Tollywood Sankranthi : బంగారం లాంటి సీజన్ వృథా అయిపోయింది

టాలీవుడ్ ఇలాంటి సంక్రాంతిని చూసి దశాబ్దం పైనే అయ్యింది. తెలుగు సినిమాకు ఎంత ప్రాముఖ్యం కలిగిన ఈ పండగ సీజన్ ఈసారి చాలా నీరసంగా గడిచిపోయింది. బంగార్రాజు లేకపోతే పరిస్థితి ఇంకా దారుణంగా ఉండేది కానీ నాగార్జున ధైర్యం చేసి రిలీజ్ కు సిద్ధపడటం మంచిదయ్యింది. కాకపోతే రౌడీ బాయ్స్, హీరో ఆశించిన ఫలితాలను అందుకోలేకపోవడం నిరాశ పరిచింది. సూపర్ మచ్చి గురించి మాట్లాడుకోకపోవడం మంచిది. ఇప్పటిదాకా ఈ నాలుగు కలిసి 50 కోట్ల మార్కు అందుకోవడానికే నానా తంటాలు పడ్డాయి. అక్కడికి బంగార్రాజు ఒక్కటే 35 కోట్ల దగ్గరకు వెళ్లి కళను తీసుకొచ్చింది కానీ లేదంటే ఏం జరిగేదో ఊహించుకోలేం.

గత ఏడాది ఇదే టైంలో కరోనా ఆంక్షలు ఉన్నప్పటికీ క్రాక్, మాస్టర్, రెడ్ లు బాగానే వసూళ్లు రాబట్టుకున్నాయి. అల్లుడు అదుర్స్ అంత డిజాస్టర్ అయినప్పటికీ ప్రమోషన్ లో తెచ్చుకున్న హైప్ వల్ల ఓ మోస్తరు కలెక్షన్లు రాబట్టుకుంది. వీటన్నిటిలోనూ స్టార్లు ఉన్నారు కాబట్టి ఆడియన్స్ థియేటర్ల దాకా వచ్చారు. కానీ ఈసారి బంగార్రాజు మినహాయించి మిగిలినవాటికి అదే పెద్ద మైనస్ అయ్యింది. మాస్ వీటి మీద ఏ మాత్రం ఆసక్తి చూపించలేకపోయారు. నిర్మాత దిల్ రాజు రౌడీ బాయ్స్ కోసం ఎంత విపరీతమైన ప్రమోషన్లు చేసినప్పటికీ అది మరీ అద్భుతాలు చేయలేకపోయింది. కాకపోతే డెబ్యూ హీరో రేంజ్ కన్నా కొంచెం ఎక్కువ రాబట్టింది అంతే.

మొత్తానికి కారణం ఏదైనా బంగారం లాంటి సీజన్ ఇలా బూడిదలో పోసిన పన్నీరు అయ్యింది. ఇంకా బాక్సాఫీస్ పరిస్థితి ఏ మాత్రం కుదుటపడలేదు. కొత్త రిలీజులు లేకపోవడమే కారణం. రేపు రాబోతున్న గుడ్ లక్ సఖి మీద కనీస బజ్ లేకపోవడం దీనికి ఉదాహరణగా చెప్పుకోవచ్చు. సోలోగా వస్తున్నా సరే బుకింగ్స్ బాగా వీక్ గా ఉన్నాయి. ఏపిలో వంద శాతం ఆక్యుపెన్సీతో పాటు నైట్ కర్ఫ్యూ తీసేస్తే తప్ప పెద్ద నిర్మాతలు డేట్లు ప్రకటించేందుకు సిద్ధంగా లేరు. ఫిబ్రవరి నుంచి అంతా మామూలు అవుతుందనే నమ్మకంతో ట్రేడ్ ఉంది. ఎలా చూసుకున్నా ఫిబ్రవరి 11న రవితేజ ఖిలాడీ వచ్చేదాకా ఈ డ్రై డేస్ ని భరించక తప్పదు మరి.

Also Read : Padma Awards: ‘పద్మశ్రీ’ షావుకారు జానకి – మరి మిగిలినవాళ్లకు ఎప్పుడో

Show comments