iDreamPost
android-app
ios-app

పద్మ పురస్కారాలు ఎందరు తిరస్కరించారో తెలుసా?

  • Published Jan 29, 2022 | 12:49 PM Updated Updated Mar 11, 2022 | 10:20 PM
పద్మ పురస్కారాలు ఎందరు తిరస్కరించారో తెలుసా?

దేశంలో వివిధరంగాల్లో విశిష్ట సేవలు అందించే ప్రముఖులకు ప్రతి ఏటా కేంద్ర ప్రభుత్వం పద్మ పురస్కారాలు ప్రదానం చేయడం ఆనవాయితీగా వస్తోంది. భారతరత్న అత్యున్నత పౌర పురస్కారం కాగా.. ఆ తర్వాత అంత విశిష్టమైనవి పద్మ అవార్డులు. వీటిలో పద్మ విభూషణ్, పద్మభూషణ్, పద్మశ్రీ కేటగిరీలుగా ఉన్నాయి. రాజకీయాలు, కళలు, సాహిత్యం, విద్య, వైద్యం, సామాజిక సేవ, తదితర రంగాల్లో అత్యున్నత సేవలు అందించిన వారిని గుర్తించి అవార్డులు ఇచ్చే సంప్రదాయం 1954లో ప్రారంభం అయ్యింది. అయితే పలు సందర్భాల్లో ఈ అవార్డుల ఎంపిక విధానం వివాదాస్పదం అయ్యింది. తమ సేవలను ఆలస్యంగా గుర్తించడం, ఇతరత్రా ప్రభుత్వ చర్యలు, నిర్ణయాలకు నిరసన వంటి కారణాలతో పలువురు ప్రముఖులు ఈ అవార్డులను తిరస్కరించడం, తిరిగి ఇచ్చేయడం వంటి సందర్భాలు అవార్డులు ప్రకటించిన తొలి ఏడాది నుంచే ఉన్నాయి.

తాజాగా ఈ ఏడాది రిపబ్లిక్ డే ముందు ప్రకటించిన విజేతల్లో ముగ్గురు వాటిని తిరస్కరించారు. పశ్చిమ బెంగాల్ మాజీ సీఎం, సీపీఎం నేత బుద్ధదేవ్ భట్టాచార్యకు పద్మభూషణ్ ప్రకటించగా ఆయన దాన్ని తిరస్కరించారు. ప్రజలకోసం పనిచేయడం తమ బాధ్యత, పార్టీ విధానమని.. దానికి ప్రభుత్వ గుర్తింపు ఆశించడం లేదని ఆయన పేర్కొన్నారు. అలాగే పద్మశ్రీ అవార్డులకు ఎంపికైన బెంగాల్ కే చెందిన ప్రముఖ గాయని సంధ్యా ముఖర్జీ, తబలా వాద్యకారుడు పండిట్ అనింద్య చటర్జీ కూడా వాటిని తిరస్కరించారు. తమ ప్రతిభను, ఆయా రంగాలకు తమ సేవలను ప్రభుత్వం చాలా ఆలస్యంగా గుర్తించిందన్నది వారి ఆరోపణ. ఇటువంటి అనేక కారణాలతో ఇంతవరకు సుమారు 60 మంది పద్మ అవార్డులను తిరస్కరించారు. మొదట తీసుకున్న కొందరు తర్వాత కాలంలో ప్రభుత్వ చర్యలకు నిరసనగా తిరిగి ఇచ్చారు.

నేతాజీకి భారతరత్నపై హైకోర్టులో కేసు

అత్యున్నత పౌరపురస్కారం భారతరత్న అవార్డును నేతాజీ సుభాష్ చంద్రబోస్ కు ప్రకటించడంపై కలకత్తా హైకోర్టులో కొన్నాళ్లు కేసు నడిచింది. 1992లో నేతాజీకి మరణానంతరం భారతరత్న ఇస్తున్నట్లు ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేయడంతో పాటు ఆయన కుటుంబ సభ్యుల అభిప్రాయం కోరింది. దేశ స్వరాజ్యం కోసం బోస్ చేసిన సేవలను గుర్తించడానికి ఇంతకాలం పట్టిందా.. అని నిరసన వ్యక్తంచేస్తూ వారు దానికి అంగీకరించలేదు. కాగా ఇదే అంశంపై కలకత్తా హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. బోస్ సేవా నిరతిని గుర్తించడంలో జాప్యాన్ని ప్రశ్నించడంతోపాటు ఆయన మరణాన్ని ఇంకా అధికారికంగా ధృవీకరించని పరిస్థితుల్లో మరణానంతరం భారతరత్న ఇస్తున్నట్లు ప్రకటించడాన్ని తప్పు పడుతూ దాఖలైన ఆ పిల్ ను విచారణకు స్వీకరించిన కోర్టు దానికోసం స్పెషల్ బెంచ్ కూడా ఏర్పాటు చేసింది. చివరికి 1997 ఆగష్టు 4న కేంద్రం జారీ చేసిన ప్రెస్ నోట్ రద్దు చేసినట్లు ప్రకటించిన కోర్టు మరణానంతరం అవార్డు ప్రకటనపై తీర్పు ఇవ్వడానికి నిరాకరిస్తూ కేసును మూసివేసింది.

