Idream media
Idream media
అవినీతి ఆరోపణలు ఆంధ్రప్రదేశ్‌లో అధికార, ప్రతిపక్ష పార్టీ నేతల మధ్య ప్రత్యక్ష వివాదాలకు కారణం అవుతున్నాయి. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఆ పార్టీ ప్రభుత్వంపై, ప్రజా ప్రతినిధులపై ప్రతిపక్ష టీడీపీ పార్టీ ఓ ప్రణాళిక ప్రకారం విషయం చిమ్ముతున్నట్లు వరుసగా జరుగుతున్న ఘటనలు స్పష్టం చేస్తున్నారు. ప్రతిపక్ష పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యేలు, తమ ప్రత్యర్థి పార్టీ వైసీపీకి చెందిన ఎమ్మెల్యేలపై నేరుగా అవినీతి ఆరోపణలు చేస్తున్నారు. ఇందు కోసం సోషల్ మీడియాను వినియోగించుకుంటున్నారు. ఈ తరహా విష ప్రచారం వల్ల.. తాజా, మాజీ ప్రజా ప్రతినిధుల మధ్య ప్రత్యక్ష పోరు నడస్తోంది.
నిన్న తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గంలో అధికార పార్టీ ఎమ్మెల్యే, టీడీపీ మాజీ ఎమ్మెల్యేల మధ్య మొదలైన అవినీతి ఆరోపణల పర్వం.. చినికిచినికి గాలివానలా మారింది. వారిద్దరి మధ్య ప్రత్యక్ష పోరుకు తెరలేచింది. ఈ నేపథ్యంలో నిన్న ఇద్దరూ దేవుని ముందు ప్రమాణ స్వీకారం చేశారు. తాజాగా ఈ రోజు అనంతపురం జిల్లా తాడిపత్రి నియోజకవర్గంలోనూ ఇరు పార్టీల నేతల మధ్య వివాదం చోటు చేసుకుంది.
తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి.. టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డితో తాడోపేడో తేల్చుకునేందుకు సిద్ధమయ్యారు. తనపై లేనిపోని అవినీతి ఆరోపణలు చేస్తున్నారని, సోషల్ మీడియాలోనూ ప్రచారం చేస్తూ తన ప్రతిష్టను దిగజార్చే కుట్రలకు పాల్పడుతున్నారంటూ కేతిరెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ అంశంపై నిలదీసేందుకు ఈ రోజు తన అనుచరులతో కలసి జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంటికి వెళ్లారు. ఆ సమయంలో ప్రభాకర్ రెడ్డి ఇంట్లో లేరు. ప్రభాకర్ రెడ్డి వచ్చే వరకూ పెద్దా రెడ్డి అక్కడే భైఠాయించారు. వైసీపీ కార్యకర్తలు పెద్దారెడ్డికి మద్ధతుగా పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఈ క్రమంలో పెద్దా రెడ్డి, ప్రభాకర్ రెడ్డి అనుచరుల మధ్య కవ్వింపు చర్యలు చోటు చేసుకున్నాయి. పెద్దారెడ్డి కుమారుడు హర్ష ఇన్నోవా వాహనంపై ప్రభాకర్ రెడ్డి అనుచరులు రాళ్లు విసిరారు. దీంతో కారు అద్దాలు ధ్వంసమయ్యారు. ప్రతిగా పెద్దారెడ్డి అనుచరులు రాళ్లు రువ్వారు. ఇరు వర్గాలు కొద్దిసేపు రాళ్లవర్షం కురిపించుకున్నాయి. ఈ క్రమంలోనే ఇరువర్గాలకు చెందిన పలువాహనాలు ధ్వంసమయ్యాయి. ఇరు వర్గాలను అదుపు చేసిన పోలీసులు.. ఉద్రిక్తను కొద్దిమేర సద్దుమణిగేలా చేశారు. ప్రస్తుతం కేతిరెడ్డి.. ప్రభాకర్ రెడ్డి ఇంటి ముందే భైటాయించి ఉన్నారు. తనపై జరిగిన విష ప్రచారం విషయం తేల్చుకునే వరకూ కదిలేదిలేదని ఆయన భీష్మించుకూర్చున్నారు.
