Idream media
Idream media
టీఆర్‌ఎస్ పార్టీ రెండోసారి అధికారంలోకి వచ్చి డిసెంబరు 13 (నేటి)తో సరిగ్గా రెండేళ్లు అవుతోంది. తెలంగాణ ఆవిర్భావం అనంతరం నుంచి ఇప్పటి వరకూ మొత్తం ఆరున్నరేళ్లు టీఆర్‌ఎస్ పాలన సాగించింది. ఈ సందర్భంగా టీఆర్‌ఎస్ పాలనపై ప్రజలు ఏమనుకుంటున్నారు.. ఆరున్నరేళ్ల పాలనలో ఏకఛత్రాధిపత్యం కొనసాగించిన టీఆర్‌ఎస్ తాజా గ్రేటర్ ఎన్నికల్లో ఎక్కువ సీట్లు సాధించిన పార్టీగా నిలిచినప్పటికీ గతం కంటే ఎందుకు సీట్ల సంఖ్య తగ్గిపోయిందనే చర్చలు కొనసాగుతున్నాయి.
విద్యుత్, నీళ్లు..
రాష్ట్రంలో వ్యవసాయానికి 24 గంటల పాటు ఉచిత విద్యుత్తును అందిస్తున్నారు. నగరాల్లో కూడా విద్యుత్ అంతరాయం లేకుండా కొనసాగుతోంది. ఇది ప్రభుత్వానికి ఒక మైలురాయిగా నిలిచిపోయింది. దీంతో పాటు టీఆర్‌ఎస్ అధికారం చేపట్టిన 2014 నుంచి విద్యుత్ చార్జీలు కూడా పెరగలేదు. దీనిపై ప్రజలు సంతృప్తిగానే ఉన్నారు. నీటి సరఫరాలో కూడా రాష్ట్రంలో మెరుగుదల కనిపిస్తోంది. కాకపోతే 24 నీళ్లు ఇంకా చాలా ప్రాంతాల్లో అమలులోకి రాలేదు.
జిల్లాల పెంపు
ప్రజల వద్దకే పాలనను చేర్చాలన్న అభిమతంతో ప్రభుత్వం రాష్ట్రంలో కొత్త జిల్లాలు, కార్పొరేషన్లు, మునిసిపాలిటీలు, గ్రామపంచాయతీలను ఏర్పాటు చేసింది. 10 జిల్లాలను పునర్‌వ్యవస్థీకరించి 33 జిల్లాలుగా చేసింది. దీని వల్ల పాలనలో కొంత పారదర్శకత కనిపిస్తోంది. అయితే ఆ స్థాయిలో ఉద్యోగాల కల్పనలో వెనకబడినట్లు ఆరోపణలు ఉన్నాయి.
వైద్యరంగంలో పురోభివృద్ధి
టీఆర్‌ఎస్ పాలనలో వైద్య రంగం పురోభివృద్ధి సాధిస్తోంది. ప్రధానంగా జీహెచ్‌ఎంసీ పరిధిలోని బస్తీ దవాఖానాలు ప్రజలకు విశేషమైన సేవలందిస్తున్నాయి. నిరుపేదలకు వైద్య సేవలు చేరువయ్యేలా మరిన్ని బస్తీ దవాఖానాలు అందుబాటులోకి రానున్నాయి. గ్రేటర్‌లో ఇప్పటి వరకు 225 బస్తీ దవాఖానాలు అందుబాటులో ఉన్నాయి. ఢిల్లీ మొహల్లా క్లినిక్‌ల తరహాలో గ్రేటర్‌లో బస్తీ దవాఖానాల ఏర్పాటుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. దేశ రాజధానిలో నామమాత్రపు రుసుములో వైద్య సేవలందిస్తుండగా.. ఇక్కడ ఉచితం. పలు ప్రాంతాల్లోని బస్తీ దవాఖానాల్లో కేన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులనూ గుర్తిస్తున్నారు. 25 దవాఖానాలు త్వరలో ప్రారంభించనున్నట్టు జీహెచ్‌ఎంసీ అధికారులు చెబుతున్నారు.
ఖ్యాతిని పెంచిన మిషన్ కాకతీయ
చెరువుల పూడికతీత, పునరుద్ధరణ కోసం ఉద్దేశించిన మిషన్ కాకతీయ పథకం తెలంగాణ ఖ్యాతిని పెంచింది. అయితే తొలివిడతలో ఉన్నంత శ్రద్ధ ఇప్పుడు లేదనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. రాష్ట్రంలోని మొత్తం 46,531 చెరువులను పునరుద్ధరించాలని నిర్ణయించినప్పటికీ చాలా చెరువుల పనులను చేపట్టారు. అత్యధిక భాగం పూర్తయ్యాయి. ఆరేళ్ల క్రితం ఇచ్చిన డబుల్ బెడ్ రూం ఇళ్ల హామీ ఇప్పటికీ పూర్తి స్థాయిలో అమలు కావడం లేదు.
చేటు తెచ్చిన వరదలు
రెండు నెలలు క్రితం తెచ్చిన వరదలు మహానగరాన్ని ముంచెత్తాయి. అనూహ్య విపత్తుతో ప్రభుత్వం నివారణ చర్యలు చేపట్టినప్పటికీ బాధితులు సంతృప్తి చెందలేదు. ప్రధానంగా వరద సహాయం పంపిణీ రూ.10 వేలు అందించడంలో తలెత్తిన వివాదాలు మైనస్‌గా మారాయి. వందలాది మంది రోడ్డెక్కి టీఆర్‌ఎస్ నేతలపై ఆరోపణలు గుప్పించారు. పంపిణీలో సరైన ప్రణాళిక లోపించడంతో వివాదాలు తలెత్తాయి.
నెరవేరని డబుల్ ఇళ్ల లక్ష్యం
రాష్ట్రంలో 2.5 లక్షల ఇళ్లను నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకున్నప్పటికీ అది పూర్తి స్థాయిలో నెరవేరలేదు. ప్రధానంగా డిసెంబర్ నాటికి 75 వేల రెండు పడకల ఇళ్లు సిద్ధమవుతాయని ప్రభుత్వం ప్రకటించింది. ఇప్పటి వరకు ఆ దిశగా అడుగులు పడడం లేదు. అన్ని పనులు పూర్తయి 40 వేల ఇళ్లు సిద్ధంగా ఉన్నా.. లబ్ధిదారుల ఎంపిక మొదలు కాలేదు. దాదాపు 90 వేల వరకు సిద్ధమయ్యాయని ప్రభుత్వం చెబుతోంది. కానీ… 3 వేల వరకే లబ్ధిదారులకు పంచినట్లు తెలుస్తోంది. సొంత స్థలం ఉంటే ఇంటి నిర్మాణం కోసం రూ.5. లక్షలు ఇస్తామని ప్రకటించినా అది కూడా ఆచరణకు నోచుకోలేదని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. ఇంకా ఎన్నో మెరుపులు.. మరకలు టీఆర్‌ఎస్ పాలనలో వెలుగుచూశాయి.