iDreamPost
iDreamPost
రక్షణరంగంలో బీజేపీ ప్రభుత్వం కీలక నిర్ణయాన్ని ప్రకటించింది. భారత సైన్యంలో స్వల్పకాలిక నియామకాల కోసం, అంటే నాలుగేళ్లు, ‘అగ్నిపథ్ పథకాన్ని ప్రవేశపెడుతున్నట్లు రక్షణమంత్రి రాజ్ నాథ్ సింగ్ ప్రకటించారు. ఏంటీ ఈ పథకం? యువకులకు నాలుగేళ్లపాటు ఇండియన్ ఆర్మీలో ఉద్యోగమిస్తారు. ఆ తర్వాత వారికి, సేవా నిధి ప్యాకేజ్ అందిస్తారు. వీళ్లకు కేంద్రం పెట్టిన పేరు అగ్నివీర్.
నాలుగేళ్ల పథకం కుర్రాళ్లకు నచ్చడంలేదు. ఆర్మీలో ఉద్యోగం ఒక డ్రీమ్. ఒకసారి సెలక్ట్ అయితే, లైఫ్ సెటిల్ అయినట్లే భావిస్తారు. కాని కొన్నేళ్లు ఆర్మీలో నియామకాలే లేవు. సైన్యం ఆధునీకీకరణలో తక్కువ సైన్యం ఎక్కువ సమర్ధతకూడా ఒక భాగమే.
అందుకే అగ్నిపథ్ పథకాన్ని, ఆధునిక దిశగా వేసిన అడుగుగా రక్షణమంత్రి చెప్పారు. ఈ అగ్నివీర్ ల వయస్సు 17.5 సంవత్సరాల నుంచి 23 ఏళ్ల మధ్య ఉంటుంది. నెల జీతం రూ. 30-40 వేల రూపాయలు. అగ్నివీర్ అయినవారిలో 25 శాతం మంది ఇండియన్ ఆర్మీలో కొనసాగుతారు. మిగిలిన వారు వేరే ఉద్యోగాన్ని చూసుకోవాల్సిందే.
ఈ పథకం వల్ల ఉద్యోగాలు వస్తాయి, ఆ తర్వాతకూడా అగ్నివీర్ లకు వివిధ రంగాల్లో జాబ్స్ కి ఢోకా ఉండని రక్షణమంత్రి మాట. ఉద్యోగకల్పనేకాదు, జాతీయ భావాన్ని పెంచడం , ఆర్మీని యువసైన్యంగా మార్చడంకూడా మరికొన్ని కారణాలు. ప్రస్తుతం ఆర్మీ సగటు వయస్సు 34-38 ఏళ్లు. కొత్త తరానికి టెక్నాలజీ తెలుసు. వచ్చేదంతా సైబర్ వార్ కాలం. దానికి తగ్గట్టుగా, చురుకైన యువతను ఆర్మీలో చేర్చుకోవాలన్నది కేంద్రం ఆలోచన.
నాలుగేళ్లలో అగ్నివీర్ లు ఏం నేర్చుకొంటారు? ఇదే అసలు ప్రశ్న. ఇది ఇండియన్ ఆర్మీ కేరక్టర్ ను దెబ్బతీస్తుంది. ఖర్చు తగ్గించాలనుకోవడం మంచిదేకాని, సైన్యాన్ని పణంగా పెట్టి చేయకూడదని, ఇది తొందరపాటు చర్య అని చాలామంది రక్షణ రంగ నిపుణులు భావిస్తున్నారు. అసలు అగ్నిపథ్ ఉద్దేశమే సైన్యం బడ్జెట్ లో జీతం, పెన్షన్ ఖర్చును తగ్గించడమేనని అంటున్నారు.
రక్షణమంత్రిత్వశాఖ లెక్క ప్రకారం, పదేళ్లలో రక్షణ బడ్జెట్ లో పెరుగుదల 8.4శాతమే. కాని పెన్షన్ల ఖర్చు మాత్రం 12శాతం మేర పెరుగుతోంది. అంటే ఆయుధాలను కొనాల్సిన డబ్బును పెన్షన్లకు ఇవ్వాల్సి వస్తోందని అంటున్నారు. ప్రస్తుతం రక్షణ బడ్జెట్ లో పెన్షన్ల వాట 24శాతం.
ఇండియన్ ఆర్మీలో పనిచేయడానికి కుర్రాళ్లు సిద్ధం. అందుకే ప్రతియేటా లక్షల మంది ప్రైవేట్ సంస్థల్లో ట్రయినింగ్ తీసుకొంటారు. కాని ఒకసారి సెలక్ట్ అయిన తర్వాత నాలుగేళ్లపాటు పనిచేయడమంటే చాలా తక్కువ సమయం. ఈ సమయంలో ఒక కుర్రాడు ఎలా శిక్షణ పొందుతాడు? ఏం నేర్చుకొంటాడు? సైన్యానికి ఎలా అందుబాటులోకి వస్తాడు? ఇది మరికొందరి సందేహం. నాలుగేళ్లలో ఆయుధాలను వాడే నైపుణ్యం రాదన్నది ఒక అంచనా.
ఆధునీకరణ అంటే కొత్త తరానికి అవకాశమివ్వడమే. టెక్నాలజీలో ఈ కాలం కుర్రోళ్లు సత్తా చూపిస్తున్నారు. వాళ్లను తీసుకొంటే ఆధునియ ఆయుధ వ్యవస్థలను ఉపయోగించడం నేర్చుకొంటారు. వాళ్లలో బాగా పనిచేసే 25శాతం మంది సైన్యంతో ఉంటారు. మిగిలిన వాళ్లు ఇతర రంగాల్లో ఉద్యోగాలను వెతుక్కొంటారు. నిజానికి ఇది ఒక మంచి ఆలోచన కూడా.
కాని ఇక్కడే మరో సందేహం. పట్టుమని పాతికేళ్లులేని కుర్రాడు సైనిక శిక్షణ పొంది, ఆ నైపుణ్యాన్ని దుర్వినియోగం చేస్తే? ఇక రెండో సందేహం. పదో తరగతి, లేదంటే ఇంటర్ చదివిన కుర్రాడికి ఏం ఉద్యోగాలు వస్తాయి? అందుకే కనీసం 10ఏళ్లు కాలపరిమితి ఉంటే మంచిదన్నది మరికొందరి వాదన.
అగ్నిపథ్ పధకం క్రితం వచ్చే నాలుగేళ్లలో 1.86 లక్షల మంది అగ్నివీర్ లను రిక్రూట్ చేస్తారు. ఈ నాలుగేళ్లలో అగ్నిపథ్ పథకం ఎంతవరకు దేశానికి ఉపయోగపడుతుందో అర్ధమవుతుంది.