Tollywood కీలక మార్పుల దిశగా టాలీవుడ్

ఆగస్ట్ 1 నుంచి షూటింగులు ఆపేసి సమస్యల పరిష్కారానికి చర్చలు జరుపుతున్న ప్రొడ్యూసర్స్ గిల్డ్, ఫిలిం ఛాంబర్ లు ఎట్టకేలకు ఒక్కో అంశానికి సంబంధించి పలు నిర్ణయాలు తీసుకున్నట్టుగా కనిపిస్తోంది. వచ్చే వారం నుంచి స్ట్రైక్ కి ముగింపు పలికి సవరణలు, నిబంధనలు ప్రకటించే దిశగా ప్రణాళిక వేస్తున్నారు. ఇకపై ఓటిటి గ్యాప్ ఎనిమిది వారాలు ఉండాలనే విషయంలో దాదాపు అందరూ ఏకాభిప్రాయానికి వచ్చినట్టు తెలిసింది. ఫ్లాప్ అయిన చిత్రాలకు, మీడియం బడ్జెట్ మూవీస్ కి దీని వల్ల ప్రాక్టికల్ గా సమస్యలు ఉన్నప్పటికీ కొన్ని నెలలు పరిశీలన చేయాలని డిసైడ్ చేశారట. ఒకవేళ ఓటిటి టెంప్ట్ చేసేలా ఆఫర్లిచ్చినా నో చెప్పాలనే నిశ్చయంతో ఉన్నారట.

ఆర్టిస్టుల రెమ్యునరేషన్లను సైతం సినిమా మొత్తానికి కలిపి ఇవ్వాలి తప్పించి రోజువారీగా కాదనే ప్రతిపాదనకు సైతం గ్రీన్ సిగ్నల్ లభించినట్టు తెలిసింది. ముఖ్యంగా తమ స్టాఫ్ ఖర్చులను కూడా తడిసి మోపెడు చేసి నిర్మాతల నెత్తిన వేస్తున్న వైనానికి బ్రేక్ వేయాలని నిశ్చయించుకున్నారు. హీరో హీరోయిన్ కాకుండా ఇంకెవరైనా సరే వాళ్ళ సిబ్బంది వ్యయంతో కలుపుకుని పారితోషికం అడగాలి. ఒకవేళ ప్రొడ్యూసర్ కి అది ఓకే అనిపిస్తే ఇబ్బంది లేదు. లేదు వాళ్లకు విడిగా ఇవ్వాల్సిందేనని పట్టుబడితే మాత్రం వేరే ఆర్టిస్టులను ఎంచుకునే విధంగా కఠినంగా ఉండాలని ఫిక్స్ అయ్యారట. ఒక్కొక్కటిగా అమలు చేస్తూ పోతే మార్పు అసాధ్యమేమీ కాదన్నది వీళ్ళ అభిప్రాయం

సినీ కార్మికుల వేతనాలకు సంబంధించి కూడా ఒకటి రెండు రోజుల్లో ఒక కంక్లూజన్ కు రాబోతున్నారు. థియేటర్లలో సినిమాలు చూసేందుకు ప్రేక్షకులు సిద్ధంగా ఉన్నారని బింబిసార, కార్తికేయ 2, సీతారామంలు ఋజువు చేశాయి. అది కూడా కేవలం పది రోజుల వ్యవధిలో. అలాంటప్పుడు కంటెంట్ మీద దృష్టి పెట్టకుండా ఆడియన్స్ ని నిందించి లాభం లేదని ఎట్టకేలకు దర్శక రచయితలకు అర్థమవుతోంది. సో ఇప్పుడు తీసుకురాబోయే కండీషన్లను కనీసం ఏడాది పాటు అమలు పరిస్తే ఫలితాలు బాగుంటాయి. ఎవరికి వారే యమునా తీరే అన్నట్టు వ్యవహరించకుండా ఒకే మాట మీద ఉంటే ఇన్ని రోజుల బందుకు సార్థకత చేకూరుతుంది. చూద్దాం

Show comments