బూమ్ బూమ్…. బూమ్రా ఏమైంది నీకు?

వెన్నునొప్పి గాయం నుండి కోలుకొని సొంతగడ్డపై గత ఆస్ట్రేలియా సిరీస్‌లో పునరాగమనం చేసిన పేస్ బౌలర్ జస్ ప్రీత్ బుమ్రా తన స్థాయికి తగ్గ ప్రదర్శన చేయడం లేదు.డెత్ ఓవర్లలో పదునైన యార్కర్లు,స్లో డెలివరీలతో ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌లను బెంబేలెత్తిచడం బుమ్రా బౌలింగ్ ప్రత్యేకత.బుధవారం హామిల్టన్ సెడాన్ పార్క్‌లో జరిగిన మూడో టీ20లో న్యూజిలాండ్ విజయానికి చివరి రెండు ఓవర్లలో 20 పరుగులు అవసరం.ఈ పరిస్థితులలో 19 ఓవర్ బౌలింగ్ చేసి రెండు ఫోర్లతో సహా మొత్తం 11 పరుగులు సమర్పించుకొని జట్టును ఓటమి అంచున నిలబెట్టాడు.మ్యాచ్ భారత్ చేజారి పోయిందనుకున్న సమయంలో మహమ్మద్ షమీ చివరి ఓవర్‌ను అద్భుతంగా బౌల్ చేసి 8 పరుగులు మాత్రమే ఇచ్చి రెండు వికెట్లు పడగొట్టడంతో మ్యాచ్ టై గా ముగిసింది.

అంతకు ముందు బుమ్రా న్యూజిలాండ్ ఇన్నింగ్స్ లో నాలుగు ఓవర్లు బౌలింగ్ చేసి భారీగా 45 పరుగులు ఇచ్చాడు.కానీ గత రికార్డులను దృష్టిలో పెట్టుకుని కెప్టెన్ కోహ్లీ సూపర్ ఓవర్‌ను బౌలింగ్ చేసే అవకాశము బుమ్రాకు కల్పించాడు.అయితే యార్కర్ సంధించటంలో విఫలం చెంది నాలుగు ఫుల్ టాస్ బంతులు వెయ్యగా న్యూజిలాండ్ కెప్టెన్ విలియంసన్,గుప్తిల్ తో కలిసి రెండు ఫోర్లు,ఒక సిక్సర్‌తో 17 పరుగులు బాదుకున్నారు.

సూపర్ ఓవర్లలో బుమ్రా గతమెంతో ఘనం కానీ…

ఐపీఎల్-2017లో గుజరాత్ లయన్స్ తో సూపర్ ఓవర్ వేసిన బుమ్రా కేవలం నాలుగు పరుగులు మాత్రమే ఇచ్చాడు. ఐపీఎల్-2019లో హైదరాబాదు ఉప్పల్ వేదికగా జరిగిన మ్యాచ్లో మరొకసారి సూపర్ ఓవర్ వెయ్యగా 8 పరుగులు మాత్రమే సన్ రైజర్స్ చేయగలిగింది.ఈ రెండు మ్యాచ్ల్లోనూ తన బౌలింగ్ ప్రతిభతో ముంబై ఇండియన్స్ ను సూపర్ ఓవర్లో గెలిపించాడు. కానీ హమిల్టన్ మ్యాచ్లో సూపర్ ఓవర్ బౌలింగ్ చేసిన బుమ్రా ఏకంగా 17 పరుగులు కివీస్ జట్టుకు ఇచ్చి ఆరు బంతుల్లో 18 పరుగులు చేయవలసిన క్లిష్ట పరిస్థితిని జట్టుకు కలిగించాడు.
ఈ స్పీడ్ బౌలర్ రీ-ఎంట్రీ తర్వాత పొట్టి ఫార్మేట్ లో వైవిధ్య భరితమైన బంతులు సంధించడంలో తడబడి ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌లకు ధారాళంగా పరుగులు ఇస్తూ వికెట్లు పడగొట్టడంలో విఫలం అవుతున్నాడు.బుమ్రా త్వరగా పూర్తిస్థాయి బౌలింగ్ లయను పొంది మునుపటి వలె పదునైన బంతులతో బ్యాట్స్‌మెన్‌లపై విరుచుకుపడాలని జట్టు యాజమాన్యం కోరుకుంటుంది.

Show comments