iDreamPost
iDreamPost
ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పలితాలు బీజేపీకి అనేక రకాలుగా ఊరట కల్పించాయి. వచ్చే సాధారణ ఎన్నికలకు ధీమా కల్పించడమే గాకుండా రాష్ట్రపతి ఎన్నికల్లో సైతం ఎవరి మీద ఆధారపడాల్సిన అవసరం లేకుండా చేశాయి. అదే సమయంలో విపక్షాల నైతికతను దెబ్బకొట్టాయి. మోదీని మరింత బలోపేతం చేసేందుకు తోడ్పడ్డాయి. అవన్నీ ఒక ఎత్తయితే యూపీ రాజకీయ భవిష్యత్తునే ఈ ఎన్నికలు సమూలంగా మార్చేసేలా ఉన్నాయి. బహుళ రాజకీయాలకు, చతుర్ముఖ, బహుముఖ పోటీలకు కేంద్రంగా ఉండే అతి పెద్ద రాష్ట్రంలో ఇకపై ముఖాముఖీ పోరు తప్పదా అనే సంకేతాలు వస్తున్నాయి.
యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో సుదీర్ఘకాలంగా పలు పార్టీలకు అవకాశం ఉండేది. కులాల సమీకరణాల రీత్యా యూపీలో ఒక్కో కులం ఒక్కో పార్టీని బలపరుస్తూ ఉనికిని చాటుకునేవి. కానీ ప్రస్తుతం పరిస్థితి మారిపోయింది. తాజా ఫలితాల ప్రకారం యూపీలో తొలిసారిగా అధికార, ప్రధాన ప్రతిపక్షాలుగా నిలిచిన బీజేపీ, సమాజ్ వాదీ పార్టీలు రెండూ తమ బలాన్ని పెంచుకున్నాయి. బీజేపీకి సీట్ల సంఖ్య తగ్గినా ఓట్ల రీత్యా 2 శాతం అదనపు బలాన్ని దక్కించుకుంది. 2017 ఫలితాలతో పోలిస్తే ఆపార్టీకి 40 శాతం నుంచి సుమారుగా 42 శాతానికి ఆదరణ పెరిగింది. అదే సమయంలో సమాజ్ వాదీ పార్టీ చరిత్రలోనే తొలిసారిగా 30శాతం పైబడి ఓట్లు సాధించింది. ఆపార్టీ అధికారం దక్కించుకున్న 1993,2003, 2012లో సైతం రానన్ని ఓట్లు ఈసారి వచ్చాయి. ఆపార్టీకి 32 శాతం పైబడి ఓట్లు రావడం అనూహ్యం.
రెండు ప్రధాన పార్టీలు బలాన్ని పెంచుకోగా బీఎస్పీ పునాదులు కోల్పోయింది. వరుసగా ఐదారు ఎన్నికల నుంచి తన బలాన్ని స్థిరంగా నిలుపుకుంటూ వస్తోంది. సీట్ల సంఖ్య ఎలా ఉన్నప్పటికీ ఓట్ల రీత్యా 20 శాతానికి అటూ ఇటూగా ఆపార్టీ బలం ఉండేది. అందుకు ప్రధాన కారణమైన జాతావు ఓటర్లు ఈసారి బీఎస్పీని దూరం పెట్టారు. మాయావతి సొంత కులస్తులే యాదవ్ ఆధిక్యాన్ని వ్యతిరేకిస్తూ బీజేపీని బలపరిచారు. ఫలితంగా బీఎస్పీ బలహీనపడడం బీజేపీకి తోడ్పడగా యూపీ కేంద్రంగా చేసుకుని దేశమంతా ప్రభావం చూపించిన బీఎస్పీ బోర్లా పడింది. ఆపార్టీ ఉనికినే ప్రశ్నార్థకం చేసింది.
కాంగ్రెస్ పార్టీ కూడా సుదీర్ఘకాలం పాటు యూపీని ఏలింది. ఆపార్టీకి అనేక రికార్డులున్న రాష్ట్రంలో ఇప్పుడు బలం అనూహ్యంగా పడిపోయింది. గత ఎన్నికల్లో దక్కిన 6 శాతం ఓట్లు ఈసారి భారీగా కోల్పోయింది. బ్రాహ్మణులు గతంలోనే కాంగ్రెస్ ని వీడి బీజేపీ పక్షాన చేరగా ప్రస్తుతం ముస్లీంలు కూడా కాంగ్రెస్ ని విశ్వసించడం లేదని తేలింది. వారంతా ఎస్పీకి అండగా నిలిచినట్టు కనిపిస్తోంది. ఫలితంగా బీఎస్పీ , కాంగ్రెస్ కోటలు కుప్పకులాయి. వాటి స్థానంలో అప్నాదళ్ మూడో అతి పెద్ద పార్టీగా నిలవడం విశేషం. ఆ తర్వాతి స్థానం ఆర్ఎల్డీది. అప్నాదళ్ బీజేపీతో, ఆర్ ఎల్డీ సమాజ్ వాదీతో చేతులు కలిపి సీట్లు సాదించాయి. దాంతో ఇకపై యూపీలో నేరుగా బీజేపీ వర్సెస్ ఎస్పీ అనే పరిస్థితి వస్తుందనే అంచనాలు పెరుగుతున్నాయి. బహుముఖ పోటీ స్థానంలో ఇరు పార్టీలు తలపడే పరిస్థితి అనివార్యంగా భావిస్తున్నారు. ఎంతకాలం అలా ఉంటుందన్నది పక్కన పెడితే ప్రస్తుత ఫలితాల ప్రభావం వచ్చే సాధారణ ఎన్నికల్లో స్పష్టంగా కనిపిస్తుందన్నది ఖాయంగా భావిస్తున్నారు.