అంగీకరించని మౌలానా ఆజాద్

అవార్డులు మొదలు పెట్టిన తొలి ఏడాది అంటే 1954లోనే దేశ ప్రథమ విద్యామంత్రి, స్వాతంత్ర్య సమరయోధుడు మౌలానా అబుల్ కలాం ఆజాద్ కు భారతరత్న ఇవ్వాలని కేంద్రం ప్రతిపాదించింది. అయితే ఆజాద్ అంగీకరించలేదు. అవార్డుల ఎంపిక కమిటీలో తాను కూడా ఉన్నందున తనకు తాను అవార్డు ప్రకటించుకున్నట్లు అవుతుందని ఆయన అభ్యంతరం చెప్పారు. దాంతో 1992లో మరణానంతరం మౌలానా ఆజాద్ కు భారతరత్న ఇచ్చారు.

పద్మవిభూషణ్ తిరస్కరించిన ఐదుగురు

భారతరత్న తర్వాత అత్యున్నతమైన పద్మవిభూషణ్ పురస్కారాన్ని ఐదుగురు ప్రముఖులు నిరాకరించారు.
– ఇండో సోవియట్ ఫ్రెండ్షిప్ ఒప్పందం కుదర్చడంలో కీలకపాత్ర పోషించినందుకు 1973లో పీ ఎన్ హక్సర్ కు పద్మవిభూషణ్ ప్రకటించారు. అయితే అది తన బాధ్యతల్లో భాగమంటూ ఆయన అవార్డు తీసుకోవడానికి నిరాకరించారు.

-కేరళ ముఖ్యమంత్రిగా, సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన ఈఎంఎస్ నంబూద్రిపాద్ కు 1992లో ప్రకటించగా అవార్డులు స్వీకరించడం తమ పార్టీ విధానం కాదంటూ తిరస్కరించారు.
-2000 లో రామకృష్ణా మిషన్ కు చెందిన స్వామి రంగనాధానంద తమ సంస్థకు కాకుండా వ్యక్తిగతంగా తనకు ప్రకటించడంతో తిరస్కరించారు.
-2011లో లక్ష్మిచంద్ జైన్ కు మరణానంతరం ప్రకటించగా ఆయన కుటుంబం నిరాకరించింది.
-2015లో పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి ప్రకాష్ సింగ్ బాదల్ పద్మవిభూషణ్ అందుకున్నారు.అయితే కేంద్రం తెచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలకు నిరసనగా 2021లో ఆయన తన అవార్డును ప్రభుత్వానికి తిరిగి ఇచ్చేశారు. 

పద్మభూషణ్ నిరాకరించిన గాయని జానకి, రచయిత కుశ్వంత్ సింగ్ పద్మభూషణ్ అవార్డులకు ఎంపికైన వారిలో 20 మంది వాటిని తిరస్కరించారు. 1974లో ప్రముఖ రచయిత కుశ్వంత్ సింగ్ ఈ పురస్కారం అందుకున్నారు. అయితే 1984లో కేంద్రం అమృతసర్ లోని స్వర్ణ దేవాలయం ఆపరేషన్ బ్లూ స్టార్ చేపట్టినందుకు నిరసన వ్యక్తం చేస్తూ ఆయన ఆ అవార్డును ప్రభుత్వానికి తిరిగి ఇచ్చేశారు. కాగా ప్రముఖ తెలుగు గాయని ఎస్.జానకి కి 2013లో పద్మభూషణ్ ప్రకటించారు. చాలా ఆలస్యంగా తన సేవలు గుర్తించారంటూ.. దాన్ని స్వీకరించడానికి ఆమె నిరాకరించారు.

ఇక పద్మశ్రీ అవార్డులకు ఎంపికైన వారిలో 32 మంది వాటిని స్వీకరించేందుకు నిరాకరించారు. తొలి ఏడాదే అంటే 1954లోనే తనకు ప్రకటించిన ఈ అవార్డు స్వీకరించేందుకు స్వాతంత్ర్య సమరయోధురాలు ఆశాదేవి ఆర్యనాయగం నిరాకరించారు. అయితే ఒకసారి పురస్కారాలను ప్రకటించి, విజేతలు పేర్లను గెజిట్లో నమోదు చేసిన తర్వాత ఎవరు తిరస్కరించినా, తిరిగి ఇచ్చేసినా అధికారికంగా ఆ అవార్డులు వారి పేరుతోనే ఉండిపోతాయి.

Jojobet GirişmeritbetalobetCasibom girişcasibomJojobet GirişcasibomcasibomcasibomjojobetartemisbetMadridbetMadridbetcasibom girişcasibom girişganobetpokerklasjojobetMarsbahis GüncelCasibomJojobetGrandPashaBet destekDeneme bonusu veren siteler 2026jojobet girişCasibom GirişGrandPashaBet Şikayet