పోతుల పని అయిపోయింది.. కందుకూరుకు కొత్త ఇంఛార్జి

టీడీపీలో మాజీ ఎమ్మెల్యే పోతుల రామారావు పని అయిపోయింది. ప్రకాశం జిల్లా కందుకూరు నియోజకవర్గ టీడీపీ ఇంఛార్జిగా ఉన్న పోతుల రామారావు స్థానంలో టీడీపీ అధినాయకత్వం కొత్త ఇంఛార్జిని నియమించింది. కొత్త ఇంఛార్జిగా నియోజకవర్గంలోని వలేటివారిపాలెం మండలం బడేవారిపాలెం గ్రామానికి చెందిన ఇంటూరి నాగేశ్వరరావు నియమితులయ్యారు. దీంతో టీడీపీలో పోతుల రామారావు ప్రయాణానికి ఫుల్‌స్టాప్‌ పడినట్లైంది.

పోతుల రామారావు సొంత నియోజకవర్గం కొండపి. కాంగ్రెస్‌ పార్టీ నుంచి రాజకీయ జీవితం ప్రారంభించిన పోతుల.. కొండపి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా 2004లో గెలిచారు. 2009లో నియోజకవర్గాల పునర్విభజనలో కొండపి నియోజకవర్గం ఎస్సీ రిజర్డ్వ్‌ అవడంతో.. పోటీ చేసే అవకాశం దక్కలేదు. అయినా వైఎస్‌ రాజశేఖరరెడ్డి పోతుల రామారావుకు ఎమ్మెల్సీ పదవిని కట్టబెట్టారు. డీసీసీ అధ్యక్షుడుగా నియమించారు. 2014 వరకు డీసీసీ అధ్యక్షుడుగా పనిచేసిన పోతుల.. ఎన్నికలకు ముందు వైసీపీలో చేరి కందుకూరు నుంచి బరిలో నిలిచారు. ఆ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి దివి శివరాంపై గెలిచారు. సిట్టింగ్‌ ఎమ్మెల్యే, మంత్రిగా పని చేసిన మానుగుంట మహీధర్‌ రెడ్డి ఈ ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉన్నారు.

వైసీపీ తరపున గెలిచిన పోతుల.. ఆ తర్వాత రెండేళ్లకు టీడీపీలోకి ఫిరాయించారు. 2019లో టీడీపీ తరపున కందుకూరు నుంచి పోటీచేశారు. దివి శివరాంకు టిక్కెట్‌ దక్కలేదు. ఈ సారి వైసీపీ తరపున మానుగుంట మహీధర్‌ రెడ్డి పోటీ చేసి.. పోతుల రామారావుపై గెలిచారు. ఎన్నికల తర్వాత నుంచి పోతుల రామారావు సైలెంట్‌ అయ్యారు. ఎన్నికలు అయిన ప్రారంభంలో ఒకటి రెండుసార్లు కందుకూరు వచ్చిన పోతుల ఆ తర్వాత పూర్తిగా ముఖం చాటేశారు. వ్యాపార వ్యవహారాల్లో పూర్తిగా నిమగ్నమయ్యారు.

ఈ పరిస్థితుల నేపథ్యంలో మూడేళ్లుగా కందుకూరులో టీడీపీకి ఇంఛార్జి ఉన్నా.. లేనట్లుగానే పరిస్థితి నెలకొంది. మాజీ ఎమ్మెల్యే దివి శివరాం పెద్ద దిక్కుగా ఉన్నా.. వచ్చే ఎన్నికల్లో పోటీచేయనని స్పష్టంగా చెబుతున్నారు. 2004 నుంచి 2014 వరకు వరుసగా మూడుసార్లు ఓడిపోయిన శివరాం అభ్యర్థిత్వం పట్ల టీడీపీ కూడా ఆసక్తిగా లేదు.

ఈ పరిణామాల నేపథ్యంలో.. టీడీపీ ఇంఛార్జి పదవి కోసం బడేవారిపాలెం గ్రామానికి చెందిన ఇంటూరి రాజేష్‌ అనే యువకుడు తెరపైకి వచ్చారు. హైదరాబాద్‌లో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేసే రాజేష్‌.. టీడీపీ ఇంఛార్జి పదవి వస్తుందనే ఆశతో.. గత ఏడాది జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థులకు పెద్ద ఎత్తున విరాళాలు ఇచ్చారు. అయితే రాజేష్‌కు పోటీగా ఆయన దాయాది బడేవారిపాలెం గ్రామానికే చెందిన రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారి ఇంటూరి నాగేశ్వరరావు వచ్చారు. ఇద్దరి మధ్య ఇంఛార్జి పదవికోసం పోటీ నెలకొంది. రాజేష్‌ యువకుడు కావడం, అందరినీ కలుపుకుని పోకపోవడంతో దివి శివరాంతోపాటు నియోజవర్గంలోని మెజారిటీ నేతలు నాగేశ్వరరావుకు మద్ధతు ఇచ్చారు. అందరి అభిప్రాయాలు తీసుకున్న టీడీపీ అధినేత చంద్రబాబు.. ఇంటూరి నాగేశ్వరరావును ఇంఛార్జిగా ప్రకటించారు. ఎన్నికలకు ముందు ఏమైనా సమీకరణాలు మారితే తప్పా..2024లో టీడీపీ తరపున ఇంటూరి నాగేశ్వరరావు పోటీ చేయడం ఖాయమే.

Show comments