ఆ మాజీ ఆర్థిక మంత్రి.. ఇప్పుడు ట్యాక్సీవాలా..!

తాలిబన్లు ఆక్రమించుకున్న త‌ర్వాత ఆఫ్ఘనిస్తాన్ లో చాలా పరిణామాలు చోటు చేసుకున్నాయి. అందులో చాలా ఆందోళ‌న‌ కలిగిస్తున్నాయి. ఆఫ్ఘనిస్తాన్‌లో తాలిబాన్ లు పెద్ద ఎత్తున మానవహక్కుల ఉల్లంఘనలు చేస్తున్నారన్న నివేదికలు బహిర్గతం అవుతున్నాయి. పశ్చిమ నగరమైన హెరాత్‌లో కిడ్నాప్ చేశారన్న ఆరోపణలతో నలుగురు వ్యక్తులను హత్యచేసి, మృతదేహాలను బహిరంగంగా ప్ర‌ద‌ర్శించిన ఘ‌ట‌న క‌ల‌క‌లం రేపింది. అమెరికా, నాటో దళాలు ఆఫ్గాన్ నుంచి ఉపసంహరించుకునే క్రమంలో ఆఫ్ఘనిస్తాన్ ప్రభుత్వ దళాలకు వ్యతిరేకంగా దూకుడుగా, వేగంగా ముందడుగు వేసిన తరువాత తాలిబాన్లు కాబూల్‌ను స్వాధీనం చేసుకున్నారు. ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన మాజీ అధ్యక్షుడు అష్రఫ్ ఘనీ ప్రభుత్వం కూలిపోయిన తరువాత దేశం సంక్షోభంలో పడింది.

ఇక గ‌త ప్ర‌భుత్వంలో ఉన్న‌త హోదాల్లో కొన‌సాగిన వారి జీవితాలు త‌ల‌క్రిందుల‌య్యాయి. వారిలో ఒక‌రు ఖాలీద్‌ పయొండ.. కొన్నినెలల క్రితం ఆప్ఘనిస్థాన్‌ ఆర్థికశాఖ మంత్రి ఆయన. కానీ తాలిబన్లు ఆఫ్ఘాన్‌లో అధికారం చేపట్టిన తర్వాత ఆయన పరిస్థితి తలకిందులయ్యింది. చట్టసభలో దేశ బడ్జెట్‌ ప్రవేశపెట్టిన అనుభవం ఉన్న ఆయన నేడు ఓ ట్యాక్సీవాలాగా మారారు. అమెరికాలోని వాషింగ్టన్‌ డీసీలో ఉబెర్‌ క్యాబ్‌ నడుపుతూ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. తాలిబన్లు ఆఫ్ఘాన్‌ రాజధాని కాబూల్‌ను హస్తగతం చేసుకునేందుకు వారం రోజుల ముందు అంటే 2021 ఆగష్టులో ఖాలీద్‌ తన మంత్రిపదవికి రాజీనామా చేశారు. అనంతరం కుటుంబంతో కలిసి అమెరికా వెళ్లిపోయారు. ప్రస్తుతం ఆరు గంటల పాటు క్యాబ్‌ నడుపుతూ రోజుకు 150 డాలర్ల వరకు సంపాదిస్తున్నారు, ఏదో విధంగా తన కుటుంబానికి అండగా ఉండేందుకు ప్రయత్నిస్తున్నానని ‘వాషింగ్టన్‌ పోస్ట్‌’కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఖాలీద్‌ వివరించారు. కాగా, అమెరికా తన సైన్యాన్ని వెనక్కి రప్పించడం వల్లే తాలిబన్లు ఆఫ్ఘాన్‌ను స్వాధీనం చేసుకున్నారని ఖాలీద్‌ ఆరోపించారు.

Show comments