విరాట పర్వానికి కోరుకోని వివాదం

ఈ 17న విడుదల కాబోతున్న విరాట పర్వం మీద అంచనాలు మెల్లగా ఎగబాకుతున్నాయి. సాయిపల్లవి ప్రత్యేకంగా దీని ప్రమోషన్ల కోసమే రెండు వారాలుగా హైదరాబాద్ లోనే ఉంటూ తెలుగు రాష్ట్రాల్లో టీమ్ ఎక్కడ ఈవెంట్ ప్లాన్ చేస్తే అక్కడికి నో అనకుండా వెళ్తోంది. అంతే కాదు లెక్కలేనన్ని ఇంటర్వ్యూలు అలిసిపోకుండా ఇస్తోంది. వెన్నెల పాత్రను ఇంత ప్రేమించింది కాబట్టి ఈ స్థాయిలో ప్రమోట్ చేస్తోందని అభిమానులు మురిసిపోతున్నారు. అయితే ఒక ఇష్యూ గురించి సాయిపల్లవి చెప్పిన కొన్ని మాటలు సోషల్ మీడియాలో వక్రీకరణకు గురి కావడంతో ఇప్పుడు బ్యాన్ విరాట పర్వం అనే అర్థం లేని ట్రెండ్ ఒకటి మొదలయ్యింది.

కాశ్మీర్ ఫైల్స్ గురించి ప్రస్తావన వచ్చినప్పుడు హింస గురించి వివరణ ఇస్తూ గోవధ వివాద సమయంలోనూ జరిగిన హత్యలతో పోలిక తెస్తూ అన్న మాటలకు ఇప్పుడు పెడర్థాలు బయటికి వచ్చాయి. నిజానికి తనన్న మాట హింస ఏ రూపంలో అయినా ఎక్కడైనా ఖండించాలని అర్థం వచ్చేలా చెప్పింది. కానీ నాలుగు నిమిషాల సంభాషణలో కేవలం కొన్ని సెకండ్లు మాత్రమే తీసుకుని ఎడిట్ చేసి ఆ వీడియోని వైరల్ చేయడం వల్ల వచ్చిన అనర్థం ఇది. ఈ కారణంగానే తాము విరాట పర్వంని చూడమని పోస్టులు ట్వీట్లు పెట్టడం ఎక్కడికో వెళ్లిపోతోంది. మ్యాటర్ పూర్తిగా తెలియని వాళ్ళు సైతం ఇందులో పాలు పంచుకోవడంతో వివాదం కొత్త మలుపు తీసుకుంది.

ఇదంతా టీమ్ కోరుకోని వ్యవహారం. అన్నమాటలను ఇంకో విధంగా వక్రీకరించడం పట్ల అభిమానులు విచారం వ్యక్తం చేస్తున్నారు. సాయిపల్లవి ఇంకా దీని గురించి స్పందించలేదు. వేణు ఊడుగుల దర్శకత్వం వహించిన ఈ పీరియాడిక్ నక్సల్ డ్రామాకు సురేష్ బొబ్బిలి సంగీతం సమకూర్చారు. ఫ్యామిలీ ఆడియన్స్ కి అంత సులభంగా కనెక్ట్ కాలేని ఇలాంటి సీరియస్ మూవీస్ మేధావి వర్గంతో పాటు యూత్, మాస్ మీద ఎక్కువ ఆధారపడాలి. ముఖ్యంగా సాయిపల్లవి బ్రాండ్ ఈ సినిమాకు బాగా పనిచేస్తోంది. రానాకంటూ ఒక మార్కెట్ ఉన్నప్పటికీ విరాటపర్వం బిజినెస్ హీరోయిన్ ఇమేజ్ మీద ఎక్కువ వెళ్ళింది. చూడాలి ఎలాంటి ఫలితం వస్తుందో

Show comments