఆయన ఇట్టే ఒదిగిపోతారు. రొమాంటిక్‌ సినిమాల్లో నటన తోటి యూత్‌లో సూపర్‌ క్రేజ్‌ తెచ్చుకున్నారు. అలాంటి ఆయన దసరా సినిమాలో ఊర మాస్‌ లుక్‌లో కనిపించారు. కొత్త దర్శకుడు శ్రీకాంత్‌ ఓదెల డైరెక్షన్‌లో తెరకెక్కిన ఈ చిత్రం మంచి విజయాన్ని నమోదు చేసింది. నాని లుక్‌కు, నటనకు మంచి పేరొచ్చింది. నాని తాజాగా ‘‘హాయ్‌ నాన్న’’ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు.

కొత్త దర్శకులకు అవకాశాలు ఇవ్వటంలో ముందుండే నాని ఈ సినిమాతో శౌర్యవ్‌ను తెలుగు తెరకు పరిచయం చేశారు. శౌర్యవ్‌ దర్శకత్వం వహించిన ఈ రొమాంటిక్‌ ఫ్యామిలీ డ్రామాలో నాని పాత లుక్‌లో కనిపించారు. మరి, కెరీర్‌లో ఎక్కువ విజయాలు తెచ్చిన పెట్టిన జోనర్‌లో నాని సక్సెస్‌ సాధించాడా? కొత్త దర్శకుడు శౌర్యవ్‌తో.. నాని రొమాంటిక్‌ ఫ్యామిలీ డ్రామా ఎంత వరకు వర్కవుట్‌ అయింది? హాయ్‌ నాన్న ప్రేక్షకులను మెప్పించిందా? లేదా?..

కథ:

విరాజ్‌ ( నాని) ఓ ఫొటోగ్రాఫర్‌. ఓ ఫేమస్‌ ఫొటోగ్రాఫర్‌ దగ్గర అసిస్టెంట్‌గా పని చేస్తుంటాడు. ఈ నేపథ్యంలో అతడు యశ్నతో ( మృణాల్‌ ఠాకూర్‌ ) తొలిచూపులోనే ప్రేమలో పడతాడు. కానీ, యశ్నకు ప్రేమ, పెళ్లి, పిల్లలు అంటే నచ్చదు. అలాంటి యశ్న కూడా విరాజ్‌ ప్రేమలో పడుతుంది.  ఇద్దరూ పెళ్లి చేసుకుంటారు. పిల్లలు కనే విషయంలో ఇద్దరికీ గొడవ అవుతుంది. చివరకు విరాజ్‌ కోరిక మేరకు యశ్న పిల్లలు కనడానికి ఒప్పుకుంటుంది. వారిద్దరికీ మహి (బేబీ కియారా ఖన్నా) పుడుతుంది. ఆ పాపకు ఓ ప్రమాదకరమైన వ్యాధి ఉంటుంది. దీని కారణంగా యశ్న పాపను దగ్గరకు తీసుకోలేని పరిస్థితి ఏర్పడుతుంది. ఆ పరిస్థితి విరాజ్‌, యశ్నల మధ్య ఎలాంటి గొడవలకు దారి తీసింది? పాప కారణంగా ఈ ఇద్దరి జీవితాలు ఎలాంటి మలుపు తిరిగాయి అన్నదే మిగితా కథ.

విశ్లేషణ: 

ఇండస్ట్రీలో కొత్త దర్శకులకు అవకాశాలు ఇచ్చే హీరోల్లో నాని కూడా ఒకరు. కొత్త దర్శకులు తమ మొదటి సినిమా కోసం మనసు పెట్టి పని చేస్తారన్నది వాస్తవం. అందుకే కొత్త దర్శకుల నుంచి వచ్చిన నూటికి తొంభై శాతం సినిమాలు సక్సెస్‌ సాధిస్తుంటాయి. కారణం ఏదైనా కావచ్చు.. నాని కొత్త దర్శకులను ఎంపిక చేసుకుని మంచిపనే చేస్తున్నారు. శౌర్యవ్‌ ‘హాయ్‌ నాన్న’ సినిమా కోసం ప్రాణం పెట్టి పని చేశారని చెప్పొచ్చు. కథ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. కథ కొత్తది కాకపోయినా.. కథను సినిమాగా తెరకెక్కించిన విధానం.. కథను ప్రేక్షకులకు చూపించిన విధానం మాత్రం కొత్తగా ఉంది.  స్క్రీన్‌ ప్లే విషయంలో శౌర్యవ్‌ బాగా కష్టపడ్డారు.

ప్రతీ షాట్‌, సీన్‌ను అద్భుతంగా తీర్చి దిద్దారు. అన్ని క్రాఫ్ట్‌లనుంచి మంచి అవుట్‌పుట్‌ను రాబట్టారు. ముఖ్యంగా నటీనటుల నుంచి యాక్టింగ్‌ను పిండేశారు. డైలాగుల గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ట్రైలర్‌ విడుదలైన నాటినుంచే డైలాగులు జనం నోళ్లలో నానుతూ ఉన్నాయి. ‘‘ ఎక్కడ తప్పు చేశాను.. నా ప్రేమ సరిపోవట్లేదా మహి’’ లాంటి డైలాగులు ‘హాయ్‌ నాన్న’లో చాలా ఉన్నాయి. సినిమాతో కనెక్ట్‌ అయిన వారికి రెండున్నర గంటల సినిమా ఇట్టే గడిచిపోతుంది. అయ్యో అప్పుడే అయిపోయిందా అనిపించేలా హాయ్‌ నాన్న ఉంటుంది.

