Idream media
Idream media
కాంగ్రెస్ పార్టీలో గ్రూపుల గోల సర్వసాధారణమే. అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా.. ఈ గ్రూపులు యాక్టివ్‌గానే ఉంటాయి. బలమైన నేత పార్టీ సారధిగా ఉన్నప్పుడు మాత్రమే ఈ గ్రూపు రాజకీయాలకు అడ్డుకట్ట పడుతుంది. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలలో ఆ పరిస్థితి లేదు. ఏపీలో కాంగ్రెస్‌కు అసలు ప్రాణం లేకపోగా.. తెలంగాణలో ప్రాణం ఉన్నా.. పూర్వ వైభవం వైపు నడిపించే నాయకుడు కరువయ్యాడు. పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డిని నియమించినా.. తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చిన వ్యక్తికి.. పీసీసీ పదవి ఎలా ఇస్తారని, పార్టీలో సమర్థులు లేరా..? అంటూ సీనియర్లు ఆదిలోనే గళం విప్పారు. ఆ అసంతృప్తి ఇంకా కొనసాగుతూనే ఉంది. దీంతో రేవంత్ వర్గం ఒక వైపు, సీనియర్లు మరోవైపు ఉంటూ.. ఆధిపత్య పోరు కొనసాగిస్తున్నారు.
తాజాగా కాంగ్రెస్ సీనియర్లు రేవంత్ రెడ్డిపై అసంతృప్తితో ప్రత్యేక సమావేశం నిర్వహించడం తెలంగాణ కాంగ్రెస్‌లో కొత్త వివాదానికి దారితీసింది. అసలు అజెండా రేవంత్ రెడ్డిపై అసంతృప్తి కాగా.. పైకి మాత్రం రాష్ట్రంలో కాంగ్రెస్ బలోపేతంపై చర్చించేందుకు అంటూ సీనియర్ నేతలు కలరింగ్ ఇచ్చారు. వీహెచ్ హనుమంతరావు, జగ్గారెడ్డి, మర్రి శశిధర్ రెడ్డి తదితర నేతలు ఈ సమావేశానికి హాజరయ్యారు. తమ గ్రూపునకు ‘కాంగ్రెస్ విధేయుల ఫోరం’ అని ఓ సరికొత్త పేరును కూడా పెట్టుకున్నారు. పేరునకు తగినట్లుగానే సమావేశంలో సోనియా, రాహుల్ గాంధీల ఫొటోలతో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ” వాడు (రేవంత్ రెడ్డి) ఇంద్రుడు, చంద్రుడు అయితే మేము హౌలేగాళ్లమా..?’ అంటూ ఎమ్మెల్యే జగ్గారెడ్డి మాట్లాడడం ఈ సమావేశపు లక్ష్యాన్ని చెప్పకనే చెప్పింది.
జీ 23ని స్ఫూర్తిగా తీసుకున్నారా..?
తెలంగాణలో ‘ కాంగ్రెస్ విధేయుల ఫోరం’ గ్రూపు ఏర్పాటుకు స్ఫూర్తి జీ23 అని అర్థమవుతోంది. జాతీయ స్థాయిలో కాంగ్రెస్ సీనియర్ నేతలు జీ 23 పేరుతో ఓ గ్రూపుగా ఏర్పడ్డారు. కాంగ్రెస్‌లోని లోపాలు, నాయకత్వలేమి, పార్టీ బలోపేతంపై వారు తమ అభిప్రాయాలను పార్టీ అధినేత్రి సోనియా గాంధీ దృష్టికి తీసుకెళుతున్నారు. అసంతృప్త నేతలతో నిండి ఉన్న జీ 23 ఇటీవల ఐదు రాష్ట్రాల ఎన్నికల తర్వాత మరోసారి తన గళాన్ని విప్పింది. ఈ సారి ఏకంగా పార్టీ నాయకత్వ బాధ్యతల నుంచి గాంధీ కుటుంబం తప్పుకోవాలని డిమాండ్ చేస్తోంది. ఆయా నేతలపై విధేయుల ద్వారా విమర్శలు చేపించినా ఫలితం లేకపోవడంతో.. వారితో విడివిడిగా భేటీ అవుతూ అసంతృప్తిని తగ్గించే పనిలో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం తలమునకలై ఉంది. ఈ గ్రూపు స్ఫూర్తితో తెలంగాణలో ఏర్పాటయిన ‘ కాంగ్రెస్ విధేయుల ఫోరం’ తాము అనుకున్న లక్ష్యాన్ని చేరుకుంటుందా..? లేదా..? చూడాలి.