తెలంగాణ నిరుద్యోగ యువతకు సీఎం కేసీఆర్ వరాల జల్లు

తాజాగా జరిగిన వనపర్తి బహిరంగసభలో ప్రకటించిన విధంగానే తెలంగాణ నిరుద్యోగ యువతకు సీఎం కేసీఆర్ శుభవార్త చెప్పారు. ఉద్యోగాలపై అసెంబ్లీలో బుధవారం కీలక ప్రకటన చేస్తానని వనపర్తి సభలో చెప్పిన విధంగానే అసెంబ్లీ ప్రారంభమైన వెంటనే సీఎం కేసీఆర్… ఉద్యోగాలపై కీలక ప్రకటన చేశారు. తెలంగాణలో ప్రస్తుతం మొత్తం 91,142 ఖాళీలు ఉన్నాయని పేర్కొన్నారు. ఆ పోస్టులన్నింటికీ ఇవాళ్టి నుంచే నోటిఫికేషన్లు విడుదల చేస్తామని కేసీఆర్ ప్రకటించారు. అయితే అందులో ఇప్పటికే పనిచేస్తున్న 11,103 కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేస్తామని చెప్పారు. త్వరలోనే రాష్ట్రంలోని మిగిలిన 80,039 ప్రభుత్వ ఉద్యోగ పోస్టులను భర్తీ చేస్తామని కేసీఆర్ ప్రకటించారు.

తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన నాటి నుండి ఇప్పటి వరకు 1.30 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేశామని సీఎం కేసీఆర్ ప్రకటించారు. అయితే 95 శాతం ఉద్యోగాలు స్థానికులకే దక్కేలా రాష్ట్రపతి ఉత్తర్వులు తెచ్చామని.. దీనివల్ల అందరికీ అవకాశాలు వస్తాయని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. అలాగే మిగిలిన 5% లో కూడా ఓపెన్ కేటగిరీలో 2,3 శాతం ఇక్కడివారికి ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉందన్నారు. షెడ్యూల్ 9, 10 సంస్థల వివాదం పరిష్కారమైతే మరో 10 నుంచి 20వేల ఉద్యోగాల ఉద్యోగాలు వచ్చే అవకాశముందని తెలిపారు.

పోలీస్ శాఖలో 18,334, విద్యాశాఖలో 13,086, వైద్య, ఆరోగ్యశాఖలో 12,755, ఉన్నత విద్యా శాఖలో 7,878, రెవిన్యూ శాఖలో 3,560, బీసీ సంక్షేమ శాఖలో 4,311, గిరిజన సంక్షేమ శాఖలో 2,399, సాగునీటి శాఖలో 2,692 పోస్టులు ఖాళీగా ఉన్నాయి అని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. వాటిని వీలైనంత త్వరలో భర్తీ చేస్తామని కేసీఆర్ ప్రకటించారు. ఈరోజు నుంచే ఉద్యోగ నియామకాలకు సంబంధించిన నోటిఫికేషన్లు జారీ చేస్తామని పేర్కొన్నారు. అలాగే తెలంగాణలో ఉద్యోగాల భర్తీకి వయో పరిమితి పెంచుతున్నట్లు సీఎం కేసీఆర్ ప్రకటించారు. జనరల్ అభ్యర్థుల వయో పరిమితిని 44 ఏళ్లకు పెంచగా.. ఎస్సీ/ ఎస్టీ/బీసీ అభ్యర్థులు 49 సం.లు, దివ్యాంగులకు 54సం. వయో పరిమితిగా ఉంటుందని అసెంబ్లీలో ప్రకటన చేశారు.

Show comments