iDreamPost
android-app
ios-app

వ‌రి వ‌ర్రీ పోయింది.. పొలిటిక‌ల్ కిరి కిరి ఏమైంది..!

వ‌రి వ‌ర్రీ పోయింది.. పొలిటిక‌ల్ కిరి కిరి ఏమైంది..!

తెలంగాణ రాష్ట్రంలో కొన్నిరోజుల ముందు వ‌ర‌కూ వ‌రి అనేది రాష్ట్ర రైతుల్లోనే కాదు.. రాజ‌కీయంగానూ వ‌ర్రీగా మారిపోయింది. వ‌రి అంశం చుట్టూ తీవ్ర‌స్థాయిలో ఆందోళ‌న‌లు కొన‌సాగాయి. కేంద్రంపై టీఆర్ ఎస్ స‌ర్కారు ఓ రేంజ్ లో ఫైర్ అయ్యేది. వాస్త‌వానికి జీహెచ్ఎంసీ ఎన్నిక‌లు, హుజూరాబాద్ ఉప ఎన్నికకు ముందు కేసీఆర్ ఢిల్లీలో బీజేపీ పెద్ద‌ల‌తో భేటీ అయ్యారు. ప్ర‌ధానంగా రెండు సంద‌ర్భాల్లోనూ ఎన్నిక‌లు జ‌రుగుతున్న వేళ ఆయ‌న ఇలా భేటీ కావ‌డం తీవ్ర చ‌ర్చ‌నీయాంశంగా మారింది. టీఆర్ఎస్ కార్యాల‌య భ‌వ‌నం శంకుస్థాప‌న‌కు వెళ్లిన కేసీఆర్ ఏకంగా ఢిల్లీలో తొమ్మిది రోజుల పాటు ఉన్నారు. అప్పుడు కూడా కేంద్రంలోని ప్ర‌ముఖులు అంద‌రితోనూ స‌మావేశం అయ్యారు. మ‌ళ్లీ కొద్ది రోజుల‌కే ఢిల్లీ వెళ్లారు.

ఇలా వ‌రుస‌గా ఆయ‌న కేంద్రంలోని పెద్ద‌ల‌ను క‌లుస్తున్న నేప‌థ్యంలో గ‌ల్లీలో కుస్తీ.. ఢిల్లీలో దోస్తీ అన్న ప్ర‌చారం జోరుగా సాగింది. కానీ.. హుజూరాబాద్ లో టీఆర్ఎస్ ఓట‌మి అనంత‌రం ప‌రిస్థితులు పూర్తిగా మారిపోయాయి. అక్క‌డ గెలుపుతో బీజేపీ రెట్టించిన ఉత్సాహంతో ఇక రాష్ట్రంలో పాగా వేస్తాం.. అధికారం త‌మ‌దే అంటూ తీవ్ర‌స్థాయిలో ప్ర‌క‌ట‌న‌లు గుప్పించింది. కేసీఆర్ పై బీజేపీ రాష్ట్ర నేత‌లు తీవ్ర స్థాయిలో ఆరోప‌ణ‌లు చేశారు. దీంతో కేసీఆర్ ఏకంగా కేంద్ర ప్ర‌భుత్వంపైనే పోరాటం ప్ర‌క‌టించారు. వ‌రి అంశాన్ని తెర‌పైకి తెచ్చి తెలంగాణ‌లో పండిన మొత్తం ధాన్యం కొనేవ‌ర‌కూ త‌మ పోరాటం ఆగ‌ద‌ని శ‌ప‌థం చేశారు.

గ‌తేడాది న‌వంబ‌ర్ లోనే ఈ మేర‌కు కార్యాచ‌ర‌ణ ప్ర‌క‌టించారు. తెలంగాణలో రైతులు పండించిన వడ్లన్నీ కేంద్రమే కొనాలనే డిమాండ్‌‌ తో కొన‌సాగిన ఆందోళ‌న‌ల్లో ఏకంగా కేసీఆరే పాల్గొన్నారు. తమ పార్టీ కార్యకర్తలు, ప్రజా ప్రతినిధులతో ధర్నాలు చేసి రాష్ట్రాన్నీ, ఢిల్లీని కూడా ద‌ద్ద‌రిల్లేలా చేశారు. కేంద్రానికి డెడ్ లైన్ విధించారు. చివ‌ర‌కు రాష్ట్ర ప్ర‌భుత్వ‌మే ధాన్యం కొంటుంద‌ని ప్ర‌క‌టించి అంద‌రినీ ఆశ్చ‌ర్య‌ప‌రిచారు. ‘తెలంగాణ రాష్ట్రం నుంచి పార్ బాయిల్డ్ రైస్ తీసుకోలేము. ముడి బియ్యం ఎంతైనా తీసుకుంటాం’ అని ఎఫ్‌సి‌ఐ మొద‌టి నుంచీ చెబుతూ వ‌స్తోంది. ఇప్పుడు తాజాగా ‘మా రాష్ట్రం నుంచి పార్ బాయిల్డ్ రైస్ ఇవ్వం. ముడి బియ్యమే ఇస్తాం, మొత్తం తీసుకోవాలి’ అని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ ఎఫ్‌సి‌ఐకి ఉత్తరం రాయ‌డం మ‌రింత ఆశ‌ర్య‌ప‌రుస్తోంది.

అంటే మొద‌టి నుంచీ కేంద్ర ప్ర‌భుత్వం చెబుతున్న ప్ర‌కార‌మే రాష్ట్ర ప్ర‌భుత్వం కూడా అంగీకారం తెలిపిన‌ట్లుగా తెలుస్తోంది. మ‌రి ఈ మాత్రం దానికి అంత తీవ్ర స్థాయిలో కేంద్రంతో యుద్ధం ఎందుకు చేసిన‌ట్లో అర్థం కాని ప‌రిస్థితిగా మారింది. ఈ మొత్తం ఎపిసోడ్ లో మొత్తానికి ధాన్యం ఎవ‌రో ఒక‌రు కొనేందుకు ముందుకు రావ‌డం రైతుల‌కు సంతోష‌మే కానీ.. కేంద్రంతో యుద్ధం ఏమైపోయింది అనేది ప్ర‌శ్న‌గా మిగిలిపోయింది. ఎప్పటిలాగానే రాష్ట్రం ధాన్యం సేకరిస్తుంది. మిల్లర్లు మిల్లింగ్ చేస్తారు, ఎఫ్‌సి‌ఐ బియ్యం తీసుకుంటుంది. తెలంగాణ రాష్ట్ర సమితి ముందుకు తెచ్చిన నూతన జాతీయ ప్రొక్యూర్మెంట్ పాలసీ, బియ్యం కాకుండా ధాన్యమే ఎఫ్‌సి‌ఐ కొనాలనే డిమాండూ పక్కకు పోయాయి.