iDreamPost
iDreamPost
ఇప్పుడు ఇండస్ట్రీలో ఇదే హాట్ టాపిక్ గా మారింది. స్టార్ హీరోలుగా వంద కోట్లకు పైగా మార్కెట్ ఉన్న మహేష్ బాబు, రామ్ చరణ్ లు ప్రత్యేకమైన పాత్రలు చేస్తారా అనే చర్చ ఆసక్తికరంగా మారింది. మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ఆచార్య(రిజిస్టర్ చేసిన టైటిల్)లో చరణ్ కు సుమారు 40 నిమిషాల పాటు సాగే ఎపిసోడ్ ఉంటుందని అందులో ఓ పాట కూడా పెట్టారని ఇటీవలే కొన్ని లీక్స్ బయటికి వచ్చాయి. దాన్ని సమర్ధిస్తూ ఖండిస్తూ ఎలాంటి న్యూస్ రాలేదు.
ఒకవేళ అదే నిజమైతే చరణ్ ఫస్ట్ టైం స్పెషల్ రోల్ చేస్తున్నట్టు. నాన్న సినిమా కాబట్టే ఒప్పుకున్నాడనుకోవచ్చు కానీ పాత్ర పరిధి చిన్నదే కాబట్టి దాని ఫుల్ లెన్త్ రోల్ అనలేం. ఇక మహేష్ బాబు వంశీ పైడిపల్లి సినిమాతో పాటు అనిల్ రావిపూడి తీయబోయే ఎఫ్3 లో కూడా కనిపించే అవకాశాలున్నాయని ఇంకో టాక్ వినిపిస్తోంది. ఇది కేవలం సెకండ్ హాఫ్ లో మాత్రమే వచ్చేలా అనిల్ ప్లాన్ చేసాడని ఆ పార్ట్ మొత్తం ఓ రేంజ్ లో ఉంటుందని చెబుతున్నాడట. మరి వెంకటేష్ వరుణ్ తేజ్ అప్పటికే ఉంటారు కదా వాళ్ళ స్క్రీన్ స్పేస్ తగ్గిపోదా అంటే లేదూ అనే సమాధానం ఇస్తున్నాడట.
ఇది నిజమో కాదో కానీ మహేష్ ఇలా సగం సినిమా ఒప్పుకుంటాడు అంటే అంత ఈజీగా నమ్మేది కాదు. ఇప్పటిదాకా ఈ ఇద్దరు హీరోలే కాదు మార్కెట్ పరంగా సమానంగా ఉండే ఇతర స్టార్లు కూడా ఇలాంటి పాత్రలు చేయలేదు. ఒకప్పుడు ఊకొడతారా ఉలిక్కిపడతారాలో బాలకృష్ణ, హ్యాండ్స్ అప్, సిపాయి సినిమాల్లో చిరంజీవి, నిన్నే ప్రేమిస్తాలో నాగార్జున వీటిని చేశారు. మళ్ళీ చరణ్, మహేష్ లు ఆ ట్రెండ్ కు శ్రీకారం చుడితే మంచిదే కానీ ఆ మాటేదో సదరు దర్శకులు చెబితే బెటర్