Idream media
Idream media
వికేంద్రీకరణ అంశంపై ఆంధ్రప్రదేశ్ శాసనసభలో చర్చ తర్వాత వివిధ పార్టీల నేతలు స్పందించారు. అందులో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు కూడా ఉన్నారు. రాజధాని అమరావతి విషయంలో సీఎం జగన్ అసెంబ్లీ వేదికగా మడమ తిప్పారని, పార్లమెంటు, న్యాయస్థానాల ప్రస్తావన తీసుకొచ్చి వికేంద్రీకరణ పాట పాడడం దారుణమని సోము అన్నారు. బీజేపీ రాజధాని అమరావతికే కట్టుబడి ఉందని చెప్పారు.
అమరావతికే బీజేపీ కట్టుబడి ఉందని సోము వీర్రాజు చెప్పడంలో ఆశ్చర్యంలేదు. ఆయన మాటల్లో కట్టుబడి ఎంత గట్టిగా ఉంటుందో చేతల్లో అంత బలహీనంగా ఉంటుందని గతం చెబుతోంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అయిన కొత్తలో.. మూడు రాజధానుల అంశంపై తాను మాట్లాడిన విషయాలను సోము వీర్రాజు మరిచిపోయినట్లుగా ఉన్నారు. ఒకసారి తన మాటలను గుర్తు చేసుకుంటే.. కట్టుబడి అంశం ఎంత బలమైనదో తెలుస్తుంది.
‘‘ మూడు రాజధానులు కాదు 30 రాజధానులు పెట్టుకోండి. మాకు అభ్యంతరం లేదు. అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలన్నదే మా విధానం’’ అని సోము వీర్రాజు మాట్లాడి ఏడాదికాలం కూడా పూర్తి కాలేదు. ఈ స్థాయిలో మాట్లాడిన సోముకు ఏమి జ్ఞానోదయం అయిందో.. రెండు నెలల నుంచి అమరావతి పాట అందుకున్నారు. ఇప్పుడు అమరావతికే కట్టుబడి ఉన్నామని బల్లగుద్ది మరీ చెబుతున్నారు. మొన్న వికేంద్రీకరణ మా విధానం అన్న సోము నేడు అమరావతికి కట్టుబడి ఉన్నామని చెబుతున్నారు. రేపు సోము వీర్రాజు తన విధానం మార్చుకోకుండా ఉంటారన్న నమ్మకం ఏమిటి..?
పార్లమెంట్, న్యాయస్థానాల ప్రస్తావన తీసుకొచ్చి సీఎం జగన్ వికేంద్రీకరణ గురించి మాట్లాడడం ఎలా దారుణం అవుతుందో సోము వీర్రాజు మాత్రమే చెప్పగలరు. రాజధాని అంశంపై హైకోర్టు తీర్పు ఇవ్వడంపై సభలో చర్చించారు. సీఆర్‌డీఏ రద్దు, వికేంద్రీకరణ చట్టాలపై హైకోర్టులో విచారణ జరిగితే.. అందులో ప్రతివాదిగా ఉన్న కేంద్ర ప్రభుత్వం కూడా తన వాదనను అఫిడవిట్ రూపంలో దాఖలు చేసింది. రాజధాని ఎక్కడ అని నిర్ణయించే అధికారం ఆయా రాష్ట్ర ప్రభుత్వాలదేనని, హైకోర్టు ఉన్న చోటే రాజధాని కాదని, రాజధానిలోనే హైకోర్టు ఉండాలనే నియమంలేదని పలు అఫిడవిట్లలో కేంద్రం పేర్కొంది. రాజధాని నిర్ణయించే అధికారం పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వాలదేనని, అందులో తమ పాత్ర ఏమీ లేదని పలువురు ఎంపీలు అడిగిన ప్రశ్నకు కేంద్రం పార్లమెంట్ సాక్షిగా సమాధానాలు చెప్పింది, రాతపూర్వకంగా ఇచ్చింది.
రాజధాని వివాదంలో కేంద్రం, పార్లమెంట్‌లు తమ తమ అధికారాలను, పరిధులను, విధులను తెలిపాయి. న్యాయస్థానాల్లో విచారణలు సాగాయి. పరిస్థితి ఇలా ఉంటే.. న్యాయస్థానాలు, పార్లమెంట్ ప్రస్తావనను సీఎం జగన్ తేవడం ఎలా దారుణం అవుతుందో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడుగా ఉన్న సోము వీర్రాజు చెప్పాలి. సోము వీర్రాజు ఇలా తోచింది మాట్లాడితే.. విషయ పరిజ్ఞానం లేదని అనుకుంటారు. అంతిమంగా ఆయన నష్టపోతారు. ప్రజల్లో పార్టీ చులకన అవుతుంది.