చంద్రబాబు తీరుపై సీనియర్ల అసహనం, సభలో వ్యూహం దెబ్బతీసిందని గగ్గోలు

ఆంద్రప్రదేశ్ అసెంబ్లీ సాక్షిగా అమరావతికి సంబంధించిన చర్చలో ప్రభుత్వం సమర్థవంతంగా వ్యవహరించింది. తన వాయిస్ బలంగా వినిపించింది. సుమారు ఐదు గంటల పాటు చర్చలో పాల్గొన్న నేతలంతా ఏపీ రాజధానికి సంబంధించిన అంశంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వ వాదనను ప్రజల్లోకి తీసుకెళ్లగలిగింది. కోర్టు తీర్పులు ప్రభుత్వ విధానాలను గట్టిగా వినిపించింది. పాలనా, అభివృద్ధి వికేంద్రీకరణకు సంబంధించిన విషయంలో ప్రభుత్వ లక్ష్యాలను చాటిచెప్పింది. దాంతో ఈ వ్యవహారం టీడీపీకి తలనొప్పిగా మారింది. సభలో కనీసం విపక్ష వాయిస్ కూడా వినిపించలేకపోవడం ఆపార్టీ నేతలకు మింగుడుపడని స్థితిలో మిగిల్చింది.

వాస్తవానికి గురువారం నాటి చర్చ మాత్రమే కాకుండా ఆరంభం నుంచి సభలో టీడీపీ వ్యూహాలు బెడిసికొడుతున్నాయి. సభలో సమస్యలను ప్రస్తావించేందుకు బదులుగా జంగారెడ్డిగూడెం వంటి చిన్న ఘటనను సాకుగా చూపించి నిత్యం రభస చేయడం మినహా సాధించేదేముందనే అభిప్రాయం టీడీపీ నేతల్లోనే వినిపిస్తోంది. సీనియర్లు పలువురు నేతలు ఈ విషయంపై చంద్రబాబుతో విబేధించారు. నిత్యం మద్యం చుట్టూ రాద్ధాంతం చేయడం వల్ల ఉపయోగం ఉండడం లేదని , దాని వల్ల సభలో ప్రభుత్వానికి అడ్డుచెప్పలేని స్థితి వస్తోందని సీనియర్ ఎమ్మెల్యేలు వాపోయినా అధినేత పెడచెవిన పెట్టారు. నిత్యం సభ ప్రారంభం కాగానే వాయిదా తీర్మానాలు ప్రతిపాదించడం, సభ నుంచి సస్పెండ్ అయ్యేంత వరకూ వివాదం చేయడం వల్ల ఉపయోగం ఏమిటనే ప్రశ్న వారి నుంచి వచ్చినా అధినేత ఖాతరు చేయలేదు. రోజూ ప్రశ్నోత్తరాల సమయంలో సైతం టీడీపీ నేతలు వేసిన ప్రశ్నలకు సమాధానాలిచ్చే సమయంలో కూడా సభలో ఉండలేకపోవడం ఏమిటనే ప్రశ్న టీడీపీ సీనియర్ల నుంచే ఉత్పన్నమయ్యింది.

పలువురు సీనియర్లు, ఇతర నేతలు ఎంతగా మొత్తుకున్నా చంద్రబాబు దానికి ప్రాధాన్యతనివ్వలేదు. పైగా ఎవరైనా ఎమ్మెల్యేలు సస్ఫెండ్ కాని పక్షంలో వారి మీద ఒత్తిడి కూడా తీసుకొచ్చారు. సభ నుంచి సస్ఫెండ్ కావాల్సిందేననే రీతిలో ఒత్తిడి పెట్టారు. తాను సభకు దూరంగా ఉండడమేకాకుండా, సభకు హాజరయిన వారు సైతం లోపల ఉండకుండా చేసిన వైనం టీడీపీ నేతలకు మింగుడుపడని స్థితికి నెట్టింది. చివరకు అమరావతి వంటి కీలకాంశంలో సైతం సభ ద్వారా అధికార పార్టీ వైఖరి ప్రజల్లోకి వెళ్లగా, టీడీపీ గొంతు వినిపించే అవకాశం కూడా లేకపోవడం విషాదకరంగా మారిందని సీనియర్ ఎమ్మెల్యేలు వాపోతున్నారు. ఇలాంటి తీరు వల్ల టీడీపీ ప్రజలకు దూరమయ్యిందనే వాదన కూడా ఉంది. మద్యం ధరల మీద పార్టీ ఎంతగా అల్లరి చేసినా జనంలో దానికి అనుగుణంగా స్పందనలేదనే వాదన కూడా వారి నుంచి వస్తోంది. ముఖ్యంగా మద్యం ధరలు తగ్గించడం వంటి చర్యలు ప్రభుత్వం తీసుకున్న తర్వాత విపక్షం చేసే విమర్శలకు విలువలేకుండా పోయిందని, దాని మూలంగా టీడీపీ శ్రమ అంతా బూడిదలో పోసిన పన్నీరుగా మారిందనే అభిప్రాయం వినిపిస్తోంది. వ్రతం చెడ్డా ఫలితం దక్కకపోవడమే టీడీపీ వ్యూహాల వైఫల్యంగా అంతా భావిస్తున్నారు.

Show comments