Idream media
Idream media
క్రికెట్ ప్రపంచంలో అత్యంత ఆదరణ పొందిన టీ-20 లీగ్ టోర్నీ ఐపీఎల్-2020 గత మార్చి 29 న ప్రారంభం కావలసి ఉంది.అయితే దేశంలో కరోనా విజృంభణ నేపథ్యంలో ఐపీఎల్ 13వ సీజన్‌ని బీసీసీఐ నిరవధికంగా వాయిదా వేసిన సంగతి తెలిసిందే.కాగా ఇప్పటివరకు దిగ్విజయంగా ముగిసిన 12 ఐపీఎల్ ఎడిషన్‌లలో భారత ఆటగాళ్లతో పాటు విదేశీ ప్లేయర్‌లు కూడా బ్యాటింగ్, బౌలింగ్ విభాగాలలో అద్భుత ప్రతిభ కనపరిచారు. ఇక ఐపీఎల్-2008 నుండి ఐపీఎల్-2013 వరకు మొత్తం ఆరు సీజన్‌లలో బ్యాటింగ్‌లో అత్యధిక పరుగులు సాధించి ఆరెంజ్ క్యాప్ గెలుపొందిన బ్యాట్స్‌మెన్‌ల రికార్డులు ఒకసారి పరిశీలిద్దాం….
1) షాన్ మార్ష్ (కింగ్స్ ఎలెవన్ పంజాబ్):
ఐపిఎల్ 2008 తొలి ఎడిషన్‌లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ ఫ్రాంచైజ్ తరఫున ఆస్ట్రేలియా బ్యాట్స్‌మన్ షాన్ మార్ష్ 11
మ్యాచ్‌లలో 616 పరుగులు చేశాడు.వేలం సమయంలో ఏ ఫ్రాంచైజ్ కొనుగోలు చెయ్యని ఈ ఆసీస్ లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్‌మన్ KXIP జట్టులోకి ప్రత్యామ్నాయంగా వచ్చి ఆ సీజన్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలవడం విశేషం.ఇక 59 ఫోర్లు, 26 సిక్స్‌లు బాదేసిన షాన్ మార్ష్ 139.68 స్ట్రైక్ రేట్‌తో ఒక శతకం,5 అర్థ శతకాలు చేశాడు.అలాగే ఆసీస్ బ్యాట్స్‌మన్ సాధించిన 68.44 సగటు ఐపీఎల్‌లో రెండో అత్యధిక పరుగుల సగటు.
2) మాథ్యూ హేడెన్ (చెన్నై సూపర్ కింగ్స్):
భారత్‌లో పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో దక్షిణాఫ్రికాలో జరిగిన ఐపీఎల్-2009 రెండవ ఎడిషన్‌లో ఆస్ట్రేలియా ఓపెనర్ మాథ్యూ హేడెన్ బ్యాటింగ్‌లో 572 పరుగులతో ఆరెంజ్ క్యాప్ గెలిచాడు.చెన్నై సూపర్ కింగ్స్ తరుపున 12 మ్యాచ్‌లలో బరిలో దిగిన హేడెన్ 144.81 స్ట్రైక్ రేటుతో 60 ఫోర్లు,22 సిక్స్‌లు కొట్టాడు.అలాగే ఈ ఆసీస్ బ్యాట్స్‌మెన్ 89 పరుగుల అత్యధిక స్కోర్‌తో ఐదు అర్థసెంచరీలు సాధించాడు.