ఈ ప్రపంచం అంతా మనల్ని వెలేసినా.. అమ్మ మాత్రమే తన కడుపులో పెట్టుకుని చూసుకుంటుంది అని అంతా నమ్ముతారు. ఇది సత్యం కూడా. కానీ.., “హయ్ నాన్న” మూవీ కథ దీనికి పూర్తి వ్యతిరేకమైన పాయింట్ దగ్గర మొదలవుతుంది. కథలో ఎన్ని ట్విస్ట్ లు ఉన్నా, ఎంత ఎమోషన్ ఉన్నా.. ఇలాంటి ఓ పాయింట్ తో ఏకంగా సినిమా చేయడం అంటే రిస్క్ తో కూడుకున్న పనే. కానీ.., దర్శకుడు దీన్ని సవాల్ గా తీసుకున్నాడు. ఇందుకోసం నాన్న సెంటిమెంట్ ని బలంగా వాడుకున్నాడు. ముఖ్యంగా ద్వితీయార్ధంలో వచ్చే కొన్ని బలమైన సన్నివేశాలు ఈ సినిమా స్థాయిని అమాంతం పెంచేశాయి. 90 శాతం ఊహకు అందే కథే ఇది. పైగా.. కాస్త స్లో నేరేషన్. కానీ.., దర్శకుడు నమ్మిన ఓ బలమైన ఎమోషన్ “హాయ్ నాన్న” అనే క్లాస్ మూవీకి కమర్షియల్ హిట్ అందుకునే స్థాయిని కల్పించింది.

నటీనటుల నటన :

రొమాంటిక్‌ ఫ్యామిలీ డ్రామాలంటే ఎమోషన్స్‌కు ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. ప్రేక్షకులు కనెక్ట్‌ కావాలన్నా.. కథతో పాటు ట్రావెల్‌ అవ్వాలన్నా.. నటీనటుల నటనే ప్రధానం అవుతుంది. నటన విషయంలో నాని, మృణాల్‌తో సహా ఎవ్వరూ తగ్గలేదు. దిబెస్ట్‌ యాకింగ్‌ను తెరపై చూపించారు. కీలక పాత్రల్లో నటించిన నాని, మృణాల్‌ ఠాకూర్‌, కియారా ఖన్నాలు నటించారు అనటం కంటే.. పాత్రల్లో జీవించారు అనటంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. కొన్ని సీన్లలో వారి నటనకు మన కళ్లలో నీళ్లు తిరుగుతాయి. జయరామ్‌, అంగద్‌ బేడీ, ప్రియదర్శితో పాటు మిగిలిన వారు తమ పాత్రల పరిధి మేరకు అద్భుతంగా నటించారు.

సాంకేతిక వర్గం పనితీరు :

సినిమా మొదలైన నాటినుంచే ‘హాయ్‌ నాన్న’ టీం ప్రమోషన్లను మొదలుపెట్టిన సంగతి తెలిసిందే. ప్రమోషన్లలో భాగంగా విడుదలైన పాటలకు ఎంతటి రెస్సాన్స్‌ వచ్చిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సోషల్‌ మీడియాలో పాటలు ట్రెండింగ్‌లో నిలిచాయి. మ్యూజిక్‌ డైరెక్టర్‌ హేషమ్‌ అబ్దుల్‌ వాహద్‌ తన మ్యూజిక్‌తో మ్యాజిక్‌ చేశారు. సినిమా స్టార్టింగ్‌ దగ్గరి నుంచి ఎండింగ్‌ వరకు ఎక్కడా మ్యూజిక్‌ ఫ్లో తగ్గదు. బ్యాక్‌ గ్రౌండ్‌ మ్యూజిక్‌ మనసుకు హత్తుకు పోతుంది.  సినిమాటోగ్రాఫర్‌ షను వర్గీస్‌ పని తనం గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. తన కెమెరాను ప్రేక్షకుల కళ్లనుంచి చూసి తీసినట్లు ఉన్నాడు. ప్రతీ ఫ్రేము, షాట్‌, ప్రతీ సీను ఐ ఫీస్టుగా ఉంటుంది. ఎడిటర్‌ ప్రవీణ్‌ ఆంథోనీ కొంచెం ఎక్కువ కాకుండా.. కొంచెం తక్కువ కాకుండా.. ప్రతీ షాట్‌ను, ప్రతీ సీన్‌ను అద్భుతంగా కత్తిరించి, అందరికీ నచ్చేలా అతికించి చూపించారు.

ప్లస్‌లు :

  • నటీనటుల నటన
  • కథ
  • స్క్రీన్‌ ప్లే
  • బ్యాక్‌ గ్రౌండ్‌ మ్యూజిక్‌, పాటలు

మైనస్‌ : 

  • ఎస్టాబ్లిస్‌మెంట్‌ కోసం ఎక్కువ సమయం తీసుకోవటం

చివరి మాట: హాయ్ నాన్న మనసును హత్తుకునే ఓ తండ్రి కథ …

రేటింగ్‌ : 3/5

(ఈ రివ్యూ సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే)

Show comments