కేసీఆర్ ఆశలపై నీళ్ళు జల్లిన తమిళనాడు సీఎం, ఏం జరిగింది?

తమిళనాడు ముఖ్యమంత్రిగా ఒక ఏడాది పదవీకాలం పూర్తి చేసుకున్న సందర్భంగా ఎంకే స్టాలిన్ ఆత్మకథ పుస్తకావిష్కరణ కార్యక్రమం ఘనంగా జరిగింది. వన్ ఆఫ్ యూ-1 పేరుతో ఆయన రాసిన పుస్తకావిష్కరణ జాతీయ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. దేశంలో బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా సమీకరణాలు జరుగుతున్న వేళ స్టాలిన్ వ్యవహారం ఆసక్తికరంగా మారింది. ముఖ్యంగా మోడీకి పోటీగా కూటమి కట్టాలని పలువురు నేతలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. వారిలో ఇప్పటికే మమతా బెనర్జీ, కేసీఆర్, కేజ్రీవాల్ వంటి వారు ప్రయత్నాలు కూడా ప్రారంభించారు.

మోడీ వ్యతిరేక కూటమి విషయంలో జాతీయస్థాయిలో రెండురకాల అభిప్రాయాలు బలంగా వినిపిస్తున్నాయి. కాంగ్రెస్ నాయకత్వంలో ఫ్రంట్ కట్టాలనే అభిప్రాయంతో కొందరు నేతలు కనిపిస్తుంటే, బీజేపీ, కాంగ్రెస్ కి సమదూరం పాటించాలనే అభిప్రాయం మరికొందరి నుంచి వస్తోంది. బీజేపీని ఎదుర్కొనేశక్తి కాంగ్రెస్ కి లేదని నమ్ముతున్న ఆ సెక్షన్ నేతల్లో కేజ్రీవాల్, మమతా బెనర్జీ వంటి వారున్నారు. అదే సమయంలో కాంగ్రెస్ తో సంబంధాలపై స్పష్టత లేని రీతిలో కూటమికి మాత్రం తానే నాయకత్వం వహించాలనే సంకల్పం కేసీఆర్ లో ఉన్నట్టు స్పష్టమవుతోంది. దానికి తగ్గట్టుగానే మమతాతో పాటుగా కేసీఆర్ కూడా తనదైన శైలిలో ప్రయత్నాలు ప్రారంభించారు.

బీజేపీ కి వ్యతిరేకంగా జాతీయస్థాయిలో కూటమి విషయంలో కాంగ్రెస్ తో కలిసి సాగాలనే అభిప్రాయాన్ని, కాంగ్రెస్ నాయకత్వం ఉండాలని భావించే వాదన ఎన్సీపీ, శివసేన వంటి పార్టీల నుంచి వస్తోంది.అలాంటి సమయంలో కీలకంగా ఉన్న తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ తాజాగా తన పుస్తకావిష్కరణ సభకు కేసీఆర్, మమతా బెనర్జీ వంటి నేతలను దూరంపెట్టడం విశేషం. అదే సమయంలో బీహార్ కి చెందిన తేజస్వీ యాదవ్, సీపీఎం సీఎం పినరయి విజయన్, కశ్మీర్ మాజీ సీఎం ఒమర్ అబ్దుల్లా సహా కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీని కూడా ఆహ్వానించడం చర్చనీయాంశం అవుతోంది. కాంగ్రెస్ సారధ్యంలో కూటమి మాత్రమే దేశానికి దిక్సూచి అని స్టాలిన్ ఈ సభ ద్వారా చాటిచెప్పినట్టు కొందరు భావిస్తున్నారు. తమిళనాడులో కాంగ్రెస్, లెఫ్ట్ తో కూటమి ఉన్న నేపథ్యంలో డీఎంకే ఆ పార్టీల నాయకులని పిలిచిందని భావించాలనుకుంటే బీహార్ నుంచి ప్రత్యేకంగా తేజస్వీ యాదవ్, కశ్మీరీ నేత ఒమర్ అబ్దుల్లా ని ఆహ్వానించడం వెనుక కాంగ్రెస్ తో కలిసి సాగుతున్న వారిని ఆహ్వానించినట్టుగా కొందరు భావిస్తున్నారు.

ఈ సభలో మాట్లాడిన పలువురు నేతలు రాహుల్ గాంధీ నాయకత్వాన్ని పొగుడుతూ మాట్లాడడం, దేశ సమస్యలకు ఆయన సారధ్యం అవసరం అంటూ ప్రస్తావించడం కీలకాంశంగా భావించాల్సి ఉంటుంది. తద్వారా దేశంలో మరో కూటమికి ప్రయత్నాలు జరుగుతున్న వేళ డీఎంకే మాత్రం కాంగ్రెస్ వెంట కలిసి సాగడమే కాకుండా, కాంగ్రెస్ నాయకత్వంలోనే జాతీయ స్థాయిలో మోదీ వ్యతిరేక కూటమి ఏర్పాటుకి సానుకూలంగా ఉన్నట్టు సంకేతాలిచ్చిందనే అభిప్రాయం బలపడుతోంది.

Show comments