Idream media
Idream media
ఆంధ్రప్రదేశ్‌లో మరో ఉప ఎన్నిక జరిపేందుకు ఎన్నికల సంఘం కసరత్తులు ప్రారంభించింది. చివరిగా గత ఏడాది అక్టోబర్ లో కడప జిల్లా బద్వేలు అసెంబ్లీకి ఉప ఎన్నిక జరుగగా అధికార పార్టీ అభ్యర్థి డాక్టర్ సుధ భారీ మెజారిటీతో గెలుపొందారు. ఇక ఇప్పుడు విజయవాడకు చెందిన దివంగత ఎమ్మెల్సీ కరీమున్నీసా స్థానం భర్తీ చేసేందుకు ఎన్నికల సంఘం షెడ్యుల్ విడుదల చేసింది. కరీమున్నీసా అకాల మరణంతో ఎమ్మెల్యే కోటాలోని ఓ ఎమ్మెల్సీ స్థానం ఖాళీ అయింది. దీంతో ఉప ఎన్నికకు మార్చి నెల 7న ఎన్నికల సంఘం నోటిషికేషన్ జారీ చేయనుంది. 14వ తేదీ వరకు నామినేషన్లను స్వీకరించనుంది.
ఆ వచ్చిన నామినేషన్లను మార్చి 15న స్క్రూటినీ చేయనున్నారు. మార్చి 17 నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేది కాగా 24న ఎన్నిక నిర్వహించనుంది. అయితే, కరీమున్నీసా కుమారుడు రుహుల్లాకే ఎమ్మెల్సీ టికెట్‌ను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఖరారు చేసినట్లు సమాచారం. ఆమె కుమారుడు రుహుల్లా జగన్‌కు సన్నిహితులుగా పేరుంది. జగన్ తో కలిసి ఆయన పాదయాత్రలో కూడా పాల్గొన్నారు. పార్టీ ఏర్పాటు చేసిన మొదటి రోజుల నుంచే జగన్‌తో రుహుల్లాకు మంచి సంబంధాలున్నాయి.
ఇక మరోపక్క ఆత్మకూరు నియోజకవర్గంలో కూడా ఉప ఎన్నికలు త్వరలో జరగనున్నాయి. అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే అయిన గౌతమ్ రెడ్డి హఠాత్మరణం పాలవడంతో అక్కడ ఎన్నికలు అనివార్యం అయ్యాయి. ఆరు నెలల లోపు అక్కడ ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుంది. ఇప్పటికే అసెంబ్లీ అధికారులు ఎన్నికల సంఘానికి సమాచారం అందించారు.