iDreamPost
android-app
ios-app

బిగ్ బాస్ విన్నర్లకు కెరీర్ దక్కుతోందా ?

  • Published Dec 23, 2020 | 6:49 AM Updated Updated Dec 23, 2020 | 6:49 AM
బిగ్ బాస్ విన్నర్లకు కెరీర్ దక్కుతోందా ?

సరే బిగ్ బాస్ హడావిడి ముగిసింది. టైటిల్ గెలిచినవాళ్లు, రన్నర్స్ గా నిలిచినవాళ్లు, పాల్గొన్నవాళ్ళు అందరూ ఎవరిళ్ళకు వాళ్ళు వెళ్లిపోయారు. సోషల్ మీడియాలో ఎడతెరిపి లేకుండా నాలుగు నెలలు దీని గురించి చర్చలు జరిగాయి. ఫైనల్ రిజల్ట్ పట్ల ప్రేక్షకుల్లో సంతృప్తి ఏ శాతంలో ఉందన్నది పక్కన పెడితే ఇప్పటిదాకా జరిగిన నాలుగు సీజన్లలో విజేతలుగా నిలిచినవాళ్లకు షో నడిచిన టైంలో వచ్చినంత పాపులారిటీ తర్వాతి కాలంలో ఏ మేరకు నిలుస్తుందా అనేది అసలు ప్రశ్న. వాళ్ళు గొప్ప స్థాయికి చేరుకుంటున్నారా, జనంలో వాళ్ళ ఇమేజ్ ఏళ్ళ తరబడి అలాగే నిలిచిపోతోందా అనే ప్రశ్నను వేసుకుంటే ఖచ్చితంగా కాదనే చెప్పాల్సి వస్తుంది.

ఫస్ట్ సీజన్ ని గెలుచుకున్న శివబాలాజీ ఆ తర్వాత నిర్మాతగా రాజీవ్ కనకాలతో కలిసి తనే హీరోగా ఓ సినిమా తీయడం తప్ప అంతగా గుర్తింపు వచ్చే కెరీర్ ఏదీ నిర్మించుకోలేకపోయాడు. వ్యక్తిగతంగా బిజీగా ఉండొచ్చేమో కానీ పబ్లిక్ లో పదే పదే మమేకమయ్యే స్థాయిలో ఎలాంటి అవకాశాలు తలుపు తట్టలేదు. ఇక రెండో సీజన్ ని తన ఆర్మీ పేరుతో ఆన్ లైన్ ని మోతెక్కించిన కౌశల్ మందా పరిస్థితి కూడా ఇంతే. తనతో స్టార్ డైరెక్టర్లు సినిమాలు చేయబోతున్నారని అప్పట్లో ఇంటర్వ్యూలు కూడా ఇచ్చాడు కానీ కనీసం ఒక్క చెప్పుకోదగ్గ క్యారెక్టర్ కూడా ఏ మూవీలోనూ దక్కలేదు. హీరోగా రీ ఎంట్రీ ఇస్తానని చెప్పిన మాట కూడా తుస్సుమంది.

మూడో సిరీస్ సొంతం చేసుకున్న గాయకుడు రాహుల్ సింప్లిగుంజ్ ఈ షో చేయడానికి ముందే మంచి ఫామ్ లో ఉన్న సింగర్. టైటిల్ గెలిచాక పాపులారిటీ పెరిగింది కానీ స్వతహాగా అతనికి ఎప్పుడు వచ్చే ఆఫర్స్ ఇప్పటికీ కొనసాగుతూనే ఉన్నాయి. ఇప్పుడు అభిజిత్ వంతు వచ్చింది. ఎప్పటి నుంచో ఇండస్ట్రీలో ఉన్నా సరైన బ్రేక్ కు నోచుకోని ఇతని కోసం ఇప్పటికిప్పుడు నిర్మాతలు దర్శకులు క్యూ కట్టే సీన్ ఉండకపోవచ్చు. ఓటిటి సీజన్ నడుస్తోంది కాబట్టి ఆ వైపు నుంచి అవకాశాలు రావొచ్చు. సొహైల్ అయినా అంతే. ఈ లెక్కన బిగ్ బాస్ వల్ల సదరు ఛానల్ కు, యాంకర్లుగా చేసిన నాగార్జున, నాని, తారక్ లకు తప్ప నిజంగా టైటిల్ ని గెలుస్తున్న వాళ్ళ జీవితంలో అద్భుతాలు జరగడం లేదన్న మాట వాస్తవం. మరి అయిదో సీజన్ ఈ ట్రెండ్ ని మారుస్తుందేమో చూద్దాం.