బ్రేకింగ్ : శంషాబాద్ ఎయిర్ పోర్టులో విమానం హైజాకంటూ బెదిరింపులు!

హైదరాబాద్‌లోని శంషాబాద్‌లో ఉన్న రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో గందరగోళ పరిస్థితి నెలకొంది. ఎయిర్ పోర్టులో విమానాశ్రయం అధికారులు ఒక్కసారిగా హై అలర్డ్ విధించారు. భారీ కట్టుదట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. పోలీసులు విమానాశ్రయంలో ముమ్మరంగా తనిఖీలు చేస్తున్నారు. పార్కింగ్, విమానాశ్రయం లోపల అనేక ప్రాంతాల్లో పోలీసులు డాగ్, బాంబు స్క్వాడ్స్ తో తనిఖీలు చేస్తున్నారు. అయితే అధికారుల హడావుడి చూసి ప్రయాణీకులు భయభ్రాంతులకు గురయ్యారు. ఏం జరుగుతుందో.. ఈ తనిఖీలు ఎందుకో అర్థం కాక భయాందోళన చెందారు. కొంత మంది మాక్ డ్రిల్ అన్న సందేహాన్ని వెలిబుచ్చారు. కానీ అంతలో ఏం జరిగిందో తెలుసుకుని కాస్త ఊపిరి పీల్చుకున్నారు.

ఇంతకు ఈ హడావుడి ఎందుకంటే.. శంషాబాద్ ఎయిర్ పోర్టుకు బెదిరింపు వచ్చింది. ఎయిర్ పోర్టులో విమానం హైజాక్ చేయబోతున్నట్లు అధికారులు బెదిరింపు మెయిల్ వచ్చింది. హైదరాబాద్ నుండి దుబాయ్ వెళ్లే విమానాన్ని హైజాక్ చేయబోతున్నట్లు అందులో రాసుకొచ్చారు. ఈ మెయిల్ చూసిన అధికారులు.. భద్రతా సిబ్బందిని అలర్ట్ చేశారు. తొలుత దుబాయ్ వెళ్లే విమానాన్ని ఆపి క్షుణ్ణంగా తనిఖీలు చేశారు. అలాగే విమానాశ్రయం లోపల, బయట బాంబు, డాగ్ స్వ్కాడ్స్ తో తనిఖీలు చేశారు. అదే సమయంలో ఈ మెయిల్ ఎక్కడ నుండి వచ్చిందోనన్న దానిపై అధికారులు ఆరా తీస్తున్నారు. ఇది ఫేక్ మెయిలా లేదా ఎవరైనా ఆకతాయిలు పనా అన్న కోణంలో కూడా విచారణ జరుపుతున్నారు.

Show comments