iDreamPost
iDreamPost
మనీ యాప్‌లు.. ప్రస్తుతం మనుష్యుల ప్రాణాలను నిలువునా తీస్తున్న ప్రమాదాల్లో ఇవి కూడా భాగమైపోయాయి. ఎవ్వరో తెలీదు? ఎక్కడుంటారో అర్ధం కాదు? అడిగిన వెంటనే డబ్బులు అక్కౌంట్‌లోకి వచ్చేస్తుంటాయి? ఈ వ్యవహారంలో పైకి కన్పించేది మాత్రం ఇదే. కానీ లోనికి తొంగిచూస్తే అనేకానేక అకృత్యాలు వెలుగు చూస్తున్నాయి. ఒక రకంగా దేశంలోని భద్రతా విభాగాల పనితీరును కూడా ప్రశ్నిస్తున్నాయనే చెప్పాలి.
ఆర్ధికపరమైన కార్యకలాపాలు మన దేశంలో నిర్వహించాలంటే తప్పని సరిగా రిజర్వు బ్యాంకు అనుమతి ఉండాలి. కానీ బ్యాంకింగ్ సంస్థల నిఘా విభాగాల కళ్ళుగప్పి ఈ మనీ యాప్‌లు దేశంలో విచ్చలవిడిగా కార్యకలాపాలు సాగించేస్తున్నారంటే వీటిపై పర్యవేక్షణలో ఉన్న డొల్లతనం అర్ధమవుతుంది. దాదాపు 30 యాప్‌లకు సంబంధించి లక్ష మంది యాక్టివ్ వినియోగదారులు వీటి ద్వారా రుణాలు పొందారని పోలీస్‌లు చేపట్టిన విచారణలో వెలుగుచూసింది. అంటే ప్రస్తుతం అప్పు రన్ అవుతున్న వాళ్ళుమాత్రమే వీళ్ళు. ఇంతకు ముందు కూడా అప్పులు పొంది, తమ కష్టార్జితాని నిలువుదోపిడీ సమర్పించుకున్న వాళ్ళు ఇంకెంత మంది ఉండారో అర్ధం చేసుకోవచ్చు.
తెలంగాణా పోలీస్‌లు చేపట్టిన విచారణలో విస్మయపరిచే విషయంలు వెలుగుచూసాయి. గుర్‌గావ్, ఢిల్లీ, హైదరాబాద్‌లలో దాదాపు 1100 మంది సిబ్బంది ఈ యాప్‌ల కోసం కాల్‌సెంటర్లలో పనిచేస్తున్నట్లు బైటపడింది. అప్పు చెల్లించని వాళ్ళకు ఫోన్‌చేసి ఇష్టమొచ్చినట్లు మాట్లాడేది ఈ కాల్‌సెంటర్ల నుంచేనని చెబుతున్నారు. అప్పును వెంటనే వసూలు చేసినందుకు ఈ కాల్‌సెంటర్ల సిబ్బందికి భారీగా నజరానాలు కూడా ఉంటాయని వెలుగుచూసింది. అంటే తమకొచ్చే నజరానాల కోసం ఎదుటి వ్యక్తిని నోటకొచ్చిన తిట్లన్నీ తిడుతుంటారన్న మాట. ఇందుకోసం దాదాపు 700 ల్యాప్‌టాప్‌లు, పదికిపైగా బ్యాంకు ఖాతాలను వినియోగిస్తున్నారు. వీటన్నిటినీ పోలీస్‌లు స్వాధీనం చేసుకున్నారు. సాంకేతిక పరమైన అన్ని∙ఆధారాలతో సహా పకడ్భంధీగా దర్యాప్తును ముందుకు నడుపుతున్నారు.
ఈ వ్యవహారంలో కీలకంగా భావిస్తున్న ముగ్గురు వ్యక్తులతో పాటు ఇప్పటి వరకు మొత్తం పదకొండు మందిని అదుపులోకి తీసుకుని పోలీస్‌లు విచారిస్తున్నారు. దాదాపు 60 వరకు ఈ మనీయాప్‌లపై ఫిర్యాదులు పోలీస్‌లకు చేరాయి. ఏపీలో సైతం ఇటువంటి దోపిడీలపై ఫిర్యాదు చేయాలని పోలీస్‌లు కోరారు.
అసలు ఎంత మొత్తంలో ఈ రుణ దందా నడుస్తుందన్నది ఇంకా వెల్లడి కాకపోయినప్పటికీ దీంట్లో విదేశీ హస్తాల ప్రమేయాన్ని పోలీసులు అనుమానిస్తున్నారు. నిర్వాహకులు ఇక్కడి వారే ఉన్నప్పటికీ యాప్‌లను కంట్రోల్ చేసేది విదేశీయులేనంటున్నారు. ఈ నేపథ్యంలో లోతైన దర్యాప్తును ముమ్మరం చేసారు. తద్వారా ఈ యాప్‌లకు సంబంధించిన ఇంకెన్ని ‘సిత్రాలు’ బైటకు వస్తాయో చూడాలి మరి.