3)సచిన్ టెండూల్కర్ (ముంబై ఇండియన్స్):
ఐపిఎల్ మూడవ సీజన్‌లో లెజెండ్ బ్యాట్స్‌మన్ సచిన్ టెండూల్కర్ 15 మ్యాచ్‌లలో 618 పరుగులు సాధించి ఆరెంజ్ క్యాప్ చేజిక్కించుకున్నాడు.ఈ పరుగుల సాధనలో 132.61 స్ట్రైక్ రేట్‌తో ముంబై ఇండియన్స్ కెప్టెన్ సచిన్ 86 ఫోర్లు,3 సిక్స్‌లు బాదాడు.అలాగే మాస్టర్ బ్లాస్టర్ సచిన్ 89 పరుగుల అత్యధిక స్కోరుతో ఐదు అర్థ సెంచరీలు చేశాడు.ఐపీఎల్ 12 సీజన్‌లోను అత్యధిక పరుగులు సాధించిన బ్యాట్స్‌మన్‌లలో కేవలం ఒక అంకె (3)లో సిక్స్‌లు కొట్టిన ఆటగాడు సచిన్ ఒక్కడే కావడం గమనార్హం.
4) క్రిస్ గేల్ (రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు):
పొట్టి ఫార్మాట్‌లో అత్యంత విధ్వంసక బ్యాట్స్‌మన్‌లలో ఒకరిగా పేరు గడించిన క్రిస్ గేల్ కోల్‌కతా నైట్ రైడర్స్ తరఫున ఆడుతున్నప్పుడు పెద్దగా పరుగులు సాధించలేదు.ఐపిఎల్ మొదటి సీజన్‌లలో జమైకన్ వీరుడు క్రిస్ గేల్ తన స్థాయికి తగ్గ బ్యాటింగ్ ప్రదర్శన చెయ్యడంలో విఫలమై విమర్శలకు గురయ్యాడు.కానీ 2011 ఎడిషన్‌లో అతని సేవలను రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కొనుగోలు చేయడంతో కరేబియన్ బ్యాట్స్‌మన్ స్టార్ ఒక్కసారిగా మారిపోయింది. ఐపీఎల్ 2011,2012 సీజన్‌లలో ఆర్‌సిబి తరఫున వరుసగా 608, 733 పరుగులు చేసిన గేల్ వరుసగా ఆరెంజ్ క్యాప్స్ గెలుచుకున్నాడు.
ఐపీఎల్-2011 సీజన్‌లో 183.13 తో అత్యధిక స్ట్రైక్ రేట్ సాధించాడు.ఈ కరేబియన్ వీరుడు 67.55 సగటుతో 3 అర్థ సెంచరీలు,2 సెంచరీలు చేశాడు.ఇందులో 57 ఫోర్లు,44 సిక్స్‌లు కొట్టాడు.ఇక 2012 ఐపీఎల్‌లో మరోసారి 61 కి పైగా సగటుతో 7 అర్థ సెంచరీలు,ఒక సెంచరీ సాధించాడు.ఐపీఎల్ ఐదవ సీజన్‌లో 59 సిక్స్‌లు బాది ఇప్పటివరకూ ఒక ఎడిషన్‌లో అధిక సిక్స్‌లు కొట్టిన బ్యాట్స్‌మెన్‌గా ఘనత సాధించాడు.
5) మైఖేల్ హస్సీ (చెన్నై సూపర్ కింగ్స్):
ఐపీఎల్-2013 సీజన్‌లో ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ మైఖేల్ హస్సీ చెన్నై సూపర్ కింగ్స్ రన్నరప్‌గా నిలవడంలో కీలక పాత్ర పోషించి ఆరెంజ్ క్యాప్ విజేతగా నిలిచాడు. ఐపీఎల్ ఒక ఎడిషన్‌లో అత్యధికంగా 17 మ్యాచ్‌లు ఆడిన ఆసీస్ ఎడమచేతి వాటం బ్యాట్స్‌మన్ 52.35 సగటుతో 733 పరుగులు సాధించాడు.ఈ సీజన్‌లో హస్సీ 95 పరుగుల అత్యధిక స్కోర్‌తో 6 అర్థ సెంచరీలు చేసి తన ఫ్రాంచైజ్ CSK ను ఫైనల్‌కు చేర్చాడు. మొత్తం మీద 129.05 స్ట్రైక్ రేట్‌తో 81 ఫోర్లు,17 సిక్స్‌లు సాధించాడు.