వాట్సాప్‌ నుంచి అదిరిపోయే ఫీచర్‌.. ఇకపై ఒకేసారి 32 మందితో!

స్మార్ట్‌ ఫోన్‌ ఉన్న ప్రతి ఒక్కరు కామన్‌గా వాడే ఏకైక యాప్‌ వాట్సాప్‌. నేటి కాలంలో వాట్సాప్‌ వాడని వారు చాలా అరుదు అని చెప్పవచ్చు. అతి తక్కువ కాలంలోనే ఈ ఇన్‌స్టంట్‌ మెసేజింగ్‌ యాప్‌.. వినియోగదారులను ఆకట్టుకుంది. దానికి తోడు.. ఎప్పుడూ కొత్త కొత్త ఫీచర్లతో యూజర్లను ఆకట్టుకుంటూ.. తనకు సాటి మరొకటి రాదని నిరూపించుకుంటుంది. యూజర్ల కోసం ఎప్పిటకప్పుడు అప్‌డేట్స్‌ తీసుకొస్తుంటుంది. ఇక తాజాగా మరో అద్భుతమైన ఫీచర్‌ని తీసుకువచ్చింది వాట్సాప్‌. కొత్త ఫీచర్‌పై కీలక ప్రకటన చేసింది. లేటెస్ట్ అప్‌డేట్ ప్రకారం.. వాట్సాప్ వినియోగదారులు ఇప్పుడు పీసీలో ఏకకాలంలో.. గరిష్టంగా ఒకేసారి 32 మందితో వీడియో కాల్స్ చేసుకోవచ్చు. 32 మంది పార్టిసిపెంట్స్‌తో బీటాలో వీడియో కాల్స్ చేసుకునే సదుపాయం కల్పించింది. ఈ కొత్త ఫీచర్‌ ద్వారా.. ఇక మీదట గూగుల్ మీట్, జూమ్ లాంటి వాటి అవసరం లేకుండానే డెస్క్‌టాప్‌ ద్వారానే ఒకేసారి 32 మందితో వీడియో కాల్‌లో మాట్లాడొచ్చు.

వాట్సాప్‌ బీటా ఇన్ఫో వెల్లడించిన సమాచారం ప్రకారం.. ఇకపై 32 మంది యూజర్లు వీడియో కాల్స్ చేసుకోవచ్చు. గ్రూప్ కాల్స్‌లో జాయిన్ అవ్వాలని వచ్చే ఇన్విటేషన్ మెసేజ్ ద్వారా..వీడియో కాల్‌లో చేరాలనుకునే బీటా యూజర్లు.. ఈ వీడియో కాల్‌లో జాయిన్ అవ్వొచ్చు. అయితే ప్రస్తుతం కొంత మందికి మాత్రమే ఈ ఫీచర్‌ అందుబాటులో ఉంది. విండోస్ అప్‌డేట్ కోసం.. కొత్త వాట్సాప్ బీటా ఇన్‌స్టాల్ చేసే కొంతమంది బీటా టెస్టర్లకు మాత్రమే ప్రస్తుతం ఈ స్పెషల్ ఫీచర్ అందుబాటులో ఉంది. రానున్న రోజుల్లో దీనిని యూజర్లందరికీ అందుబాటులోకి తీసుకొస్తుందని వాట్సాప్‌ బీటా ఇన్ఫో రిపోర్ట్ వెల్లడించింది.

ఇప్పటివరకు విండోస్‌ వినియోగదారులు మాత్రమే ఒకేసారి 32 మందితో  వాట్సాప్ కాల్స్ చేసుకోగలిగే వారు. ఇక ఇప్పుడు లేటెస్ట్ అప్‌డేట్‌తో బీటా యూజర్లు గరిష్టంగా 32 మందితో.. అది కూడా ఏకంగా వీడియో కాల్ చేసుకోవచ్చు. గత సంవత్సరం నవంబర్‌లోనే మెటా ఫౌండర్, సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్ .. ఆండ్రాయిడ్, ఐఓఎస్‌లలో ఈ ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు ప్రకటించారు. ఇక ఈ ఏడాది జూన్‌ ప్రారంభంలో.. మెసేజింగ్ ప్లాట్‌ఫారం విండోస్‌లోని కొందరు బీటా టెస్టర్లకు వీడియో కాల్స్ కోసం స్క్రీన్ షేరింగ్ ఫీచర్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ కొత్త ఫీచర్‌ అందుబాటులోకి వస్తే.. జూమ్‌, గూగుల్‌ మీట్‌లానే ఒకేసారి ఎక్కువ మంది వీడియో కాల్‌లో జాయిన్‌ అవ్వొచ్చు.

Show comments