నది మన జీవనం

‘‘జలమే జనం.. జలమే ధనం.. జలమే బలం.. సుజలాం.. సుఫలాం’ అన్నారు పెద్దలు. మనిషి మనుగడకు గాలి తరువాత అతి ముఖ్యమైంది నీరు. నేల రాలిన ప్రతీ చినుకు భూమిలో ఇంకిపోదు. చినుకు.. చినుకు కలిసి చిన్న కాలువుగా.. అడవుల్లో సెలయేళ్లుగా మారి రానురాను నదులుగా రూపాంతరం చెందుతుంది. అటువంటి నదుల ద్వారా అందే నీరే కోట్ల ప్రజల దాహార్తిని తీరుస్తుంది. వారి దైనందన జీవతాల్లో భాగమవుతుంది. లక్షల ఎకరాల్లో పారుతూ సస్యశ్యామలం చేస్తుంది. ఇప్పుడు ఆ ‘జీవ’ నదుల మనుగడకు ప్రమాదమొచ్చింది. మనిషి స్వార్ధ్యానికి అవి కాలుష్య కోరల్లో చిక్కుకుంటున్నాయి. అమృతధారను అందించే నదులు విషతుల్యంగా మారుతున్నాయి. నేడు ప్రపంచ నదుల దినోత్సవం సందర్భంగా కథనం…

దేశంలో ధాన్యాగారంగా పేరొందిన ఆంధ్రప్రదేశ్‌కు వరం గోదావరి.. కృష్ణా వంటి జీవనదులు.. పెన్నా, తుంగభద్ర, నాగావళి.. వంశధారా వంటి నదులు.. లక్షల ఎకరాలను సస్యశ్యామలం చేస్తున్నాయి. కోట్ల మంది గొంతున దాహార్తి తీరుస్తున్నాయి. ఇవి కాకుండా తమ్మిలేరు, మున్నేరు, గోస్తా, ఎర్రకాలువ, చత్రావతి, గండ్లకమ్మ, పాసంగి, స్వర్ణముఖి, హగరి, చంపాతి, సీలేరు, శబరి, మున్నేరు, కన్నెరసాని వంటి ఉప నదులున్నాయి.

Also Read : యూనివర్సీటీ ఉంటే ఎన్నో ఫలితాలు – ఇవిగో ఉదహారణలు

అడుగడుగునా కాలుష్యం.. 

జీవనదులు గోదావరి, కృష్ణా వంటివే కాదు.. చిన్న చిన్న నదులు సైతం కాలుష్య కాసారాలుగా మారిపోతున్నాయి. పరిశ్రమల నుంచి వచ్చి కలుస్తున్న వ్యర్థ, విషరసాయనాలు కలిసిన మురుగునీరు, నదులను ఆనుకుని ఉన్న నగరాలు, పట్టణాల నుంచి నదులలో నేరుగా కలుస్తున్న మురుగునీరు నదుల నీటిని విషతుల్యంగా మారుస్తుంది. మైనింగ్‌ కూడా నదుల పాలిట శాపంగా మారాయి. ‘1979 పుష్కరాల సమయంలో గోదావరిలో స్నానం చేసేవారు. అక్కడే నీరు తాగేవారు. అప్పట్లో గోదావరిలో కాలుష్య 1 శాతానికి లోపు ఉండేది. తరువాత 1991 పుష్కరాలకు ఇది 3.5 శాతానికి, 2003 నాటికి 9 శాతానికి, 2015 నాటికి 20 శాతానికి పెరిగింది.

కాలుష్య తీవ్రత ప్రభావం పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తుంది. స్నానం చేస్తేనే రోగాలబారిన పడేలా ఉన్నారు.’ అని గోదావరి కాలుష్య పరిశోధనా వేత్త పెచ్చెట్టి కృష్ణకిషోర్‌ తెలిపారు. బీవోడీ (బయలాజికల్‌ ఆక్సిజన్‌ డిమాండ్‌) మొత్తం నాశనం అవ్వడం వల్ల ఆ నీరు కాలుష్యం బారిన పడిపోతుందన్నారు. భారలోహాల వల్ల చర్మ వ్యాధులు, ఉదర సంబంధమైన వ్యాధులు, క్యాన్సర్‌, ఆస్మా వంటి వ్యాధులకు దారితీస్తున్నాయి. గోదావరి నది ఒక్కటే కాదు… కృష్ణా, పెన్నా, ఇతర నదుల్లో సైతం ఇదే పరిస్థితి నెలకొని ఉంది.

Also Read : విశ్వకర్మను మించిన ఇంజనీరు.. విశ్వేశ్వరయ్య

నదుల ప్రక్షాళనకు ప్రత్యక బోర్డులు.. 

నదులు కాలుష్యకాసారాలుగా మారుతున్నాయి. వర్షాభావ వరిస్థితుల వల్ల చాలా చోట్ల ఎండిపోతున్నాయి. డిసెంబరు నుంచి జూన్‌ నెల వరకు చుక్కనీరు లేని నదులు మనకు కనిపిస్తూనే ఉన్నాయి. చిన్నపాటి ఎడారులుగా మారుతున్నాయి. ఈ నేపథ్యంలో వీటి పరిరక్షణకు అందరూ నడుంబిగించాల్సి ఉంది. ఉత్తరాధిన జీవనది గంగా ప్రక్షాళనకు కేంద్ర ప్రభుత్వం నిధులు కేటాయించింది. క్లీన్‌ గంగా పేరుతో రూ.11వేల 500 కోట్ల కేటాయించారు. 346 ప్రాజెక్టులు ద్వారా గంగానది ప్రక్షాళన చేయనున్నారు.

ఇదే విధంగా దేశంలోని అన్ని నదుల ప్రక్షాళనకు కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు ముందుకు రావాల్సి ఉంది. ‘గోదావరి 1,420 కిమీల దూరం ప్రవహిస్తుంది. దీనిలో 615 కాలుష్యకారక ప్రాంతాలను గుర్తించారు. వీటిని అదుపు చేసి, మురుగు నీరు, ఇతర వ్యర్థాలు కలవకుండా చేస్తే కాలుష్య తీవ్రత తగ్గుతుంది’ అని నిపుణులు చెబుతున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆ దిశగా చర్యలు చేపట్టి నదులను పరిరక్షించాలని పర్యావరణ వేత్తలు కోరుతున్నారు.

Also Read : పోల‘వర’మే.. డెల్టాకు ఎడారి అంటూ తప్పుడు ప్రచారం

Show comments