జనసేనానిని ఈసారి దూరంగా ఉంటారా, 2019 ఫలితాలు పునరావృతం కాకూడదని భావిస్తున్నారా..?

రాజకీయ పార్టీగా జనసేన ఆవిర్భావం 8 ఏళ్ల క్రితమే జరిగింది. కానీ నేటికీ పూర్తిస్థాయి పరిపక్వత ఆపార్టీలో కనిపించదు. పార్టీ పెట్టిన 8 ఏళ్ల తర్వాత వైఎస్సార్సీపీ అధికారాన్ని సొంతం చేసుకుంది. కానీ జనసేన మాత్రం నేటికీ పార్టీ రూపుని సంతరించుకున్న దాఖలాలు లేవు. సినిమాలు చేసుకుంటూ తీరిక ఉన్నప్పుడు నెలకు ఓసారి చొప్పున రాష్ట్రానికి రావడం అలవాటుగా మార్చుకున్నారు. ఇక పార్టీ శ్రేణులయితే తమది పొలిటికల్ పార్టీ అనే కన్నా ఇక సినీ ఫ్యాన్స్ అసోసియేషన్ గానే చూస్తున్నారు. దాంతో జనసేన వ్యవహారం రాజకీయ రూపులేని ఫుల్ ఫాలోయింగ్ ఉన్న పవర్ ఫుల్ ఫ్యాన్స్ అసోసియేషన్ మాదిరిగానే ఎక్కువ మంది భావించే స్థితిలో ఉంది.

2014 ఎన్నికల్లో ఆపార్టీ పోటీకి దూరంగా ఉంది. కేవలం ఎన్నికల ప్రచారానికే పవన్ కళ్యాణ్‌ పరిమితమయ్యారు. అది కూడా బేషరతుగా బాబుకి మద్ధతిచ్చారు. టీడీపీ తిరిగి అధికారంలోకి రావడంలో కీలకపాత్ర పోషించారు. ఆ తర్వాత 2019 నాటికి పరిస్థితి మారింది. టీడీపీతో జనసేన తెగతెంపులు చేసుకుంది. ఈసారి పోటీలో దిగింది. అధినేత సైతం రెండు చోట్ల రంగంలో దిగారు. కమ్యూనిస్టులు, బీఎస్పీతో కలిసి ఆపార్టీ పోటీ చేసినా కలలు పండలేదు. పైగా పవన్ కళ్యాణ్‌ స్వయంగా రెండు స్థానాల్లోనూ ఓటమి పాలుకావడం జనసేనని కుంగదీసింది. ఆపార్టీ భవితవ్యానికి గొడ్డలిపెట్టుగా మారింది.

ఈ పరిస్థితుల్లో 2024 లేదా దానికన్నా ముందే ఎన్నికలు వచ్చినా ఈసారి జనసేన ఏం చేస్తుందోననే ఆసక్తి కనిపిస్తోంది. గత ఎన్నికల ఫలితాల తర్వాత కమ్యూనిస్టులు, బీఎస్పీని విడిచిపెట్టి బీజేపీ కౌగిట్లో పవన్ వాలిపోయారు. రెండేళ్ళుగా ఆపార్టీ వెంట నడుస్తున్నారు. అంటీముట్టనట్టుగానే ఈ జోడీ కనిపిస్తోంది. చివరకు పవన్ కళ్యాణ్ తమకు మిత్రపక్షంగా మారిన తర్వాత కూడా మోడీ దర్శనం దక్కలేదంటే ఎంత గౌరవం ఇస్తున్నారో అర్థమవుతోంది. అయినప్పటికీ బీజేపీతో కలిసే సాగాల్సిన స్థితిలో జనసేన ఉందనే వాదన వినిపిస్తోంది. జనసేన పోటీలో దిగినప్పటికీ ఆపార్టీ అధినేత పోటీ చేస్తారా లేదా అన్నది సందేహమే.

గడిచిన ఎన్నికల్లో గాజువాక, భీమవరం స్థానాల్లో పోటీ చేశారు. తన కులస్తులు ఎక్కువ సంఖ్యలో ఉండడం సహా వివిధ సానుకూలతలను సొమ్ము చేసుకోవాలని ఆశించారు. కానీ అనుకున్నదొకటయితే ఆయ్యిందొకటిగా మారి పరువు తీసింది. దాంతో ఈసారి భీమవరం వదిలేసి గాజువాక స్థానంలో పోటీ చేయాలనే లక్ష్యం పవన్ లో ఉందని సన్నిహితుల అంచనా. ఇప్పటికే విశాఖ స్టీల్ ప్లాంట్ గురించి పవన్ కొంత హడావిడి చేయడం వెనుక అసలు లక్ష్యం అదే. అయితే ఈలోగా ప్లాంట్ ప్రైవేటీకరణ జరిగితే పవన్ ఆశలకు గండిపడుతుంది. కాబట్టి ప్రత్యామ్నాయంగా తూర్పు గోదావరి జిల్లాలోని రెండు మూడు సీట్లను ఆయన రిజర్వు చేసుకున్నట్టుగా సమాచారం.

అదే సమయంలో ఈసారి పోటీకి దూరంగా ఉండాలని కూడా పవన్ భావిస్తున్నట్టు కొందరు చెబుతున్నారు. బీజేపీతో కలిసి బరిలో దిగాల్సిన పరిస్థితి వస్తే పవన్ కేవలం ప్రచారకర్తగానే ఉంటారని తెలుస్తోంది. తన పార్టీతో పాటుగా బీజేపీ గెలుపుకోసం ఆయన ఎన్నికల ప్రచారం మాత్రమే నిర్వహిస్తారని అంటున్నారు. తద్వారా ఫలితాల తర్వాత బీజేపీ తరుపున రాజ్యసభ సీటు వంటివి ఆయన ఆశించే అవకాశం ఉంది. గతంలో ప్రజారాజ్యం అధినేతగా చిరంజీవికి రాజ్యసభ అనుభవం ఉంది. అయితే ఆయన పార్టీని విలీనం చేసి రాజ్యసభకు వెళ్లారు. జనసేన అలాంటి యత్నాలకు దిగకుండానే పవన్ రాజ్యసభకు వెళ్లేందుకు మొగ్గుచూపబోతున్నట్టు ఓ అంచనా. అది ఏమేరకు సాధ్యమన్నది పక్కన పెడితే పవన్ పోటీలో లేకుంటే జనసేన మరింత నీరసించిపోయే అవకాశం ఉంది. పోటీకే ముందే చేతులెత్తేశారనే అభిప్రాయం వినిపిస్తుంది. కాబట్టి ఆయన ఏం చేస్తారన్నది ఆసక్తికరం.

ఎన్నికలు సమీపిస్తున్నాయని టీడీపీ హడావిడి చేస్తున్నప్పటికీ జనసేనాని తనకంటూ తగిన స్థానాలను ఎంపిక చేసుకోకపోవడం, కనీసం అక్కడయినా ఈసారి ఓటర్లుకు చేరువకావాలనే యత్నాలు మొదలుకాకపోవడం వంటివి ఆయన పోటీపై అనుమానాలు పెంచుతున్నాయి. టీడీపీతో జట్టు కడితే ఖచ్చితంగా బరిలో ఉండాలని, లేదంటే బీజేపీతో మాత్రమే కలిసి పోటీ చేసే పక్షంలో ప్రచారానికే పరిమితం కావాలనే భావనలో జనసేనానిని ఉన్నట్టు సమాచారం. ఏమయినా పవన్ గతంలో తిన్న ఎదురుదెబ్బల నుంచి ఈసారి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారన్నది స్పష్టం.

Show comments