దమ్మాలపాటి వాదన ఇలా.. ఆయన లాయర్‌ వాదన అలా.. ఏది నిజం..?

రాజధానిగా అమరావతి ప్రాంతాన్ని ప్రకటించకముందు మాజీ అడ్వకేట్‌ జనరల్‌ దమ్మాలపాటి శ్రీనివాస్‌ అక్కడ భూములు కొనుగోలు చేశారా..? లేదా..? అనే అంశంపై వారు చేస్తున్న వాదనలతో అనేక సందేహాలు తలెత్తుతున్నాయి. ఏపీ హైకోర్టులో దమ్మాలపాటి శ్రీనివాస్‌ దాఖలు చేసిన పిటిషన్‌లో.. తాను భూములు కొనుగోలు చేయలేదని పేర్కొంటే.. అతని తరఫున వాదనలు వినిపించిన ముఖుల్‌ రోహత్గీ మాత్రం అక్కడ రాజధాని వస్తుందని మీడియాలో విస్తృత ప్రచారం సాగిందని, భూములు కొనుగోలు చేయడం తప్పెలా అవుతుందని వాదించడం ఇప్పుడు చర్చనీయాంశమైంది.

‘‘వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం నాపై కక్షతో నన్ను లక్ష్యంగా చేసుకుంది. రాజధాని నిర్ణయం విషయం నాకు తెలుసని, భూమి కొనుగోలు చేశానని రాష్ట్ర హోం శాఖ కేంద్ర హోంశాఖకు లేఖ రాసింది. అందులోని తప్పుడు ఆరోపణలు. సీబీఐ విచారణ చేయకుండా, నన్ను అరెస్ట్‌ చేయకుండా ఆదేశాలు ఇవ్వండి..’’ అంటూ మాజీ ఏజీ తన పిటిషన్‌లో రాష్ట్ర ఉన్నత న్యాయస్థానాన్ని కోరారు.

అరోపణలు ఎదుర్కొంటున్న మాజీ ఏజీ దమ్మాలపాటి శ్రీనివాస్‌ వాదన ఇలా ఉంటే.. ఏసీబీ కేసు నమోదు చేయడంపై ఆయన తరఫున వాదనలు వినిపించిన సీనియర్‌ న్యాయవాది ముఖుల్‌ రోహత్గీ వాదన మరోలా ఉంది.

‘‘ 2014లో కొత్త ప్రభుత్వం ఏర్పడ్డాక ఫలానా ప్రాంతంలో రాజధాని నిర్మిస్తారని విస్తృతంగా ప్రచారం సాగింది. ప్రసార మాధ్యమాల్లో సైతం ఈ విషయం వచ్చింది. అలాంటప్పుడు అక్కడ భూములు కొంటే తప్పెలా అవుతుంది..? మాజీ ఏజీ ప్రతిష్టను దెబ్బతీయాలనే పోలీసులు కేసు నమోదు చేశారు.’’ అంటూ ముఖుల్‌ రోహాత్గీ మాజీ ఏజీ తరఫున వాదించారు.

దమ్మాలపాటి ఏమో తాను అసలు భూములే కొనుగోలు చేయలేదంటున్నారు. కానీ ఆయన లాయర్‌ ఏమో రాజధాని వస్తుందని ప్రచారం సాగింది. అక్కడ భూములు కొంటే తప్పేంటని ప్రశ్నిస్తున్నారు. పూర్తి భిన్నంగా ఉన్న వీరిద్దరి వాదనలో ఎవరు చెప్పింది నిజం..? అనేదే ఇప్పుడు కొత్త చర్చకు ఆస్కారం కల్పించింది.

సుప్రిం కోర్టు న్యాయవాది అయిన ముఖుల్‌ రోహత్గీకి ఏపీ నూతన రాజధాని ప్రకటించక ముందు జరిగిన ప్రచారంపై పూర్తిగా అవగాహన లేకపోవడంమో లేక పిటిషన్‌ తరఫు వ్యక్తులు తప్పుదోవ పట్టించడమో జరిగిందని ఆయన వాదనల ద్వారా తెలుస్తోంది.

2014లో కొత్త ప్రభుత్వం ఏర్పడ్డాక రాజధాని నూజివీడు ప్రాంతంలోనూ, ఏలూరు వద్దని, బందరు వైపుని.. ఇలా పలు ప్రాంతాల పేరుతో ప్రభుత్వ పెద్దలు లీకులు ఇచ్చారు. అవి మీడియాలో విస్తృతంగా ప్రచారం అయ్యాయి. రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు అందరూ అక్కడ భూములు కొనుగోలు చేశారు. అందరినీ అటు మళ్లించిన టీడీపీ పెద్దలు.. వారు మాత్రం ప్రస్తుతం రాజధాని ఉన్న 29 గ్రామాల్లోనూ, వాటి చుట్టుపక్కల భూములు కొనుగోలు చేశారనే అభియోగాలపై ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ ఆరోపణలు వెళ్లువెత్తాయి.

ఏపీ రాజధానిగా.. అమరావతి ప్రాంతం వస్తుందని ఏనాడు మీడియాలో వార్తలు ప్రచారం కాలేదు. కానీ ముఖుల్‌ రోహత్గీ మాత్రం ప్రచారం సాగిందని చెబుతుండడం పలు అనుమానాలకు తావిస్తోంది. అసలు భూములు కొన్నారా..? లేదా..? అనే విషయం తేలాలంటే విచారణ జరగాలి. మరి విచారణ జరిగేలా పరిస్థితులు మారతాయా..? లేదా..? వేచి చూడాలి.

Show comments