జెమిని నేర్పించిన రీమేక్ పాఠం – Nostalgia

ప్రతి బ్లాక్ బస్టర్ రీమేక్ హిట్ అవుతుందన్న గ్యారెంటీ లేదు. ఈ సత్యం ఎన్నో సినిమాలు రుజువు చేశాయి. కాకపోతే అవి చేసే టైంకి సదరు హీరో మీద ఉన్న అంచనాలు, దానికి ముందు వచ్చిన విజయాలను విశ్లేషణ చేసుకోవడం చాలా అవసరం. ఇందులో ఏ మాత్రం తేడా కొట్టినా బాక్సాఫీస్ వద్ద ఫెయిల్యూర్ తప్పదు. ఓ ఉదాహరణ చూద్దాం. 2002లో శరన్ దర్శకత్వంలో విక్రమ్ హీరోగా ఏవిఎం సంస్థ నిర్మించిన జెమిని సినిమా రిలీజ్ టైంలో క్రిటిక్స్ నుంచి గట్టి విమర్శలు అందుకుంది. కానీ పబ్లిక్ అనూహ్యంగా దాన్ని బ్లాక్ బస్టర్ చేశారు. యాభై చాలు అనుకుంటే ఏకంగా సిల్వర్ జూబిలీ చేసుకునే దాకా పరుగులు పెట్టింది. విక్రమ్ ఇమేజ్ స్టార్ లెవెల్ కి చేరుకుంది.

తమిళనాడు మొత్తం సంగీత దర్శకుడు రమణి భరద్వాజ్ కంపోజ్ చేసిన ఏ పోడు పాటతో ఊగిపోయింది. డైలాగులను, హీరో బాడీ లాంగ్వేజ్ ని యువత తారక మంత్రంగా మార్చుకుంది. 4 కోట్ల బడ్జెట్ తో తీస్తే వసూళ్లు 20 కోట్లకు పైగా వచ్చాయి. ఇంకేం రీమేక్ చేయడానికి ఇంతకన్నా ఏం కావాలన్న ఉద్దేశంతో వెంకటేష్ హీరోగా తీసే ఆలోచనతో ఏవిఎంని రీమేక్ హక్కులు అడిగారు నిర్మాత సురేష్ బాబు. వాళ్ళు అమ్మకుండా భాగస్వామిగా చేద్దామని అడిగారు. అలా ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కింది. కథలో ఆత్మ చెడిపోకూడదనే ఉద్దేశంతో దర్శకత్వ భాద్యతలు ఒరిజినల్ వెర్షన్ డీల్ చేసిన శరన్ కే ఇచ్చారు. హీరోయిన్ గా నమితని ఎంచుకున్నారు.

సంగీత దర్శకుడిగా ఆర్పి పట్నాయక్ ఫిక్స్ అయ్యారు. టైటిల్ సాంగ్ ని యధాతథంగా తీసుకుని మిగిలిన వాటిని మాత్రం ఫ్రెష్ గా చేశారు. పోసాని కృష్ణమురళి సంభాషణలు సమకూర్చారు. ఇద్దరు రౌడీ షీటర్లు వాళ్ళను మార్చాలనుకున్న ఒక పోలీస్ ఆఫీసర్ మధ్య కథగా శరన్ దీన్ని తీర్చిదిద్దారు. వెంకటేష్ కు ఆ టైంలో భీభత్సమైన ఫ్యామిలీ హిట్స్ ఉన్నాయి.. కలిసుందాం రా, నువ్వు నాకు నచ్చావ్, రాజా, జయం మనదేరా లాంటి సినిమాలతో ఫ్యామిలి ఆడియన్స్ లో విపరీతమైన ఫాలోయింగ్. దెబ్బకు ఈ సినిమా అంతా తమిళ వాసనతో పాటు కాస్త ఓవర్ గా అనిపించే ఊర మాస్ పాత్రలో వెంకీని చూడలేకపోయారు. 2002 అక్టోబర్ 11న విడుదలైన జెమినికి ఫ్లాప్ తప్పలేదు. దానికన్నా సరిగ్గా ఒక్క రోజు విడుదలైన దర్శకుడిగా త్రివిక్రమ్ మొదటి సినిమా నువ్వే నువ్వే హిట్ అవ్వడం విశేషం

Also Read : సొగసైన పల్లెటూరి యువకుడి ప్రేమకథ – Nostalgia

Show comments