మందడంలో రాజధాని రైతుల శిబిరాన్ని సందర్శించిన వైసిపి యంపి

  • Published - 12:22 PM, Fri - 31 January 20
మందడంలో రాజధాని రైతుల శిబిరాన్ని సందర్శించిన వైసిపి యంపి

ఈరోజు మధ్యాహ్నం వైసిపి నర్సరావుపేట వైసిపి యంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు మందడంలో రాజధాని రైతుల దీక్షా శిబిరాన్ని సందర్శించి, ఆందోళన చేస్తున్న రాజధాని రైతులకి సంఘీభావం తెలియజేశారు. ఈ సందర్భంగా ఆందోళన చేస్తున్న రైతులను ఉద్దేశించి యంపి మాట్లాడుతూ రాజధానికి స్వచ్చందంగా భూములిచ్చిన రైతులకు ఖచ్చితంగా సరైన న్యాయం జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. భూములిచ్చిన రైతులను ఆదుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం త్వరలోనే ఒక కమిటీని నియమిస్తుందని, ఆ కమిటీ రైతుల వద్దకు వచ్చినప్పుడు రైతులందరూ తమ అభిప్రయాలను కమిటీకి తెలియచెయ్యాల్సిందిగా యంపి కృష్ణదేవరాయలు రైతులను కోరారు. ఈ సందర్భగా తాను కూడా ఆకుపచ్చ కండువా ధరించి కాసేపు రైతులతో కలసి దీక్షలో కూర్చోవడం విశేషం.

దీక్షలో కూర్చున్న సమయంలో యంపి తోటి రైతులతో కాసేపు ముచ్చటించారు. ఈ మాటలు నేను ఇప్పటికిప్పుడు చెప్తున్నది కాదని గడచిన నలభై రోజుల నుండి తాను కూడా ఇదే డిమాండ్ చేస్తున్నట్టు కృష్ణదేవరాయలు స్పష్టం చేశారు. వీలైనంత తొందరలో ప్రభుత్వం తరుపున రైతులను ఆదుకోవడానికి ప్రక్రియ మొదలవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. రాజధాని ప్రాంతంలో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేవారిని పక్కనపెడితే, ఇక్కడ రైతులు సాగు చేసుకుంటున్న భూమి తరతరాలుగా తాతలు తండ్రుల నుండి సంక్రమించిన ఆస్తి కాబట్టి, ఈ భూమి తో రైతులకున్న అనుబంధాన్ని ఎవరైనా అర్ధం చేసుకోగలరని, భూములు కోల్పోతున్న వారి భాధ తాము కూడా అర్ధం చేసుకోగలమన్నారు. రాజధాని రైతులెవరూ ఆందోళన చెందవద్దని, రైతులందరికీ న్యాయం చేసే భాద్యతను రైతుల తరుపున స్వయంగా తాము తీసుకుంటామని ఈ యువ ఎంపి స్పష్టం చేశారు.

Show comments