మందుబాబులకు చేదు వార్త.. మద్యం షాపులు బంద్! కారణమదే..

మద్యం గురించి ఏ చిన్న విషయం తెలిసిన అది.. పెద్ద వార్తనే  అంటారు మద్యం బాబులు. ఎందుకంటే.. ప్రభుత్వాన్ని తామే నడుపుతున్నట్లు వారి ఫీలింగ్. మద్యం తాగనిది కొందరికి రోజు ప్రారంభం కాదు. అలాంటి వారికి మద్యం ధరలు తగ్గాంటే పండగే. అదే ఒక రోజు మద్యం దుకాణాలు బంద్ అని చెప్తే..చాలు చాలా బాధపడి పోతారు. ఎలా ఆ ఒక్క రోజు గడపాలా? అని తెగ బాధపడిపోతుంటారు. మద్యానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వాలు తరచూ ఏదో ఒక వార్త చెప్తూనే ఉంటాయి. తాజాగా మందుబాబులకు ఓ చేదు వార్త వచ్చింది. రెండు రోజుల పాటు మద్యం షాపులు మూతపడనున్నాయి. పూర్తి వివరాల్లోకి వెళ్తే..

తెలంగాణ సంస్కృతికి పెట్టింది పేరు బోనాల పండుగ. ప్రతి ఏటా రాష్ట్ర వ్యాప్తంగా ఈ పండుగను ఎంతో ఘనంగా జరుపుకుంటారు. ఇక భాగ్యనగరంలో అయితే లష్కర్ బోనాలు అంగరంగ వైభవంగా జరుగుతాయి. ఈ ఏడాది కూడా హైదరాబాద్ నగరంలో లష్కర్ బోనాలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. బోనాల పండుగ సందర్భంగా హైదరాబాద్ నగరంలో రెండు రోజుల పాటు మద్యం షాపులు మూతపడున్నాయి.

ఈ నెల 16వ తేదీ ఉదయం 6 గంటల నుంచి 17వ తేదీ సాయంత్రం 6 గంటల వరకు సౌత్ ఈస్ట్, సౌత్ వెస్ట్ జోనల్ల పరిధిలో ఒక రోజు, అదే విధంగా సౌత్ జోన్ పరిధిలో 16వ తేదీ ఉదయం 6 గంటల నుంచి 18వ తేదీ ఉదయం 6 గంటల వరకు రెండు రోజుల పాటు మద్యం దుకాణాలు మూసివేయాలని నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ ఉత్తర్వులు జారీ చేశారు. జంటనగరాల్లో ఆషాడ మాసంలో జరిగి బోనాల ఉత్సవాలు ఏటా ఘనంగా జరుగుతున్నాయి. ఈ ఏడాది కూడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఉండేందుకు ముందస్తు చర్యల్లో భాగంగా మద్యం షాపులు మూసేసి  ఉంచాలని  సిటీ కమిషనర్ వెల్లడించారు.

మద్యం షాపులతో పాటు బార్లు, మద్యం సప్లయ్ చేసే క్లబ్‌లు, పబ్‌లను కూడా మూసివేయాలని వెల్లడించారు.  ఎవరైనా నిబంధనలను అతిక్రమిస్తే చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. అలాగే మద్యం సేవించి బహిరంగ ప్రదేశాల్లో అలజడి సృష్టిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. భక్తులు భారీ ఎత్తున హాజరవుతారనే అంచనాతో పోలీసులు భారీ బందో బస్తు ఏర్పాటు చేశారు. ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించేందుకు మహంకాళి పీఎస్‌లో ప్రత్యేక కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేశారు.

Show comments