Oscars : అవార్డులు వస్తేనే మంచి సినిమాలు తీసినట్టా

త్వరలో ప్రధానం కాబోయే 94వ ఆస్కార్ అవార్డుల కోసం ఇండియా తరఫున పంపడానికి ఎంపిక చేసిన సినిమాల్లో సౌత్ నుంచి తమిళ మండేలా, మలయాళం నాయట్టు మాత్రమే ఉండటం ఇప్పుడు ఇండస్ట్రీలో చర్చకు దారి తీస్తోంది. తెలుగు నుంచి ఒక్క చిత్రం లేకపోవడం, బాహుబలితో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న మనకు కనీసం ఒక్క నామినేషన్ దక్కకపోవడం పట్ల ఆశ్చర్యం వ్యక్తమవుతోంది. అలా అని మన దగ్గర అభిరుచి కలిగిన సినిమాలు తీసేవాళ్ళు లేరా అంటే ఉన్నారు. అప్పుడెప్పుడో తనికెళ్ళ భరణి తీసిన మిధునం నుంచి ఆ మధ్య వచ్చిన ప్రియదర్శి మల్లేశం దాకా చెప్పుకోదగినవి ఉన్నాయి. కానీ ఇవి ఎన్నడూ పరిశీలనకు రాలేదు.

ఆస్కార్ నామినేట్ కావడం, తిరస్కారానికి గురి కావడం సౌత్ ఫిలిం మేకర్స్ కు కొత్తేమి కాదు. కమల్ హాసన్ ద్రోహి, హే రామ్ లాంటి అద్భుత కళాఖండాలకు సైతం ఆ పురస్కారాన్ని దక్కించుకోలేకపోయారు. వీటిని ఎంపిక చేసే ఇక్కడి కమిటీ కూడా వివక్ష చూపిస్తుందన్న కామెంట్లు అంతర్గతంగా వినిపిస్తూనే ఉంటాయి. గ్లాడియేటర్ కు వచ్చిన గుర్తింపు బాహుబలికి ఏ ప్రాతిపదికన ఇవ్వరు అనే ప్రశ్నకు సమాధానం చెప్పేదెవరు. తెలుగు ఆడియన్స్ మాస్ సినిమాలకు అలవాటు పడిపోయి కమర్షియల్ చిత్రాలను ఎక్కువ ఆదరిస్తారన్న మాట వాస్తవమే కానీ పూర్తిగా కాదు. అలా అయితే పెళ్లి చూపులు, లవ్ స్టోరీలు ఆడేవి కాదు కదా.

ఇది ఇప్పటి చరిత్ర కాదు. శంకరాభరణం లాంటి ఆణిముత్యాన్ని దేశదేశాలు బ్రహ్మరథం పట్టినా అది ఆస్కార్ కళ్ళకు కనిపించలేదు. సాగర సంగమంకు సైతం ఈ అవమానం తప్పలేదు. బి నరసింగరావు తీసిన దాసికి ఎందుకు గుర్తింపు రాలేదంటే ఏం చెబుతాం. మా భూమికి సైతం ఇదే అవమానం. ఇలా ఒకటి రెండు కాదు లెక్కలేనన్ని ఉదాహరణలు ఉన్నాయి. ఆస్కార్ వస్తేనే మనం ఉత్తమ సినిమా తీసినట్టు కాదు. రాకపోతే మనం ఇంకా ఎదగనట్టు కాదు. కాకపోతే మార్పుకు సమయం పడుతోంది. ముఖ్యంగా కరోనా వచ్చాక ప్రేక్షకులకు కంటెంట్ మీద మరింత స్పష్టత వచ్చింది. దర్శకులు రచయితలు సైతం జాగ్రత్తగా రాసుకుంటున్నారు. ఇప్పుడు కావాల్సింది ఇదే

Also Read : Naga Chaitanya : చైతు పాకెట్ లో మరో ఎంటర్ టైనర్

Show comments