Idream media
Idream media
పంజాబ్ శాసనసభ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ఘన విజయం సాధించడం ఆ పార్టీ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌కు ఎనలేని ఉత్సాహాన్ని ఇస్తోంది. భారీ విజయాన్ని కేజ్రీవాల్ ప్రజలతో కలిసి తనదైన శైలిలో పంచుకుంటున్నారు. ఆదివారం అమృత్‌సర్‌లో పంజాబ్‌కు కాబోయే ముఖ్యమంత్రి భగవంత్ మాన్‌తో కలిసి కేజ్రీవాల్ రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా కేజ్రీవాల్ చేసిన ప్రసంగం అందరినీ ఆకట్టుకుంది.
ఎదిగే కొద్దీ ఒదిగి ఉండాలనే సూత్రాన్ని కేజ్రీవాల్ తు.చ తప్పకుండా ఆచరిస్తున్నారు. రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి ఈ బాటలో పయనిస్తున్నారు. పంజాబ్‌లో ఘన విజయం సాధించినా.. గర్వాన్ని కేజ్రీవాల్ దరిచేరనీయలేదని ఆయన మాటల ద్వారా తెలుస్తోంది. ‘‘రాష్ట్రానికి భగవంత్ మాన్ ఒక్కడే ముఖ్యమంత్రి కాదు.. రాష్ట్రంలోని ప్రతి ఒక్కరూ ముఖ్యమంత్రే’’ నంటూ కేజ్రీవాల్ అన్న మాట.. పంజాబీలతోపాటు అందరినీ ఆకట్టుకుంది. 2013లో ఢిల్లీలో కాంగ్రెస్ మద్ధతుతో ఏర్పాటుచేసిన ప్రభుత్వాన్ని 15 నెలలకు రద్దు చేసి.. మళ్లీ 2015లో ప్రజలవద్దకు వెళ్లిన కేజ్రీవాల్ తాను అలా ఎందుకు చేశానో వివరించి ప్రజలను మెప్పించారు. ఆ ఎన్నికల్లో 70 సీట్లకు గాను ఏకంగా 67 సీట్లలో ఆప్ విజయం సాధించింది. ముచ్చటగా మూడోసారి 2020లోనూ 63 సీట్లు గెలుచుకుని మూడోసారి ఢిల్లీ ముఖ్యమంత్రి పీఠంపై కేజ్రీవాల్ కూర్చున్నారు.
ముందస్తు హెచ్చరికలు..
నిజాయితీ, అవినీతి రహిత పాలనే ఆప్‌కు వెన్నుముక. ఈ తరహా పాలనతోనే దేశంలో తనకంటూ ఆప్ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. పంజాబ్‌లో విజయం సాధించడం వెనుక ఢిల్లీ ఆప్ అవినీతి రహిత పాలనే ప్రధాన కారణం. పంజాబ్ తర్వాత.. ఇతర రాష్ట్రాలపై కూడా దృష్టి పెట్టిన కేజ్రీవాల్.. పార్టీకి చెడ్డపేరు రాకుండా ఉండేలా స్పష్టమైన వైఖరితో వెళుతున్నారు. పార్టీ ఎమ్మెల్యేలు ఏ ఒక్కరు అవినీతికి పాల్పడినా అది మొత్తం పార్టీకి చుట్టుకుంటుంది. అందుకే కేజ్రీవాల్ పంజాబ్‌లోని తన పార్టీ ఎమ్మెల్యేలకు, నేతలకు ముందస్తు హెచ్చరికలు చేశారు. భగవంత్ మాన్ నిజాయితీ పరుడని, ప్రజల నుంచి వచ్చే ప్రతి రూపాయి వారికే ఖర్చు పెడతామని చెప్పారు. పార్టీ నేతగానీ, ఎమ్మెల్యేగానీ పొరపాటు చేస్తే జైలుకు పంపిస్తామని గట్టి హెచ్చరికలు పంపారు.
విభిన్నంగా బాధ్యతల స్వీకరణ..
ఈ నెల 16 (బుధవారం)న భగవంత్ మాన్ పంజాబ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టబోతున్నారు. మునుపటికి భిన్నంగా ఆయన సీఎంగా ప్రమాణస్వీకారం చేయబోతున్నారు. స్వాతంత్ర సమరయోధుడు భగత్‌సింగ్ పూర్వీకుల గ్రామమైన ఖట్కర్‌లో ప్రమాణస్వీకార కార్యక్రమం నిర్వహించబోతున్నారు. పంజాబ్ ఎన్నికల్లో 117 స్థానాలకు గాను ఆప్ 92 స్థానాలు గెలుచుకున్న విషయం తెలిసిందే.