గత కొద్ది రోజులుగా పెద్దారెడ్డిని లక్ష్యంగా చేసుకుని జేపీ ప్రభాకర్ రెడ్డి సోషల్ మీడియాలో అసత్య ప్రచారం చేస్తున్నారని ఆయన అనుచరులు గుర్రుగా ఉన్నారు. ప్రభాకర్ రెడ్డి వద్ద ఉండే దాసరి కిరణ్ అనే వ్యక్తి పెద్దారెడ్డిపై సోషల్ మీడియాలో విష ప్రచారం చేస్తున్నారని భావిస్తున్నారు. ఫోటోలు మార్ఫింగ్ చేయడం, పెద్దారెడ్డి గురించి అనుచిత వ్యాఖ్యలు, పోస్టులు పెడుతున్నారంటూ ఆయన అనుచరులు ఆరోపిస్తున్నారు. అయితే మూడు రోజుల క్రితం పెద్దా రెడ్డి సతీమణి ప్రతిష్టను దిగజార్చేలా ఇసుక వసూళ్లు అంటూ ఆడియో కాల్‌ను సృష్టించి సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. ఎద్దుల బండి ద్వారా ఇసుక తోలే వారి వద్ద పెద్దా రెడ్డి సతీమణి ఒక్కొక్క బండికి పది వేలు వసూలు చేస్తున్నారనేది ఆ ఫోన్ కాల్ సారాంశం. ఎద్దుల బండి ఇసుక ఆరు వందలకు వినియోగదారులకు అందిస్తూ పలువురు ఉపాధి పొందుతున్నారు. అయితే వారి వద్ద బండికి పదివేలు వసూలు చేస్తున్నారనడంతోనే ప్రత్యర్థుల కుట్రలు తేలిపోతున్నాయి. తనతోపాటు తన సతీమణì ప్రతిష్టను దెబ్బతీనేలా చేస్తుండడంతో ఈ విషయంలో ప్రభాకర్ రెడ్డిని నిలదీసేందుకు పెద్దారెడ్డి సిద్ధం కావడంతో తాడిపత్రిలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. పోలీసులు సెక్షన్ 144, సెక్షన్ 30లను అమలు చేస్తున్నారు.
గత ఎన్నికల్లో జేపీ ప్రభాకర్ రెడ్డి కుమారుడు అశ్మిత్ రెడ్డిపై వైసీపీ అభ్యర్థి కేతిరెడ్డి పెద్దారెడ్డి విజయం సాధించారు. ఎన్నికల ముందు నుంచి వీరి మధ్య ఉన్న ఈ వైరం ఎన్నికల తర్వాతా కొనసాగింది. మార్చి నెలలో జరిగిన మున్సిపల్ ఎన్నికల నామినేషన్లలో తాడిపత్రి మున్సిపల్ వేదికగా ఇరు వర్గాలు మళ్లీ రాజకీయ పోరుకు సిద్ధమయ్యాయి. తాడిపత్రి మున్సిపల్ ఎన్నికల్లో కౌన్సిలర్‌గా పోటీకి నామినేషన్ వేసిన కేతిరెడ్డి పెద్దారెడ్డి కుమారుడుపై.. మాజీ ఎమ్మెల్యే జేపీ ప్రభాకర్ రెడ్డి పోటికి దిగారు. ఎన్నికల్లో నా కొడుకును ఓడించావు.. నీ కొడుకును నేను ఓడిస్తాననే మాదిరిగా ఎమ్మెల్యేగా పని చేసిన జేసీ ప్రభాకర్ రెడ్డి తన స్థాయిని తగ్గించుకుని మరీ కౌన్సిలర్‌గా పోటీలో దిగడం ఇరువురి మధ్య ఉన్న రాజకీయ పోరుకు నిదర్శనంగా నిలిచింది. ఎన్నికలకు ముందు మొదలైన ప్రచ్ఛన్న యుద్ధం.. తాజాగా ప్రత్యక్ష పోరుకు దారితీసింది.